టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందే ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ గాయాల కారణంగా దూరమయ్యారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ సైతం ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు.
దీంతో కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయిన ఆస్ట్రేలియా.. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో గెలుపొంది శుభారంభం అందుకుంది. అయితే, ఆ తర్వాత ఆసీస్ అదే జోరు కొనసాగించలేకపోయింది.
జింబాబ్వే చేతిలో ఓటమి.. లంక చేతిలోనూ చిత్తు
తమ రెండో మ్యాచ్‌లో అనూహ్య రీతిలో పసికూన జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది ఆస్ట్రేలియా. తద్వారా జింబాబ్వే గ్రూప్-బి నుంచి సూపర్-8 అవకాశాలు మెరగుపరచుకోగా.. కంగారూ జట్టుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకతో సోమవారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఆసీస్ సూపర్-8 అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.
గ్రూప్-బి నుంచి శ్రీలంక మూడింటికి మూడు గెలిచి సూపర్-8కు చేరగా.. జింబాబ్వే రెండింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెట్‌రన్‌రేటు (+1.984).
పటిష్టస్థితిలో జింబాబ్వే.. అదే జరిగితే ఆసీస్ ఇంటికే
మరోవైపు ఆస్ట్రేలియా మూడు ఆడి కేవలం ఒక్కటే గెలిచి.. 2 పాయింట్లతో ఉంది. నెట్‌రన్‌రేటు (+0.414) తదుపరి ఒమన్‌తో ఆసీస్ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే ఆసీస్ సూపర్-8 అవకాశాలు సజీవంగా ఉంటాయి.
అయితే, దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఆస్ట్రేలియాను వర్షం గండం వెంటాడుతోంది. ఆసీస్ కంటే పాయింట్లు, నెట్‌రన్‌రేటు పరంగా జింబాబ్వే పటిష్ట స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో మంగళవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో గెలిస్తే జింబాబ్వే ఆరు పాయింట్లతో నేరుగా సూపర్-8 చేరితే ఆసీస్ ఇంటి బాటపడుతుంది.
ఒకవేళ ఐర్లాండ్ చేతిలో జింబాబ్వే ఓడితే ఆసీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే, ఐర్లాండ్- జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. పల్లెకెలెలో వర్షం పడుతున్న కారణంగా ఇరుజట్ల మధ్య మ్యాచ్‌కు టాస్ ఆలస్యమైంది. ఒకవేళ వర్షం తెరిపినివ్వకపోతే మ్యాచ్ రద్దైపోతుంది.
ఓడినా మరో అవకాశం కూడా!
అదే జరిగితే ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు జింబాబ్వే ఖాతాలో పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుతుంది. తద్వారా ఆటోమేటిక్‌గా జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఆసీస్ టోర్నీ నుంచి ఘోర పరాభవంతో లీగ్ దశలోనే నిష్క్రమిస్తుంది.
అన్నట్లు జింబాబ్వేకు మరో మ్యాచ్ కూడా మిగిలి ఉంది. శ్రీలంకతో గురువారం జింబాబ్వే తలపడుతుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఫలితం తేడాగా వచ్చిన జింబాబ్వేకు ఇంకో అవకాశం మిగిలే ఉంటుందన్నమాట.
చదవండి: గంభీర్‌కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్‌కోచ్ పదవికి గుడ్‌బై?


