హంటా, నోరో, కోవిడ్.. ప్రాణాంతక నిజాలు! | Norovirus, COVID-19, Hantavirus - The Ultimate Threat Breakdown | Sakshi
Sakshi News home page

హంటా, నోరో, కోవిడ్.. ప్రాణాంతక నిజాలు!

May 17 2026 11:41 AM | Updated on May 17 2026 11:47 AM

Norovirus, COVID-19, Hantavirus - The Ultimate Threat Breakdown

న్యూఢిల్లీ: క్రూయిజ్ షిప్‌లలో వరుసగా నమోదవుతున్న నోరోవైరస్ కేసులు, అంతర్జాతీయ ప్రయాణికుల్లో బయటపడిన అరుదైన ‘హంటా’ వైరస్ ఉదంతాలు ప్రపంచాన్ని మరోసారి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ తాజా పరిణామాలు కోవిడ్-19 నాటి చీకటి రోజులను గుర్తుచేస్తున్నాయి.  అయితే ఈ మూడు వైరస్‌లు వ్యాప్తి చెందే విధానం, లక్షణాలు, వాటి వల్ల పొంచి ఉన్న ప్రాణాపాయం ఒకదానికొకటి పూర్తి భిన్నం. ఆ వ్యత్యాసాలు ఏమిటో నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

హంటా వైరస్: అరుదైనప్పటికీ  ప్రాణాంతకం
ఎలుకల ద్వారా మనుషులకు సోకే ‘హంటా వైరస్’ చాలా అరుదైనదే అయినప్పటికీ, ప్రాణాపాయం కలిగించడంలో దీని తీవ్రత చాలా ఎక్కువ. ఎలుకల వ్యర్థాలు, మూత్రం లేదా లాలాజలం ఉన్న గాలిని పీల్చడం ద్వారా ఇది సోకుతుంది. జ్వరం, కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి వంటి ప్రాథమిక ఫ్లూ లక్షణాలతో మొదలవుతుంది. తరువాత క్రమంగా ఊపిరితిత్తుల్లో నీరు చేరే ప్రమాదకరమైన ‘హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్’కు దారితీసి, శ్వాస తీసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. అయితే ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశం చాలా తక్కువ కావడం ఒక్కటే ఇందులో ఉన్న సానుకూలాంశం.

నోరోవైరస్: వేగంగా చుట్టుముట్టే కడుపు ఫ్లూ
పాఠశాలలు, ఆఫీసులు క్రూయిజ్ షిప్‌ల వంటి రద్దీ ప్రాంతాల్లో ‘నోరోవైరస్’ అత్యంత వేగంగా, సులువుగా వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, నీరు, ఉపరితలాలను తాకడం ద్వారా ఇది సోకుతుంది. ఇది ప్రధానంగా జీర్ణవ్యవస్థపై దాడి చేస్తుంది. ఫలితంగా ఆకస్మిక వాంతులు, అతిసారం, తీవ్రమైన కడుపు నొప్పి వేధిస్తాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో ఇది రెండు, మూడు రోజుల్లోనే తగ్గిపోయినప్పటికీ, పిల్లలు, వృద్ధుల్లో ప్రాణాంతక డీహైడ్రేషన్‌కు (శరీరంలో నీరు శాతం పడిపోవడం) దారితీసే ప్రమాదం ఉంది. దీనికి నిర్దిష్టమైన మందు లేదు, విశ్రాంతి ,  ద్రవాహారం తీసుకోవడమే ఏకైక మార్గం.

కోవిడ్-19: దీర్ఘకాలిక ప్రభావం చూపే శ్వాసకోశ వ్యాధి
గాలి ద్వారా, తుంపర్ల ద్వారా అత్యంత సులభంగా వ్యాపించే కోవిడ్-19 నేరుగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. పొడి దగ్గు, గొంతు నొప్పి, వాసన లేదా రుచి కోల్పోవడం దీని ప్రధాన లక్షణాలు. వ్యాక్సిన్ల రాకతో చాలా వరకు దీని తీవ్రత తగ్గినప్పటికీ, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ఇంకా ముప్పుగానే పరిణమిస్తోంది. కొందరిలో నెలల తరబడి వేధించే ‘లాంగ్ కోవిడ్’ సమస్యలు కూడా ఉన్నాయి. నోరోవైరస్ నివారణకు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, కోవిడ్‌ను అడ్డుకునేందుకు మంచి గాలి ఆడేలా చూసుకోవడం, హంటా వైరస్ దరిచేరకుండా ఎలుకల సంచారాన్ని నివారించడం అత్యంత ఆవశ్యకం.

ఇది కూడా చదవండి: బాబా వంగ చెప్పిన డెడ్లీ వైరస్ ఇదేనా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement