ఐసీసీ టోర్నీల్లో దారుణంగా పతనమవుతున్న ఆసీస్‌ గ్రాఫ్‌ | After winning 2023 WC, Aussies continuous failures in ICC Tourneys | Sakshi
Sakshi News home page

ఐసీసీ టోర్నీల్లో దారుణంగా పతనమవుతున్న ఆసీస్‌ గ్రాఫ్‌

Feb 17 2026 8:05 PM | Updated on Feb 17 2026 9:50 PM

After winning 2023 WC, Aussies continuous failures in ICC Tourneys

ప్రపంచ మేటి క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియా గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. 2023 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆ జట్టు వరుసగా నాలుగు మెగా టోర్నీల్లో రిక్త హస్తాలతో వెనుదిరిగింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 దశలో నిష్క్రమించిన ఈ 2021 ఎడిషన్‌ జగజ్జేత.. గతేడాది ఛాంపియన్స్‌ ట్రోఫీలో సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టింది.

ఆతర్వాత జరిగిన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో మట్టికరిచిన ఈ 2021-23 ఎడిషన్‌ ఛాంపియన్‌.. ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 ప్రపంచకప్‌ నుంచి గ్రూప్‌ దశలోనే పలాయనం చిత్తగించింది.

పలు దశాబ్దాలుగా ప్రపంచ క్రికెట్‌ను మకుటంలేని మారాజుగా శాశిస్తున్న​ ఆస్ట్రేలియాకు ఉన్నట్టుండి ఈ దుస్థితి ఏంటని పరిశీలిస్తే.. పలు ఆసక్తికర విషయాలు బయటకి వస్తాయి. ఇందులో మొదటిది, అతి ముఖ్యమైనది ఆ జట్టుకు వెన్నతో పెట్టిన తలపొగరు. అనాదిగా ఆసీస్‌ ఆటగాళ్లు ఇదే తలపొగరుతో ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లను తక్కువ చేస్తూ వచ్చారు.

ఇటీవలికాలంలో వారికి ఆ తల పొగరు మరీ ఎక్కువైంది. ఎంతలా అంటే, ప్రతి క్రికెటర్‌ జీవితంలో ఒక్కసారైనా తన చేతులతో పైకెత్కుకోవాలని భావించే ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టి, కెమెరాలకు ఫోజులిచ్చేంతలా. 2023 వన్డే ప్రపంచకప్‌ గెలిచిని తర్వాత ప్రస్తుత ఆసీస్‌ టీ20 జట్టు కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ బీరు తాగుతూ ప్రపంచకప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టాడు. ఆ క్షణమే ఆసీస్‌ పతనం ప్రారంభమైనట్లుంది.

విజయగర్వం తలకెక్కి మార్ష్‌ చేసిన ఆ పనికి ఆసీస్‌ క్రమంగా మూల్యం చెల్లించుకుంటూ వస్తుంది. తాజాగా అదే మార్ష్‌ సారథ్యంలోని ఆసీస్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌ 2026లో పసికూన అయిన జింబాబ్వే చేతిలో దారుణంగా ఓడి, గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఆసీస్‌ జట్టు ఐసీసీ టోర్నీల్లో ఇటీవలికాలంలో పలచన పడటానికి మరో కారణం ఆ జట్టు స్టార్‌ ఆటగాళ్లు. ప్రపంచ మేటి ఆటగాళ్లుగా చెప్పుకోబడే ఆ స్టార్‌ ఆటగాళ్లకు ఐసీసీ టోర్నీలంటే చులకన భావం. వారు యాషెస్‌ సిరీస్‌ లాంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తారు కానీ, ప్రపంచ దేశాలనీ​ పాల్గొనే మెగా టోర్నీలకు ఇవ్వరు. కారణం ఎంటో వారికే తెలియాలి. 

గాయాలు చిన్నవైనా వారు ఇటీవలికాలంలో వాటి బూచిని చూపించి ఐసీసీ టోర్నీల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు కూడా ఇదే జరిగింది. ప్రస్తుత ఆసీస్‌ జట్టులోని స్టార్లు పాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ గాయాల పేరు చెప్పి, పొట్టి ప్రపంచకప్‌కు డుమ్మా కొట్టారు. వీరు లేని లోటు ఆసీస్‌ జట్టులో సుస్పష్టంగా కనిపించింది.

ఇటీవలికాలంలో ఆసీస్‌ పతనానికి మరో కారణంగా ఆ జట్టు ఆటగాళ్లకు భారత​ ఉపఖండంపై ఉన్న చిన్నచూపు. మొదటి నుంచి వారు ఉపఖండంలో పర్యటించాలంటే ఎక్కువగా ఇష్టపడే వారు కాదు. ఇటీవలికాలంలో అది కాస్త ఎక్కువైంది. 

ఐపీఎల్‌ లాంటి ప్రపంచ ప్రఖ్యాత లీగ్‌ల్లో దండిగా డబ్బులు ముట్టజెప్పినా, ఎందుకో వారు ఉపఖండంలో ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఒకవేళ ఐపీఎల్‌లో ఆడినా కేవలం కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటారు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌లో ఇది చాలా స్పష్టంగా బయటపడింది. ఈ విషయంలో వారి సమస్య ఏమిటో వారు స్వయంగా నోరు విప్పితే కానీ తెలీదు.

పై విషయాల్లో వాస్తవాస్తవాలు పక్కన పెడితే.. ఆసీస్‌ జట్టు 2026 టీ20 ప్రపంచకప్‌ నుంచి గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడానికి మాత్రం వారి తలపొగరే కారణమని మెజారిటీ శాతం ​క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఆస్ట్రేలియా జట్టు ఓసారి (2021-23) వరల్ట్‌ టెస్ట్‌ ఛాంపియన్‌గా.. ఆరు సార్లు (1987, 1999, 2003, 2007, 2015, 2023) వన్డే ప్రపంచకప్‌ విజేతగా.. ఓసారి (2021) పొట్టి ప్రపంచకప్‌ జగజ్జేతగా నిలిచి ‍ప్రపంచ క్రికెట్‌పై ఏకఛత్రధిపత్యం చలాయించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement