కలకలం రేపుతున్న ఉదంతం
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లోగోతో కూడిన భారీ రాకెట్ శకలం మాల్దీవ్స్ దేశానికి సంబంధించిన దీవిలో కనిపించడం కలకలం సృష్టించింది. సముద్రంలో మరో ఇద్దరితో కలిసి చేపల వేట సాగిస్తున్న ఓ మత్స్యకారుడు దీన్ని తొలుత గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చాడు. అనంతరం అధికారులకు సమాచారం చేరవేశాడు. ఇది తెల్ల రంగులో వంపు తిరిగిన ఆకారంలో కనిపిస్తోంది. రాకెట్‌లో ఇదొక అంతర్భాగమని గుర్తించారు.
రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత ఉపగ్రహాలు భద్రంగా విడిపోయేలా ఇది రక్షణ కలి్పస్తుంది. ఈ శకలం ఫోటోలను ఎల్.కునాహందూ దీవిలోని స్థానిక ప్రభుత్వం విడుదల చేసింది. స్థానిక మీడియాలో ఇవి దర్శనమిచ్చాయి. ఇందులో శకలంపై ఇస్రో లోగోతో పాటు భారత అధికారిక చిహ్నం కూడా ఉంది. ఈ రాకెట్‌ను 2025లో తయారు చేసినట్లు కొన్ని అక్షరాలు సైతం ఉన్నాయి.
శకలం బరువు తక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. శకలంపై కొన్నిచోట్ల పెయింట్ చెదిరిపోయింది. దక్షిణ మాల్దీవ్స్‌లోని ఎల్.కునాహందూ దీవి సాధారణంగా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇక్కడ జనావాసాలు లేవు. అయితే, శకలం ఆకాశం నుంచి పడిందా? లేక సముద్రంలో నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చిందా? అనే దానిపై చర్చ మొదలైంది.
ఇస్రో రాకెట్లను భారత్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తుంటారు. ప్రయోగం పూర్తయ్యాక రాకెట్లు సముద్రంలో కూలిపోతుంటాయి. శకలాలు సైతం సముద్రంలో పడిపోతాయి. మాల్దీవ్స్‌లో కనిపించిన రాకెట్ శకలం శ్రీహరికోట నుంచి ఇక్కడికి వచి్చనట్లు అంచనా వేస్తున్నారు. బలమైన ఈదురు గాలులకు తోడు సముద్ర నీటి ప్రవాహ దిశకు అనుగుణంగా ప్రయాణిస్తూ ఇక్కడిదాకా కొట్టుకొచి్చనట్లు చెబుతున్నారు.
తొలుత అర్థం కాలేదు
మత్స్యకారుడు ఇచి్చన సమాచారంతోనే ఈ శకలం గురించి తమకు తెలిసిందని కునాహందూ కౌన్సిల్ అధ్యక్షుడు ఇబ్రహీం షకీబ్ చెప్పారు. అందులోని విడిభాగాలు మళ్లీ ఉపయోగపడుతాయన్న ఉద్దేశంతోనే ఒడ్డుకు చేర్చాడని అన్నారు. మొదట దాని గురించి ఏమీ అర్థం కాలేదని చెప్పారు. ఈ నెల 13వ తేదీన పోలీసులు క్షుణ్నంగా పరిశీలించారని, అది భారత్‌కు సంబంధించిన వస్తువుగా నిర్ధారించారని వెల్లడించారు.
2025 డిసెంబర్‌లో శ్రీలంక సముద్ర తీరంలోనూ ఇలాంటి శకలమే కనిపించింది. ఇస్రో సాధారణంగా ఎల్‌వీఎం3, పీఎస్‌ఎలవీ రాకెట్లను ప్రయోగిస్తుంది. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత సముద్రంలో కూలిపోతాయి. చాలావరకు నీటిలో మునిగిపోతాయి. తేలికైన భాగాలు ముక్కలుగా విడిపోయి నీటిపై తేలుతుంటాయి. నీటిలో ముందుకు కొట్టుకుపోతుంటాయి. తీరానికి చేరుకుంటాయి. అయితే, శ్రీహరికోట నుంచి మాల్దీవ్స్ దాకా సుదీర్ఘదూరం ప్రయాణించడం అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు.


