పాకిస్తాన్‌ క్రికెటర్లకు భారీ షాక్‌! | No PAK cricketers in The Hundred 2026 auction IPL linked teams to: Report | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ క్రికెటర్లకు భారీ షాక్‌!

Feb 20 2026 9:53 AM | Updated on Feb 20 2026 11:02 AM

No PAK cricketers in The Hundred 2026 auction IPL linked teams to: Report

పాకిస్తాన్‌ క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ‘ది హండ్రెడ్‌ లీగ్‌’-2026 వేలంలో పాక్‌ ఆటగాళ్లపై అనధికారిక నిషేధం ఉండబోతున్నట్లు సమాచారం. కాగా ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్‌ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే.

ఐపీఎల్‌.. లీగ్స్‌ కా బాప్‌!
అయితే, అన్నింటిలోనూ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) అత్యంత ఆదరణ పొందిన లీగ్‌గా వెలుగొందుతోంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఒక్కసారి ఆడితే ఆటగాళ్ల రాతే మారిపోతుందనేంతలా క్రేజ్‌ సంపాదించింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో పది జట్లు ఉండగా.. ఇందులోని మెజారిటీ ఫ్రాంఛైజీలు విదేశీ లీగ్‌లలోనూ పెట్టుబడులు పెడుతున్నాయి.

సౌతాఫ్రికా లీగ్‌ ‘మనోళ్ల’దే  
ముఖ్యంగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న ఆరు రాంఛైజీలూ ఐపీఎల్‌ జట్ల యజమానుల చేతిలోనే ఉన్నాయి. సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌, ఎంఐ కేప్‌టౌన్‌, డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, జోబర్గ్‌ కింగ్స్‌, పర్ల్‌ రాయల్స్‌, ప్రిటోరియా క్యాపిటల్స్‌.. ఐపీఎల్‌లోని హైదరాబాద్‌, ముంబై, లక్నో, చెన్నై, రాజస్తాన్‌, ఢిల్లీ ఫ్రాంఛైజీల యాజమాన్యంలో కొనసాగుతున్నాయి.

ది హండ్రెడ్‌లోనూ అడుగు
ఇక ఇటీవల ‘ది హండ్రెడ్‌ లీగ్‌’లోనూ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల యజమానులు అడుగుపెట్టారు. మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌, ఎంఐ లండన్‌, సదరన్‌ బ్రేవ్‌, సన్‌రైజర్స్‌ లీడ్స్‌ వీరి చేతుల్లోనే ఉన్నాయి. ఇక ఇంగ్లండ్‌ వేదికగా జరిగే హండ్రెడ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌కు సంబంధించి మార్చి 11న మహిళలు, మార్చి 12న పురుష ప్లేయర్ల వేలం లండన్‌లో జరుగనుంది.

వెయ్యి మంది పేర్లు రిజిస్టర్‌
ఇందుకోసం పద్దెనిమిది దేశాల నుంచి దాదాపుగా వెయ్యి మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో పాకిస్తానీ క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే, మాంచెస్టర్‌, లండన్‌, సదరన్‌ బ్రేవ్‌, సన్‌రైజర్స్‌ యాజమాన్యాలు పాక్‌ క్రికెటర్లను ఎంచుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

పీసీబీ ఓవరాక్షన్‌
టీ20 ప్రపంచకప్‌-2026 నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)పై అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. తమకోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసినా.. బంగ్లాదేశ్‌ కోసమంటూ భారత్‌ను నిందించింది.

బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీ నుంచి బహిష్కరిస్తామని తొలుత ప్రగల్భాలు పలికింది. అనంతరం టీమిండియాతో మ్యాచ్‌ మాత్రమే బాయ్‌కాట్‌ చేస్తామని ప్రకటించింది. అయితే, అందరూ ఊహించినట్లుగానే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందనే భయంతో యూటర్న్‌ తీసుకుని భారత్‌తో ఆడింది. టీమిండియా చేతిలో మరోసారి చిత్తుగా ఓడింది.

ఐపీఎల్‌లో నిషేధం
ఇక ఇప్పటికే పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌ క్రికెటర్లపై ఐపీఎల్‌లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పీసీబీ మరింత ఓవరాక్షన్‌ చేసిన నేపథ్యంలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మాదిరిగానే.. ది హండ్రెడ్‌లోనూ భారత్‌కు చెందిన ఫ్రాంఛైజీలు పాక్‌ క్రికెటర్లను సెలక్ట్‌ చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈసీబీ స్పందన ఇదే
ఈ విషయం గురించి ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB) అధికారి ఒకరు బీబీసీకి అనధికారిక సమాచారం ఇచ్చారు. అయితే, ఈసీబీ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌ గుడ్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘రిజిస్టర్‌ చేసుకున్న ప్రతీ దేశం నుంచి ఆటగాళ్ల కొనుగోలు జరుగుతుంది.

ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను ఎంచుకుంటాయి. ఇంగ్లండ్‌ క్రికెట్‌లో వివక్షకు తావులేదు. ఒకవేళ ఎవరైనా మా నిబంధనలు ఉల్లంఘిస్తే బోర్డు తగిన చర్యలు తీసుకుంటుంది’’ అని పేర్కొన్నాడు.

కాగా మెన్స్‌ హండ్రెడ్‌ లీగ్‌లో మొహమ్మద్‌ ఆమిర్‌, ఇమాద్‌ వసీం, షాహిన్‌ ఆఫ్రిది, షాదాబ్‌ ఖాన్‌, హ్యారిస్‌ రవూఫ్‌ తదితరులు పాల్గొన్నారు. అయితే, వుమెన్‌ హండ్రెడ్‌ లీగ్‌లో ఒక్క పాక్‌ ప్లేయర్‌ కూడా ఇంత వరకు ఆడిన దాఖలాలు లేవు. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో పాటు ILT20లోనూ పాక్‌ ప్లేయర్లపై అనధికారిక నిషేధం కొనసాగుతోంది. 

ఈ లీగ్‌లో భాగమైన అమెరికాకు చెందిన డిజర్ట్‌ వైపర్స్‌ మాత్రమే పాకిస్తాన్‌ను కొంతమంది ఆటగాళ్లను ఎంచుకుంది. ఇదిలా ఉంటే.. ది హండ్రెడ్‌ లీగ్‌లో వంద బంతుల ఆట ఉంటుంది. ఇందులో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి.

చదవండి: T20 WC 2026: అఫ్గాన్ అద్భుత విజ‌యం.. ట్రాట్‌కు ఘన వీడ్కోలు

Advertisement
 
Advertisement
Advertisement