‍Asia Cup 2026: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌ | ACC Womens Asia Cup Rising stars 2026: India A Beat Sri Lanka A Enters Final | Sakshi
Sakshi News home page

‍Asia Cup 2026: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

Feb 20 2026 11:22 AM | Updated on Feb 20 2026 11:35 AM

ACC Womens Asia Cup Rising stars 2026: India A Beat Sri Lanka A Enters Final

భారత మహిళా క్రికెట్‌ జట్టు (PC: BCCI Women)

మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌- 2026 టోర్నీలో భారత్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. తొలి సెమీస్‌ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ వేదికగా ఈ టీ20 టోర్నీ ఫిబ్రవరి 13న మొదలైంది.

ఎనిమిది జట్లు
గ్రూప్‌-ఎ నుంచి భారత్‌-ఎ, పాకిస్తాన్‌-ఎ.. యూఏఈ, నేపాల్‌ మహిళా జట్లు పాల్గొనగా.. గ్రూప్‌-బి నుంచి బంగ్లాదేశ​-ఎ, శ్రీలంక-ఎ, థాయ్‌లాండ్‌, మలేషియా మహిళా జట్లు బరిలో నిలిచాయి. ఈ నేపథ్యంలో గ్రూప్‌-ఎ టాపర్లు భారత్‌, పాక్‌.. గ్రూప్‌-బి టాపర్లు బంగ్లాదేశ్‌, శ్రీలంక సెమీ ఫైనల్‌ చేరాయి.

118 పరుగులకే ఆలౌట్‌
ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో భారత్‌-ఎ, శ్రీలంక-ఎ జట్లు శుక్రవారం తలపడ్డాయి. టెర్‌థాయ్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల ధాటికి తాళలేక 19.4 ఓవర్లలో కేవలం 118 పరుగులే చేసి లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది.

రాధా యాదవ్‌కు నాలుగు
ఓపెనర్లు సంజనా కావింది (31), హన్సిమ కరుణరత్నె (14)లతో పాటు సత్య సందీపణి (15), షాశిని గిమ్‌హాని (22) మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో కెప్టెన్‌ రాధా యాదవ్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. తనుజా కణ్వార్‌, ప్రేమా రావత్‌ చెరో రెండు వికెట్లు కూల్చారు. సైమా ఠాకూర్‌, మిన్ను మణి తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

బ్యాటింగ్‌లోనూ ఇరగదీసిన కెప్టెన్‌ 
ఇక లక్ష్య ఛేదనలోనూ భారత మహిళా జట్టు అదరగొట్టింది. ఓపెనర్లలో నందిని కశ్యప్‌ (13) నిరాశపరిచినా.. వ్రిందా దినేశ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (20 బంతుల్లో 42)తో ఆకట్టుకుంది. వన్‌డౌన్‌ బ్యాటర్ల అనుష్క శర్మ (18 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. రాధా యాదవ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (18 బంతుల్లో 31 నాటౌట్‌)తో మెరిసింది.

ఫైనల్లో భారత్‌
మిగిలిన వాళ్లలో తేజల్‌ హసాబ్నిస్‌ (3), మిన్ను మణి (2) విఫలమయ్యారు. అయితే, వ్రిందా వేసిన పునాదిపై అనుష్క, రాధా ఇన్నింగ్స్‌ నిర్మించడంతో 13.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 119 పరుగుల టార్గెట్‌ను భారత్‌ పూర్తి చేసింది. తద్వారా శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.

లంక బౌలర్లలో షాశిని రెండు వికెట్లు తీయగా.. యసాంతి నిమంతికకు ఒక వికెట్‌ దక్కింది. ఇక ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దుమ్ములేపిన రాధా యాదవ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. బంగ్లాదేశ్‌- పాకిస్తాన్‌ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్లో విజేతతో భారత్‌ ఆదివారం నాటి టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది. 

చదవండి: పాకిస్తాన్‌ క్రికెటర్లకు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement