బిందెడు నీరు.. బతుకంతా కన్నీరు! | The Hidden Water Crisis of Haryana | Sakshi
Sakshi News home page

బిందెడు నీరు.. బతుకంతా కన్నీరు!

May 17 2026 1:33 PM | Updated on May 17 2026 1:54 PM

The Hidden Water Crisis of Haryana

నూహ్: నీరే ప్రాణాధారం... కానీ ఆ గుక్కెడు నీటి కోసమే ఓ గ్రామం ప్రతిరోజూ ప్రాణసంకటాన్ని ఎదుర్కొంటోంది. ‘హర్ ఘర్ జల్’ అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితం కాగా, వాస్తవ పరిస్థితులు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. హర్యానాలోని నూహ్ జిల్లా మలాబ్ గ్రామంలో సూర్యోదయంతోనే మహిళల నీటి కష్టాలు మొదలవుతాయి. పిల్లలైనా, పెద్దలైనా, స్త్రీలయినా,పురుషులైనా, చివరికి నిండు గర్భిణులైనా ఆ నీటి కుండల బరువు మోయక తప్పని దయనీయ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.

కాగితాలపైనే పథకాలు... కన్నీళ్లలో మహిళలు
జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం కుళాయి కనెక్షన్లు ఇచ్చామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నా, మలాబ్ గ్రామంలో మాత్రం పైపుల ద్వారా చుక్క నీరు రావడం లేదు. భూగర్భ జలాలు ఉప్పగా మారడంతో, దాదాపు 12,200 మంది గ్రామస్తులు తాగే నీటి కోసం ‘కుండ్’ అనే భూగర్భ ట్యాంకులపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. 82 ఏళ్ల వృద్ధురాలు షకీలా తన జీవితమంతా తలపై నీళ్ల బిందెలు మోస్తూనే గడిపానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం వారి నిరీక్షణ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.

నిండు గర్భిణులకూ తప్పని..
నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందంటే, ఏడు నెలల గర్భిణీ అయిన 26 ఏళ్ల అర్షీ సైతం ప్రతిరోజూ బరువైన నీటి బకెట్లు మోస్తోంది. బరువులు ఎత్తకూడదని వైద్యులు హెచ్చరించినా, ఆమెకు వేరే దారి లేదు. వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ రోజుకు పలుమార్లు ఈ భూగర్భ ట్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ దయనీయ పరిస్థితి కారణంగా స్థానిక మహిళలు నిరంతర వెన్నునొప్పి, డీహైడ్రేషన్, తీవ్రమైన అలసటకు గురవుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు.

చదువును మింగేస్తున్న నీటి కటకట
నీటి కోసం సాగే ఈ జీవన్మరణ పోరాటం బాలికల భవిష్యత్తును సైతం ఛిద్రం చేస్తోంది. ఇంటి పనుల్లో, ముఖ్యంగా నీళ్లు మోయడంలో సహాయపడేందుకు తల్లిదండ్రులు ఆడపిల్లల చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. పైగా పాఠశాలల్లో కనీస నీటి సౌకర్యం, శుభ్రమైన మరుగుదొడ్లు లేకపోవడంతో నెలసరి సమయంలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఆరుబయట ఉండే భూగర్భ ట్యాంకుల చుట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో వ్యాధుల ముప్పు పొంచి ఉంది. అధికారులు ప్రాజెక్టుల పేరిట కేవలం హామీలకే పరిమితమవుతున్నారు.

ఇది కూడా చదవండి: హంటా, నోరో, కోవిడ్.. ప్రాణాంతక నిజాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement