టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 17) రాత్రి 7 గంటలకు మొదలైన నామమాత్రపు మ్యాచ్‌లో స్కాట్లాండ్, నేపాల్ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ ఓ మోస్తరు స్కోర్ చేసింది.
ఓపెనర్ మైఖేల్ జోన్స్ (45 బంతుల్లో 71; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ద సెంచరీతో సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్కాటిష్ ఇన్నింగ్స్‌లో జోన్స్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు.
మరో ఓపెనర్ జార్జ్ మున్సే (27), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (25), కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (10), మార్క్ వాట్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో టామ్ బ్రూస్ (5), మాథ్యూ క్రాస్ (4), మైఖేల్ లీస్క్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.
నేపాల్ బౌలర్లలో సోమ్‌పాల్ కామీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇతను 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. మరో బౌలర్ నందన్ యాదవ్ కూడా పర్వాలేదనిపించాడు. ఇతను 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
కుషాల్ భుర్టెల్, కెప్టెన్ రోహిత్ పౌడెల్ తలో వికెట్ తీశారు. ఓ దశలో భారీ చేస్తుందనుకున్న స్కాట్లాండ్ చివర్లో త్వరితగతిన వికెట్లు కోల్పోయి ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది.
అనంతరం ఛేదనకు దిగిన నేపాల్ ఆచితూచి ఆడుతుంది. తొలి 4 ఓవర్లలో ఆ జట్టు వికెట్లు కోల్పోకుండా 26 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు కుషాల్ భుర్టెల్ 14, ఆసిఫ్ షేక్ 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో నేపాల్ గెలవాలంటే మరో 145 పరుగులు చేయాలి.


