న్యూఢిల్లీ: భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది జూలై 24న ఇరు దేశాలు సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ)పై సంతకం చేశాయి. 2030 నాటికి 56 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది.
ఇది అమల్లోకి వస్తే చాక్లెట్లు, బిస్కెట్లు, సౌందర్య సాధనాలు వంటి వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. అంతేకాదు స్కాచ్ విస్కీపై 150 శాతం ఉన్న సుంకం 75 శాతానికి తగ్గనుంది. 2035 నాటికి 40 శాతానికి తగ్గిస్తారు. ప్రస్తుతం 110శాతం ఉన్న సుంకాలను రానున్న ఐదేళ్లలో 10శాతానికి తగ్గించనున్నారు.
ఇవన్నీ దశలవారీగా అమలు కానున్నాయి. ఇక భారత్‌కు చెందిన వ్రస్తాలు, పాదరక్షలు, రత్నాలు–నగలు, క్రీడా సామగ్రి, బొమ్మలు వంటి ఉత్పత్తులను యూకేకు ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులను కూడా పన్నుల సుంకాలు లేకుండా ఎగుమతి చేసే లభించనుంది. ఈ ఒప్పందంతో దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.
యూకే పార్లమెంట్ ఆమోదం తర్వాతే...
అయితే ఈ ఒప్పందం అమలు కావడానికి ముందు యూకే పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. ఇటీవల యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్ ఈ ఒప్పందంపై చర్చించింది. ఈ సందర్భంగా వాణిజ్య శాఖ మంత్రి క్రిస్ బ్రయంట్ మాట్లాడారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక విజయమన్నారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ముందు రెండు సభల్లో చర్చలు, సమీక్షలు నిర్వహిస్తాయని తెలిపారు.


