పళనిస్వామికి భారీ షాక్‌ | Political Shock To Palani Swamy Over Shanmugam Plans In AIADMK | Sakshi
Sakshi News home page

పళనిస్వామికి భారీ షాక్‌

May 18 2026 11:09 AM | Updated on May 18 2026 11:17 AM

Political Shock To Palani Swamy Over Shanmugam Plans In AIADMK

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహణకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం బృందం సిద్ధమైంది. ఇందు కోసం 1000 మంది సభ్యుల చేత సంతకాలు చేయించి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే సర్వసభ్య సమావేశం విషయంగా ఎవ్వరూ సంతకాలు చేయవద్దని సభ్యులకు పళనిస్వామి సూచించారు.

వివరాల మేరకు.. అన్నాడీఎంకేలో పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, సీనియర్‌ నేతలు  ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం శిబిరాల మధ్య వివాదం ముదిరింది. పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గద్దె దించడం లక్ష్యంగా ఎస్పీ వేలుమణి వ్యూహాలకు పదును పెట్టారు. ఇందుకు పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని అస్త్రంగా చేసుకున్నారు. అన్నాడీఎంకేలో 1,800 మంది మేరకు సర్వ సభ్య సభ్యులు ఉన్నారు. వీరిలో 1000 మందిని తమ వైపునకు ఎస్పీ వేలుమణి శిబిరం తిప్పుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరితో సంతకాలు చేయించి, సర్వ సభ్య సమావేశం లక్ష్యంగా పట్టుబట్టే పనిలో పడ్డారు. పార్టీపరంగా తమతో ఉన్న 28 జిల్లాల కార్యదర్శుల ద్వారా మిగిలిన జిల్లాల కార్యదర్శులకు గాలం వేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.

సంతకాలు చేయవద్దు 
పార్టీ సర్వ సభ్య సభ్యులకు పళనిస్వామి సూచనలు చేస్తూ ఆదివారం ప్రకటన చేశారు. సర్వ సభ్య సమావేశం పేరిట సంతకాలు చేయవద్దని, పార్టీని సర్వనాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల చర్యలకు చెక్‌ పెట్టేవిధంగా చట్ట పరమైన పోరాటానికి సైతం పళనిస్వామి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకునేందుకు సీఎం విజయ్‌ కుట్రలు చేస్తున్నారని అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్‌ ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన పక్షంలో సీబీఐ విచారణ కోరుతామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement