టీ20 ప్రపంచకప్ 2026లో మరో సూపర్-8 బెర్త్ ఖరారైంది. కెనడాపై గెలుపుతో న్యూజిలాండ్ ఫైనల్-8కు అర్హత సాధించింది. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక సూపర్-8కు చేరాయి. ఇక మిగిలింది రెండు బెర్త్‌లు మాత్రమే. ఆ రెండు ఎవరివి.. ఏయే జట్లు వాటి కోసం పోటీపడుతున్నాయి.. ఏ జట్లకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.. వంటి అంశాలపై ఈ కథనంలో చర్చిద్దాం.
గ్రూప్-సి,డి నుంచి సూపర్-8 బెర్త్‌లు ఖరారైపోగా.. ఏ,బి గ్రూప్‌ల్లో ఓ బెర్త్ ఖరారైనా, మరో బెర్త్‌పై సందిగ్దత నెలకొంది. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ సూపర్-8కు క్వాలిఫై కాగా.. స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8కు అర్హత సాధించగా.. ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కెనడా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.
గ్రూప్-ఏ నుంచి ప్రస్తుతానికి భారత్ ఒక్కటే సూపర్-8కు అర్హత సాధించింది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిన నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గ్రూప్ నుంచి మరో బెర్త్ కోసం టెక్నికల్‌గా 3 జట్ల మధ్య పోటీ ఉంది. అయితే ప్రధాన పోటీ మాత్రం యూఎస్‌ఏ, పాకిస్తాన్ మధ్యే ఉంటుంది. నెదర్లాండ్స్ టెక్నికల్‌గా టోర్నీలో ఉన్నా, ఆ జట్టు సూపర్-8 అర్హత సాధించడం దాదాపుగా అసాధ్యం.
పాక్, యూఎస్‌ఏ మధ్య ప్రధాన పోటీగా చెప్పుకుంటున్నా, పాక్‌కే సూపర్-8 అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ జట్టుకు మరో మ్యాచ్ మిగిలి ఉంది. అది కూడా పసికూన నమీబియాతో. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే.. నేరుగా సూపర్-8కు చేరుకుంటుంది. అప్పుడు యూఎస్‌ఏ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. యూఎస్‌ఏ ఇప్పటికే తమ నాలుగు గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు పూర్తి చేసుకొని, పాక్‌తో సమంగా నాలుగు పాయింట్లు కలిగి ఉంది.
యూఎస్‌ఏ సూపర్-8కు చేరాలంటే పాక్ నమీబియా చేతిలో భారీ తేడాతో ఓడిపోవాలి. అప్పుడు పాక్, యూఎస్‌ఏ చెరి నాలుగు పాయింట్లు కలిగి ఉంటాయి. మెరుగైన రన్‌రేట్ ఆధారంగా యూఎస్‌ఏ సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం యూఎస్‌ఏ పాక్ కంటే మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంది.
గ్రూప్-ఏ నుంచి టెక్నికల్‌గా సూపర్-8 లైన్‌లో ఉన్న మరో జట్టు నెదర్లాండ్స్. ఈ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ గెలవడం అసాధ్యమే కాబట్టి, ఆ జట్టు అనధికారికంగా సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించింది.
ఒకవేళ నెదర్లాండ్స్ భారత్‌పై ఘన విజయం సాధించి, పాక్ నమీబియా చేతిలో భారీ తేడాతో ఓడితే, అప్పుడు రన్‌రేట్ కీలకమవుతుంది. ఇలా జరిగిన పక్షంలో యూఎస్‌ఏ, పాక్, నెదర్లాండ్స్ జట్లలో మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు సూపర్-8కు అర్హత సాధిస్తుంది.
గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో శ్రీలంక ఇదివరకే సూపర్-8కు చేరిపోగా.. ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిగిలిన బెర్త్ కోసం జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ జట్లు పోటీపడుతున్నాయి. అధికారకంగా 3 జట్లు రేసులో ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం జింబాబ్వే, ఆస్ట్రేలియా మధ్య ఉంటుంది.
ఇవాళ (ఫిబ్రవరి 17) ఐర్లాండ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో జింబాబ్వే విజయం సాధిస్తే.. మిగతా సమీకరణలతో పని లేకుండా జింబాబ్వే సూపర్-8కు, ఐర్లాండ్, ఆస్ట్రేలియా ఇంటి బాట పడతాయి.
ఒకవేళ ఆస్ట్రేలియాకు సూపర్-8 బెర్త్ దక్కాలంటే.. ఆ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఒమన్‌పై భారీ విజయం సాధించాలి. అలాగే జింబాబ్వే తమ మిగిలిన రెండు గ్రూప్ మ్యాచ్‌ల్లో ఐర్లాండ్, శ్రీలంక చేతుల్లో భారీ తేడాతో ఓడాలి.
ఇవాల్టి జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలేలా ఉన్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా, జింబాబ్వే సూపర్-8కు వెళ్తుంది. ఆసీస్, ఐర్లాండ్ ఇంటిముఖం పడతాయి.
ఐర్లాండ్ సూపర్-8 అవకాశాలను పరిశీలిస్తే.. ఈ జట్టు నేడు జింబాబ్వేపై భారీ తేడాతో గెలవాలి. జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ దారుణంగా ఓడాలి. ఆస్ట్రేలియా తమ చివరి మ్యాచ్‌లో ఒమన్ చేతిలో ఓడాలి. అప్పుడు ఐర్లాండ్‌కు సూపర్-8 అవకాశం దక్కుతుంది. ఈ సమీకరణలు కార్యరూపాం దాల్చడం దాదాపుగా అసాధ్యమే కాబట్టి, ఐర్లాండ్ అనధికారికంగా సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించినట్టే.


