‘SIR’ విధుల్లో అక్రమాలు.. ఏడుగురిపై ఈసీ వేటు! | Election Commission Suspends 7 west Bengal Officials | Sakshi
Sakshi News home page

‘SIR’ విధుల్లో అక్రమాలు.. ఏడుగురిపై ఈసీ వేటు!

Feb 16 2026 9:30 AM | Updated on Feb 16 2026 9:40 AM

Election Commission Suspends 7 west Bengal Officials

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కొరడా ఝుళిపించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ విధులలో నిర్లక్ష్యం, అధికారాల దుర్వినియోగానికి పాల్పడిన ఏడుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్‌ఓ)హోదాలో ఉన్న ఈ అధికారులపై  క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది.

సస్పెన్షన్‌కు గురైన అధికారులలో సంషేర్‌గంజ్, ఫరక్కా, మైనాగురి, సూతి, కానింగ్ పూర్బో, డెబ్రా అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఏఈఆర్‌ఓలు ఉన్నారు. ముర్షిదాబాద్ జిల్లా సంషేర్‌గంజ్ ఏఈఆర్‌ఓ సెఫౌర్ రెహమాన్, ఫరక్కా ఏఈఆర్‌ఓ నితీష్ దాస్, మైనాగురి ఏఈఆర్‌ఓ డాలియా రాయ్ చౌదరి, సూతి ఏఈఆర్‌ఓ ముర్షీద్ ఆలంలపై వేటు పడింది. అలాగే కానింగ్ పూర్బో నియోజకవర్గానికి చెందిన సత్యజిత్ దాస్, జయదీప్ కుందు, డెబ్రా ఏఈఆర్‌ఓ దేబాశిష్ బిస్వాస్‌లను ఈసీ విధుల నుంచి తొలగించింది.

ఓటర్ల జాబితా తుది ప్రచురణకు ముందు చేపట్టిన పరిశీలనలో ఈ అధికారులు తీవ్రమైన అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. అవసరమైన పత్రాలు సమర్పించకపోయినా, మ్యాపింగ్‌లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ,  ఓటర్ల అర్హతపై అనుమానాలు ఉన్నా కూడా వీరు అనేక కేసులను క్లియర్ చేశారని తేలింది. అనర్హులకు ఓటు హక్కు కల్పించేలా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా  వీరు అధికారాలను దుర్వినియోగం చేశారని విచారణలో వెల్లడైంది.

తప్పులను సరిదిద్దడంలో విఫలమైనందుకు వీరిని బాధ్యులుగా చేస్తూ ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ (ఆరపీ) యాక్ట్ 1950లోని సెక్షన్ 13సీసీ కింద తమకు ఉన్న అధికారాలను ఉపయోగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా విభాగాల ఉన్నతాధికారులు ఎటువంటి జాప్యం లేకుండా ఈ అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని, ఆ వివరాలను తమకు నివేదించాలని ఈసీ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: ‘ఐదేళ్లలో ఐటీ, బీపీఓలు..’ బాంబు పేల్చిన వినోద్ ఖోస్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement