T20 WC 2026: సికందర్‌ రజా ప్రపంచ రికార్డులు | Sikandar Raza Breaks Rohit World Record Becomes 1st Player In History Today | Sakshi
Sakshi News home page

T20 WC 2026: సికందర్‌ రజా ప్రపంచ రికార్డులు

Feb 20 2026 2:15 PM | Updated on Feb 20 2026 3:18 PM

Sikandar Raza Breaks Rohit World Record Becomes 1st Player In History Today

జింబాబ్వే కెప్టెన్‌ సికందర్‌ రజాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అటు సారథిగా.. ఇటు ఆటగాడిగా అతడు సాధిస్తున్న విజయాలే ఇందుకు కారణం. ‘అండర్‌డాగ్‌’గా ఈ టోర్నీ బరిలో దిగిన జింబాబ్వే.. అనూహ్య రీతిలో సూపర్‌-8 దశకు చేరుకుంది.

మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించి మార్గం సుగమం చేసుకున్న జింబాబ్వే.. శ్రీలంకను కూడా ఓడించి గ్రూప్‌-బి టాపర్‌గా నిలిచింది. ఇక శ్రీలంకతో గురువారం నాటి మ్యాచ్‌లో జింబాబ్వే విజయంలో సికందర్‌ రజాదే కీలక పాత్ర. కొలంబో వేదికగా లంక విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

లక్ష్య ఛేదనలో ఓపెనర్లు బ్రియాన్‌ బెన్నెట్‌ (48 బంతుల్లో 63 నాటౌట్‌), తాడివనాషే మరుమాని (34) శుభారంభం అందించగా.. రజా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (26 బంతుల్లో 45)తో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్‌లో రజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ క్రమంలో అతడు సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ప్రపంచ రికార్డులు
అంతర్జాతీయ టీ20లలో అత్యధికంగా ఇరవైసార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న తొలి ఫుల్‌ మెంబర్‌ జట్టు ఆటగాడిగా నిలిచాడు. అదే విధంగా అత్యంత పెద్ద వయసులో ఐసీసీ టోర్నీలో ఈ పురస్కారం పొందిన ఆటగాడిగా భారత దిగ్గజం రోహిత్‌ శర్మ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రజా బద్దలు కొట్టాడు.

కాగా 2025 చాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా రోహిత్‌ 37 ఏళ్ల 335 రోజుల వయసులో POTM పొందగా.. రజా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో తాజాగా 39 ఏళ్ల 301 రోజుల వయసులో  అవార్డు పొందాడు.

టెస్టు హోదా ఉన్న జట్ల (ఫుల్‌ మెంబర్‌) తరఫున అంతర్జాతీయ టీ20లలో అత్యధికసార్లు POTM పొందిన ఆటగాళ్లు
సికందర్‌ రజా- జింబాబ్వే- 20సార్లు
సూర్యకుమార్‌ యాదవ్‌- ఇండియా- 17సార్లు
విరాట్‌ కోహ్లి- ఇండియా- 16సార్లు
మహ్మద్‌ నబీ- అఫ్గనిస్తాన్‌- 14సార్లు.

చదవండి: T20 WC: ‘పీసీబీ చీఫ్‌ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement