శివాజీనగర: కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ రోహిణి సింధూరికి ఊహించని షాక్ తగిలింది. కాటన్ బ్యాగుల కొనుగోలులో నిధుల దుర్వినియోగం జరిగాయనే ఆరోపణలపై సింధూరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
మైసూరుకు చెందిన న్యాయవాది ఎన్.ఆర్.రవిచంద్రేగౌడ సమర్పించిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఎన్.నాగప్రసన్న విచారించారు. ఆమె మీద విచారణకు అనుమతి నిరాకరిస్తూ సర్కారు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ రద్దు చేశారు. దర్యాప్తు ద్వారానే వాస్తవాలను బహిరంగపరచాలి, అప్పుడే ప్రజలకు నిజాలేమిటో తెలుస్తాయి అని పలు వ్యాఖ్యలు చేశారు. నాలుగు వారాల్లోగా వాస్తవాలను వెలికి తీసేందుకు విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి సూచించారు. అవినీతిని నియంత్రించకపోతే అది రాజకీయ రంగాన్ని అస్థిరపరుస్తుందని, ప్రభుత్వ సంస్థలను నాశనం చేస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
గతంలో రోహిణి సింధూరి మైసూరు కలెక్టర్‌గా ఉన్న సమయంలో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా మైసూరులో ప్లాస్టిక్ సంచుల బదులుగా వస్త్రపు సంచులు కొనుగోలు చేసి, వితరణ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా రూ.13 ధర కలిగిన బట్ట సంచులను రూ.52 ధరతో కొనుగోలు చేశారని, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.7.65 కోట్ల నష్టం జరిగిందని న్యాయవాది పిటిషన్ వేశారు.


