ఇండోర్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఆహార ప్రియుల కడుపు కొడుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఇండోర్ అనగానే నోరూరించే పోహా, జిలేబీలు గుర్తుకు వస్తాయి. అయితే ఇవి ఇప్పుడు సామాన్యులకు భారంగా మారాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపధ్యంలో కమర్షియల్ ఎల్పీజీ (ఎల్‌పీజీ) సరఫరా నిలిచిపోవడంతో, ఇక్కడి హోటల్ యజమానులు సంక్షోభంలో కూరుకుపోయారు. గ్యాస్ కొరత కారణంగా తినుబండారాల ధరలు అమాంతం పెరగడంతో అటు వ్యాపారులు, ఇటు కస్టమర్లు బెంబేలెత్తుతున్నారు.
ఆకాశాన్నంటుతున్న సిలిండర్ ధరలు
పశ్చిమాసియా ఘర్షణల ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా అస్తవ్యస్తమైంది. గతంలో రూ. 2,200 ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 3,500 నుంచి రూ. 4,000 వరకు పలుకుతోందని వ్యాపారులు వాపోతున్నారు. చిన్న సిలిండర్ల ధర కూడా రూ. 2,500కు చేరింది. గ్యాస్ దొరక్క కొందరు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తుంటే, మరికొందరు బొగ్గు పొయ్యిలు, కట్టెల పొయ్యిలు, డీజిల్ బర్నర్లు, ఇండక్షన్ స్టవ్‌ల వైపు మళ్లుతున్నారు.
తగ్గుతున్న గిరాకీ.. పెరిగిన భారం
వ్యాపారం దాదాపు 40 శాతం మేర పడిపోయిందని హోటల్ యజమాని శ్యామ్ లాల్ ధక్కడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సరుకుల ధరలు పెరగడంతో వంటకాల రేట్లు పెంచక తప్పడం లేదు. గతంలో రూ.100 ఉన్న జిలేజీ ప్లేట్ ఇప్పుడు రూ. 120కి చేరింది. ఇది కస్టమర్లపై ప్రభావం చూపుతోంది’ అని ఆయన పేర్కొన్నారు. మరో వ్యాపారి అర్జున్ సింగ్ మాట్లాడుతూ, సిలిండర్ల లభ్యత లేకపోవడంతో స్నాక్స్ ధరలను పెంచామని, దీనివల్ల కస్టమర్ల రాక తగ్గిపోయిందని అన్నారు.
జేబు ఖాళీ అవుతోందంటున్న కస్టమర్లు
ప్రతి ఐటమ్‌పై రూ. 2 నుంచి రూ. 5 వరకు ధర పెరగడం సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. ‘ధరలు పెరగడమే కాకుండా, హోటళ్లలో చాలా ఐటమ్స్ దొరకడం లేదు. గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండే వంటకాలను చేయడం ఆపివేశామని హోటల్ సిబ్బంది చెబుతున్నారు’ అని అనురాధ అనే కస్టమర్ తన ఇబ్బందిని వివరించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు చక్కబడి, ఇంధన సరఫరా సాధారణ స్థితికి వస్తే తప్ప హోటల్ రంగం కోలుకునేలా లేదు.
ఇది కూడా చదవండి: ఏఐతో వ్యాక్సిన్ రెడీ.. జీవ ఆయుధాల ముప్పు తప్పదా?


