IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్‌ | T20 WC: Mohsin Naqvi Names Actual Hero For Pak India Boycott U Turn | Sakshi
Sakshi News home page

IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్‌

Feb 18 2026 10:49 AM | Updated on Feb 18 2026 11:09 AM

T20 WC: Mohsin Naqvi Names Actual Hero For Pak India Boycott U Turn

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఆది నుంచి పాక్‌ బోర్డు చర్చ చేయడమే ఇందుకు కారణం.

ఈ ఐసీసీ ఈవెంట్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌ మ్యాచ్‌ల కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఉంటామంటూ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాక్‌ ప్రగల్భాలు పలికింది. ఆ దేశ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ స్వయంగా ఈ విషయం గురించి ప్రకటన చేశారు.

మరోసారి చిత్తుగా ఓడి..
అయితే, అందరూ ఊహించినట్లుగానే పాక్‌ మాట మార్చింది. ఐసీసీ జోక్యంతో పాటు.. శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్‌ బోర్డుల నుంచి ఒత్తిడి రావడంతో టీమిండియాతో మ్యాచ్‌ (IND vs PAK) ఆడతామని ప్రకటించింది. కొలంబోలో ఆదివారం భారత్‌తో తలపడి మరోసారి చిత్తుగా ఓడింది.

ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్‌ మొహ్సిన్‌ నక్వీ (Mohsing Naqvi) ముందుగానే స్టేడియం నుంచి వెళ్లిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాము భారత్‌తో మ్యాచ్‌ ఆడటంలో శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిస్సనాయకేదే కీలక పాత్ర అని నక్వీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

అసలైన హీరో మీరే
దిస్సనాయకేతో సమావేశంలో నక్వీ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ, ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ తరఫున మీకు శుభాభినందనలు. నిన్నటి మ్యాచ్‌ (ఆదివారం టీమిండియాతో మ్యాచ్‌) జరగడానికి ముఖ్య కారణం మీరే.

ఈ మ్యాచ్‌ సజావుగా సాగడంలో మీదే కీలక పాత్ర. మీరే హీరో. దాదాపు రెండు బిలియన్ల మంది ప్రేక్షకులు మీ కారణంగా వినోదం పొందగలిగారు. కేవలం మీ చొరవ వల్లే ఈ మ్యాచ్‌ జరిగింది.

టీమిండియాతో ఆడకూడదని మేము నిర్ణయించుకున్నాం. వారితో మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయితే, మా ప్రధానికి మీరు ఎప్పుడైతే ఫోన్‌ చేశారో.. ఆయన వెంటనే నాకు ఫోన్‌ చేసి.. ‘ఇకపై ఎలాంటి సమస్యా లేదు.. మనం టీమిండియాతో మ్యాచ్‌ ఆడుతున్నాం అంతే’ అని అన్నారు. మీకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు.

ఉగ్రదాడిని గుర్తు చేస్తూ లంక లేఖ
కాగా శ్రీలంక జట్టుపై పాక్‌లో గతంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. అదే విధంగా గతేడాది సైతం బాంబుల మోత నడుమ లంక పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ పూర్తి చేసింది. ఈ రెండు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ లంక బోర్డు పాక్‌ బోర్డుకు లేఖ రాసింది. పాక్‌లో తమపై ఉగ్రదాడి జరిగినా తిరిగి ఆ దేశంలో పర్యటించామని గుర్తు చేసింది.

అలాంటిది వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌- పాక్‌ మ్యాచ్‌ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాత రద్దు చేసుకుంటామనడం సరికాదని హెచ్చరించింది. మరోవైపు.. ఐసీసీ సైతం కఠిన చర్యలకు ఉపక్రమిస్తామనే సందేశం ఇచ్చింది. ఈ క్రమంలో యూటర్న్‌ తీసుకున్న పాక్‌ టీమిండియాతో మ్యాచ్‌ ఆడింది. 

చదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement