ప్రతి 12 రోజులకు 100 మీటర్ల రెజల్యూషన్‌తో ఫొటోలు
యావత్ భారతదేశ భూసార సమస్త సమాచారం అందజేత
కీలక క్రతువులో తలమునకలవుతున్న నైసర్ ఉపగ్రహం
వివరాలు వెల్లడించిన ఇస్రో
బెంగళూరు: భారత్, అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థలు ఇస్రో, నాసాల మానసపుత్రికగా తయారై గగనతలంలో చక్కర్లు కొడుతున్న నాసా–ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్(నైసర్) ఉపగ్రహం నుంచి ప్రతి 12 రోజులకు ఒకసారి యావత్ భారతదేశ పర్యావరణ, జీవావరణ, హిమానీ నదాలు, జలరాశులకు సంబంధించిన సమస్త తాజా సమాచారం అందనుంది. ఈ వివరాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
‘‘ఎస్–బ్యాండ్, ఎల్–బ్యాండ్‌ల మేలు కలయికగా జంట ఫ్రీక్వెన్సీల సింథటిక్ అపర్చర్ రాడార్‌లను నైసర్ ఉపగ్రహంలో అమర్చారు. వీటి సాయంతో నేలలో తేమ వంటి అత్యంత కీలక వివరాలు సైతం 100 గీ 100 మీటర్ల అత్యధిక రెజల్యూషన్‌తో ఛాయాచిత్రాల రూపంలో అందనుంది. 100 మీటర్ల రెజల్యూషన్ చిత్రపటం అంటే అందులోని ఒక్కో పిక్సెల్ లేదా డేటా అనేది భూమిపై 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని నేల సమాచారాన్ని పట్టిచూపుతుంది. నేలలో తేమ అనేది నీటిపారుదల, కరువుల సమస్యకు పరిష్కారాలు చూపిస్తూ భారత సాగు, నీటి నిర్వహణ విధానంలో కీలకభూమిక పోషిస్తోంది.
రాత్రి, పగలు అనే తేడా లేకుండా వర్షం, పొగమంచు, మేఘాల వంటి పరిస్థితుల్లోనూ నేల ఫొటోలను అత్యంత స్పష్టంగా తీసి పంపుతుంది. దీంతో నీటిపారుదల సదుపాయం ఉన్న ప్రాంతాలతోపాటు వర్షాధార నేలలు, వర్షాభావ ప్రాంతాలు, అత్యధిక వర్షపాతమున్న ప్రాంతాల్లో ప్రతి రోజూ నేలలో తేమ ఎంతశాతముందనే వివరాలు తెలుస్తాయి. దీంతో సాగునేలకు ఎంత మేర నీరు అవసరం, ఏస్థాయిలో నీటిని సరఫరా చేయాలి? అనే వివరాలపై రైతలకు ఒక స్పష్టత వస్తుంది’’అని ఇస్రో తన ప్రకటనలో పేర్కొంది.
నేల సమస్త సమాచారం అందుబాటులోకి..
‘‘నేలపై సెంటీమీటర్ పరిధిలో కూడా నిశితమైన ఫొటోలను తీసి పంపుతాయి. నైసార్‌కు ఉన్న రెండు రాడార్లలో ఒకటి ఎల్–బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో, మరోటి ఎస్–బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో పనిచేస్తాయి. నేలతేమను పట్టిచూసే భౌతికశాస్త ఆధారిత అల్గారిథమ్‌ను స్పేస్ అప్లికేషన్ సెంటర్(ఎస్‌ఏసీ–ఇస్రో)లో అభివృద్ధిచేశారు. ఇది శాస్త్రీయంగా నేల ఆరోగ్యాన్ని కనిపెడుతూ అత్యంత ఖచ్చిత్వంతో నిర్ణయాలు తీసుకోవడానికి సాయపడుతుంది. రెండు బ్యాండ్‌ల కారణంగా 12 రోజులకు ఒకసారి రాడార్లు భూమిని చుట్టేస్తూ నేల స్వభావ, స్వరూపాల సమస్త సమాచారాన్ని మనకు అందిస్తాయి.
ఈ సమాచారాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఐఎంజీఈఓఎస్/ఎన్‌ఆర్‌ఎస్‌సీ) సేకరిస్తుంది. ఈ డేటాను భూనిధి పోర్టల్ ద్వారా అందుబాటులోకి తెస్తుంది. ప్రతి 12 రోజులకు ఒకసారి మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమాచారం అప్‌డేట్ అవుతూ ఉంటుంది. ఈ సమాచారంతో రైతులు, విధాన రూపకర్తలు, పరిశోధకులు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వేతర కంపనీలు తమ పరిధి మేర నిర్ణయాలు తీసుకునే సువర్ణావకాశం దక్కుతుంది’’అని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది.
మధ్య భారతదేశం మొదలు సింధూ–గంగా మైదాన ప్రాంతాల్లోని పంటభూముల దాకా ప్రతిచోటా నేలలో తేమ శాతం ఎంత ఉంది? ఎంత ఉండాలి? ఏంత మేర అదనంగా నీటి సరఫరా అవసరం? అనే వివరాలు అందటంతో ఆ మేరకు విధానపర నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం చిక్కుతుంది. ఎల్–బ్యాండ్ రాడార్ అనేది అడవీప్రాంతాలు, ఎడారులు, మంచుమయ ప్రాంతాల్లోని నేల స్వభావాన్ని విశ్లేíÙస్తుంది. భూగర్భంలో మార్పులనూ పసిగట్టగలదు. ఎస్–బ్యాండ్ రాడార్ అనేది పంట పొలాలు, నీటి వనరుల తాజా స్థితిని తెలియజెప్తుంది.
సమిష్టిగా ఈ రెండు బ్యాండ్‌లు కలిసి భారతీయ నేలల ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తూ నీటి వనరుల లభ్యతపై పరిశోధకులకూ స్పష్టమైన అవగాహన పెంపొందిస్తాయి. భారతదేశం అంతటా ఒకేలా వర్షాలు పడవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వాతావరణం ఉంది. ఒక్కోసారి జిల్లా జిల్లాకు మధ్య వాతావరణ వ్యత్యాసం ఉంది. దీంతో చిన్న చిన్న క్లస్టర్లుగా విభజిస్తూ వేర్వేరుగా డేటాను సమీకరించాల్సి వస్తోంది. అందుకోసమే నైసర్‌ను నింగిలోకి పంపారు. నీటి నిర్వహణతోపాటు వాతావరణ మార్పుల వంటి అంశాలూ స్పష్టంగా తెలియనున్నాయి. గత ఏడాది జీఎస్‌ఎల్‌వీ 16 ప్రయోగం ద్వారా నైసర్‌ను నింగిలోకి పంపిన విషయం విదితమే.


