ఇంగ్లండ్‌ దర్జాగా...  | England Beat Italy By 24 Runs To Qualify For T20 World Cup Super Eight | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ దర్జాగా... 

Feb 17 2026 5:25 AM | Updated on Feb 17 2026 5:25 AM

England Beat Italy By 24 Runs To Qualify For T20 World Cup Super Eight

‘సూపర్‌–8’కు అర్హత సాధించిన మాజీ చాంపియన్‌

ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలుపు

విల్‌ జాక్స్‌ ధనాధన్‌ ఫిఫ్టీ  

కోల్‌కతా: టి20 ప్రపంచకప్‌లో తదుపరి దశకు అర్హత పొందాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ మెరిపించింది. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఇటలీ జట్టు కడదాకా పోరాడింది. చివరకు మాజీ చాంపియన్‌ చేతిలో 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో గ్రూప్‌ ‘సి’ నుంచి ఇప్పటికే ‘సూపర్‌–8’కు చేరిన వెస్టిండీస్‌ సరసన ఇంగ్లండ్‌ చేరింది. 

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హ్యారీ బ్రూక్‌ బృందం నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఫిల్‌ సాల్ట్‌ (15 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు మెరిపించినా... బట్లర్‌ (3) మళ్లీ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో నాలుగో మ్యాచ్‌ ఆడిన బట్లర్‌ ఇప్పటివరకు కనీసం మూడు పదుల స్కోరైనా చేయలేకపోయాడు. 

జాకబ్‌ బెథెల్‌ (23; 2 ఫోర్లు, 1 సిక్స్‌), బాంటన్‌ (30; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కెపె్టన్‌ బ్రూక్‌ (14), స్యామ్‌ కరన్‌ (25; 2 సిక్స్‌లు) ఇలా టాప్‌–6 బ్యాటర్లు ఇటలీ బౌలింగ్‌కు ఇబ్బంది పడితే... ఏడో వరుస బ్యాటర్‌ విల్‌ జాక్స్‌ (22 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్‌ సిక్స్‌లతో తేలికపడింది. అతను 21 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. జాక్స్‌ మెరుపుల వల్లే ఇంగ్లండ్‌ 200 పైచిలుకు స్కోరు చేసింది. గ్రాంట్‌ స్టివార్ట్, కలుగమగే చెరో 2 వికెట్లు తీశారు.  

‘సిక్స్‌’ల పిడుగు మనెంటి 
కొండంత లక్ష్యం ఎదురైనా... టాప్‌–3 బ్యాటర్లలో ఆంథోని మోస్కా (0), స్మట్స్‌ (0) డకౌటైనా... ఇటలీ ఆందోళన చెందలేదు. పోరాటం వీడలేదు. లక్ష్యఛేదన కోసం కడదాకా పోరాడి 20 ఓవర్లలో 178 పరుగుల వద్ద ఆలౌటైంది.  ఓపెనర్‌ జస్టిన్‌ మోస్కా (34 బంతుల్లో 43; 7 ఫోర్లు), బెన్‌ మనెంటి (25 బంతుల్లో 60; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగారు. జస్టిన్‌ బౌండరీలతో ధాటిగా ఆడితే... మనెంటి భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో బెన్‌ 22 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. 

దీంతో ఇటలీ 22/3 దయనీయ స్థితి నుంచి 114/4 స్కోరుతో రేసులో పడింది. స్వల్ప వ్యవధిలో ఇద్దరు అవుట్‌ కావడంతో లక్ష్యానికి దూరమైంది. అయినా సరే ఇటలీ ఆట ఆగిపోలేదు. గ్రాంట్‌ స్టివార్ట్‌ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) సైతం ఇంగ్లండ్‌ శిబిరంపై విరుచుకుపడటంతో ప్రత్యర్థి జట్టు ఆఖరి బంతిదాకా చెమటోడ్చింది. కరన్, ఓవర్టన్‌ చెరో 3 వికెట్లు తీయగా... ఆర్చర్‌కు 2 వికెట్లు దక్కాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement