అంతా అయిపోయాక లైన్‌లోకి వచ్చిన ఆసీస్‌.. పసికూనపై ప్రతాపం | T20 WC 2026: Aussies restricted Oman to just 104 runs | Sakshi
Sakshi News home page

అంతా అయిపోయాక లైన్‌లోకి వచ్చిన ఆసీస్‌.. పసికూనపై ప్రతాపం

Feb 20 2026 8:58 PM | Updated on Feb 20 2026 8:58 PM

T20 WC 2026: Aussies restricted Oman to just 104 runs

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆస్ట్రేలియా జట్టు అంతా అయిపోయాక లైన్‌లోకి వచ్చింది. ఈ మెగా టోర్నీలో ఇదివరకే నిష్క్రమించిన ఈ మాజీ ఛాంపియన్‌.. ఇవాళ (ఫిబ్రవరి 20) పసికూన ఒమన్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో సామర్థ్యం మేరకు సత్తా చాటింది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ఆసీస్‌.. ఒమన్‌ను 104 పరుగులకే (16.2 ఓవర్లలో) కుప్పకూల్చింది.

ఒమన్‌ పతనాన్ని స్పిన్నర్లు ఆడమ్‌ జంపా (3.2-0-21-4), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (3-0-13-2) శాశించారు. పేసర్లు జేవియర్‌ బార్ట్‌లెట్‌ (4-0-27-2), నాథన్‌ ఇల్లిస్‌ (2-0-14-1), మార్కస్‌ స్టోయినిస్‌ (2-0-16-1) కూడా పర్వాలేదనిపించారు. మొత్తంగా ఆసీస్‌ బౌలర్ల ధాటికి ఒమన్‌ ఆటగాళ్లు విలవిలలాడిపోయారు. 

ఆ జట్టులో వసీం అలీ (32) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌ (17), హమ్మద్‌ మీర్జా (16), కరణ్‌ సోనావాలే (12) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

ఈ మ్యాచ్‌కు ముందు ఒమన్‌ కెప్టెన్‌ జతిందర్‌ ఆసీస్‌కు చుక్కలు చూపిస్తామని బీరాలు పలికి ఏమీ చేయలేకపోయాడు. ఈ టోర్నీ నుంచి ఆసీస్‌తో పాటు ఒమన్‌ కూడా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌ గ్రూప్‌ దశ మొత్తంలో చివరిది. ఈ టోర్నీలో భారత్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, జింబాబ్వే, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ ఇదివరకే సూపర్‌-8కి చేరాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement