జ్యోతిర్లింగ రథయాత్ర
తుమకూరు: బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని వివిధ రోడ్లలో 21 జ్యోతిర్లింగాలతో రథయాత్ర నిర్వహించారు. సదాశివనగర రింగ్ రోడ్డులోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో రథయాత్రకు శ్రీకారం చుట్టారు. భక్తిగీతాలతో నగరవీధుల్లో సాగింది.
గ్రామ పంచాయతీలో రూ.54 లక్షల స్కాం
● అధికారులపై లోకాయుక్త కేసు
మండ్య: తాగునీటి సరఫరా, వీధి దీపాల వస్తు సామగ్రిని కొనకపోయినా, రూ.54 లక్షలను చెల్లించిన కేసులో పీడీఓతో సహా ఆరుగురిపై లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసింది. మండ్య తాలూకాలోని తగ్గహళ్లి గ్రామ పంచాయతీ ప్రబార గ్రామం పీడీఓ శ్రీనివాసయ్య, పీడీఓ హెచ్.ఎస్. లక్ష్మి, కార్యదర్శి శివరుద్ర, సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఇంజనీర్లు ఇందులో ఉన్నారు. వివరాలు.. తగహళ్లి పీడీఓ లక్ష్మి 16 రోజులు సెలవులో ఉన్నారు. ఈ సమయంలో, అలకెరె గ్రామ పంచాయతీ పీడీఓ శ్రీనివాసయ్యకు అదనపు బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న మూడు రోజుల్లోనే, శ్రీనివాసయ్య తాగునీరు, వీధి దీపాల సామగ్రి కొనుగోలు పేరుతో ఓ ఏజెన్సీకి రూ. 54 లక్షలు చెల్లించారు. ఇది తెలిసి గ్రామస్తులు జెడ్పీ సీఈఓ నందినికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరపగా అక్రమాలు నిజమేనని తేలింది. ఈ స్కాంని తీవ్రంగా పరిగణించిన డిప్యూటీ లోకాయుక్త జస్టిస్ బి. వీరప్ప సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో చర్యలు తీసుకునే అవకాశముంది.
మామూలు ఇంటికి
రూ.16 వేల కరెంటు బిల్లు
యశవంతపుర: బెంగళూరు నగరంలో సాధారణ ఇంటికి వచ్చిన కరెంటు బిల్లును చూసి యజమాని షాక్ తిన్నట్లు చెబుతున్నాడు. 3 బీహెచ్‌కె ఇంటికి రూ.16,883 బిల్లు వచ్చిందని యజమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఒక ఏసీ, గేమింగ్ పీసీ, కరెంటు స్టవ్, ఫ్యాన్ వంటివి ఉన్నాయి. దీనికి కరెంట్ బిల్ రూ.16,883 రావడం ఎలా సాధ్యమని ప్రశ్నించాడు. బెంగళూరులో ఇంతమొత్తంలో బిల్లులు వేయడం సహజమేనని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఈ నెల 18లోపు కరెంట్ బిల్‌ను చెల్లించాలని బెస్కాం అధికారులు బిల్లులో పేర్కొన్నారు.
గగనం నుంచి ఖనిజాన్వేషణ
యశవంతపుర: కాఫీనాడు చిక్కమగళూరు, మలెనాడు ప్రాంతాలలో గత కొన్ని రోజుల నుంచి చిన్న విమానం నిరంతరం తిరుగుతోంది. దీంతో ప్రజల్లో ఉత్సుకతతో పాటు కలవరం కూడా నెలకొంది. దీనిపై జిల్లా కలెక్టర్ ఎంఎన్ నాగరాజు వివరణ ఇచ్చారు. ఇది భద్రతకు సంబంధించిన సర్వే కాదని, వైజ్ఞానిక సమీక్ష అని తెలిపారు. భారతీయ భూ వైజ్ణానిక సర్వే శాఖ భూగర్భంలోని ఉన్న ఖనిజ నిక్షేపాలను కనుగొనడానికి, భూగర్భ జలాలు తదితరాల అధ్యయనం కోసం విమానం ద్వారా పరిశీలన చేస్తోంది. చిన్న సెస్నా విమానం తరచూ తక్కువ ఎత్తులో ఎగురుతోంది. ఎన్‌ఆర్‌పుర, బాళెహొన్నూరుతో పాటు అనేక ప్రాంతాలలో సర్వే సాగుతోంది.
పెళ్లికి వెళ్లి అదృశ్యం
యశవంతపుర: పెళ్లికి వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన హాసన్ తాలూకా కల్కెరె గ్రామంలో జరిగింది. వివరాలు.. తుమకూరు జిల్లా కుణిగల్‌కు చెందిన ప్రియాంక (29) కనిపించడం లేదు. బంధువుల పెళ్లి కోసమని ప్రియాంక చిక్కమగళూరుకు గురువారం వెళ్లింది. బేలూరు పరిధిలో జాతీయ రహదారి– 373 దగ్గర ఆమె బట్టలు, చెప్పులు, హ్యాండ్‌బ్యాగ్‌ను ధర్మస్థలకు వెళ్తున్న పాదయాత్రికులు కనుగొన్నారు. బ్యాగులోని ఆధార్ కార్డుపై ఉన్న మొబైల్ నంబర్‌కు వారు కాల్ చేయగా భర్తకు వెళ్లింది, మీ భార్య ఆధార్‌కార్డ్ మాకు దొరికిందని భక్తులు తెలిపారు. దీంతో భర్త, బంధువులు కంగారుపడి వెళ్లగా కొన్ని వస్తువులను ఇచ్చారు. ఆమె అనుమానాస్పదంగా అదృశ్యం కావడంపై భర్త, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆమె ఒంటిపై రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు వరకు బంగారు నగలు ధరించి వెళ్లిందని తెలిపారు. బంగారం కోసం ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనాస్థలిని ఫైర్ సిబ్బంది, పోలీసులు పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు.
జ్యోతిర్లింగ రథయాత్ర
జ్యోతిర్లింగ రథయాత్ర


