‘కనీసం వార్మప్ మ్యాచ్‌లైనా ఆడండి’
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంది. నాలుగు గ్రూపుల నుంచి సత్తా చాటి టాపర్లుగా నిలిచిన జట్లు సూపర్-8లో అడుగుపెట్టాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి జింబాబ్వే, శ్రీలంక.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్ రేసులో నిలిచాయి.
పసికూనలతో పాటు ఆసీస్ కూడా..
ఇక మిగిలిన జట్లు గ్రూప్-ఎ నుంచి అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా.. ‘బి’ నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్.. ‘సి’ నుంచి స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్.. ‘డి’ నుంచి అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా గ్రూప్ దశలోనే నిష్క్రమించాయి. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ క్రికెటర్ బాస్ డి లీడె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐసీసీకి డిమాండ్
భారత్, ఆస్ట్రేలియాలాంటి జట్లతో ముక్కోణపు సిరీస్‌లు ఆడే భాగ్యమైతే దక్కనే దక్కదు... కనీసం ఇలాంటి మేటి ప్రత్యర్థులతో వార్మప్ మ్యాచ్‌లైనా ఏర్పాటు చేయండని అతడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని కోరాడు. అసోసియేట్ జట్ల ఆట ఎప్పుడో ఒకసారి అది కూడా ఐసీసీ ప్రపంచకప్‌ల వరకే పరిమితమవుతోందని అన్నాడు.
గట్టి ప్రత్యర్థులతో ఆడే అవకాశం తరచు దక్కడం లేదని లీడె వాపోయాడు. నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ టిమ్ డి లీడె కుమారుడైన బాస్ డి లీడె ప్రస్తుతం డచ్ తరఫున టీ20 వరల్డ్‌కప్ ఆడాడు. గ్రూప్ దశలో భారత్‌తో చివరి మ్యాచ్ ఆడిన నెదర్లాండ్స్ ఓటమితో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించింది.
కనీసం వార్మప్ మ్యాచ్‌లైనా ఆడండి
‘ప్రస్తుత ఐసీసీ భవిష్యత్ పర్యటనల కార్యక్రమం, ప్రపంచ వ్యాప్త టి20 లీగ్‌లతో భారత్, ఆసీస్ లాంటి శాశ్వత దేశాలు, ఆటగాళ్లు ఊపిరి సలపని బిజీ షెడ్యూల్‌తో ఉంటారని మాకు తెలుసు. ఈ నేపథ్యంలో ఘనాపాఠిలతో మాకు ద్వైపాక్షిక సిరీస్‌లు, ముక్కోణపు సిరీస్‌లంటే అది అయ్యే పని కాదు.
నేరుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఏర్పాటు చేయలేక పోయినా... ఈ అంతర్జాతీయ మేటి ప్రత్యర్థులతో వార్మప్ మ్యాచ్‌లైనా ఆడిస్తే మా జట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. ఎప్పుడో ఓసారి జరిగే మెగా ఈవెంట్‌లో ఆడటం... అక్కడితో మా అంతర్జాతీయ క్రికెట్ (మేటి జట్లతో) అటకెక్కడం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది’ అని లీడె అన్నాడు.
చదవండి: T20 WC: సిగ్గులేకుండా అబద్ధాలు.. మా ఆటగాళ్లకే నష్టం: బంగ్లాదేశ్ కోచ్ ఫైర్


