టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు లగ్జరీ వాచ్‌ల పట్ల ఉన్న పిచ్చి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బరోడా ఆటగాడు ప్రపంచంలో దొరికే దాదాపు అన్ని ఖరీదైన వాచ్‌లు తన కలెక్షన్‌లో కలిగి ఉన్నాడు. తాజాగా హార్దిక్ ధరించిన మరో లగ్జరీ వాచ్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
నిన్న (ఫిబ్రవరి 15) టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ Jacob & Co. Epic X Chrono 44mm Titanium వాచ్ ధరించి అందరి దృష్టిని ఆకర్శించాడు. ఈ వాచ్ ధర భారత మార్కెట్లో రూ. 29 లక్షల నుంచి రూ. 34 లక్షల వరకు ఉంటుందని అంచనా.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. వాచ్ డయల్‌పై శివుడి ప్రతిమ చెక్కబడినట్లు తెలుస్తుంది. నిన్న శివరాత్రి కావడంతో హార్దిక్ తన భక్తిని ఈరకంగా చాటుకున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు.
హార్దిక్ వాచ్‌ల కలెక్షన్
హార్దిక్ వాచ్‌ల కలెక్షన్ గురించి గతంలో చాలా విషయాలు విన్నాం. అతని వద్ద రూ. 100 కోట్ల విలువ గల లగ్జీర వాచ్‌ల కలెక్షన్ ఉంటుందని అంచనా. గతంలో హార్దిక్ ధరించిన అతి ఖరీదైన వాచ్‌లపై ఓ లుక్కేద్దాం.
- Richard Mille RM 27-04 – ధర ₹20 కోట్లు (2025 ఆసియా కప్ ట్రైనింగ్ సమయంలో ధరించాడు)
- Richard Mille RM 27-02 – ధర ₹7 కోట్లు (2026 ప్రారంభంలో కనిపించాడు).
- Richard Mille RM 56-03 Blue Sapphire – ధర ₹53–54 కోట్లు (ప్రపంచంలో ఈ వాచ్‌లు కేవలం మూడు మాత్రమే తయారు చేశారు).
- Rolex Daytona Rainbow – ధర ₹4–5 కోట్లు (సఫైర్లు, డైమండ్లతో అలంకరించిన వాచ్).
- Audemars Piguet Royal Oak – ధర ₹3.25 కోట్లు (డబుల్ బ్యాలెన్స్ వీల్ ఓపెన్‌వర్క్డ్ & పర్పెచువల్ క్యాలెండర్ (18K రోజ్ గోల్డ్).
- Rolex Eye of the Tiger – ధర ₹2–2.5 కోట్లు (ప్రత్యేకమైన Rolex Cosmograph Daytona)
భారత్-పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ హార్దిక్ బ్యాట్‌తో ప్రభావం చూపించలేకపోయినా, బంతితో సత్తా చాటాడు. 3 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మెయిడిన్ (తొలి ఓవరే) కూడా ఉంది. ఈ మ్యాచ్‌లో అతను ఓ క్యాచ్ కూడా పట్టాడు.
బ్యాట్‌తో రాణించకపోయినా, బంతితో మెరిసి హార్దిక్ భారత గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ పాక్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సూపర్-8కు అర్హత సాధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
అనంతరం భారత బౌలర్లు కలిసికట్టుగా రాణించి పాక్‌ను 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూల్చారు. భారత గెలుపులో ప్రధానపాత్ర పోషించిన ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


