అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చేతులెత్తేశారు. తైవాన్‌కు అండగా నిలుస్తామని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చిన ట్రంప్.. చైనా పర్యటన అనంతరం తైవాన్‌కు భారీ షాకిచ్చారు. చైనా నుంచి తైవాన్‌ను రక్షించలేమని నాలుక మడతేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌నకు తైవాన్ విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. తైవాన్ ఎప్పటికీ చైనాకు లోబడి ఉండదని తేల్చిచెప్పింది.
అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల అనంతరం, తైవాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. తమది పూర్తి సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం కలిగిన ‘స్వతంత్ర’ దేశమని స్పష్టం చేసింది. తైవాన్ ఎప్పటికీ చైనాకు లోబడి ఉండదని తేల్చిచెప్పింది. అమెరికా నుంచి తాము కొనుగోలు చేసే ఆయుధాలు, ఉభయ దేశాల మధ్య ఉన్న 'తైవాన్ రిలేషన్స్ యాక్ట్' భద్రతా ఒప్పందంలో భాగమేనని సమర్థించుకుంది. మరోవైపు, తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టే కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌ను సార్వభౌమ దేశంగా చూస్తామని ప్రకటించారు. తైవాన్ ప్రజాస్వామ్యాన్ని, స్వతంత్రతను కాపాడుకోవడమే తమ లక్ష్యం అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు చైనా-అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతను మరింత పెంచాయి. కాగా, అమెరికా, చైనా ఒత్తిడుల మధ్య తైవాన్ తన స్వీయ గుర్తింపును నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉండగా.. చైనా పర్యటన తర్వాత తైవాన్ విషయమై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో దూరంగా ఉన్న తైవాన్ కోసం అత్యంత బలీయమైన చైనాను ఢీకొట్టలేమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఎవరో(తైవాన్) స్వతంత్రంగా ఉండాలని తాను ఆకాంక్షించడం లేదన్నారు. చైనా నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకొనే ఆలోచన మానుకోవాలని తైవాన్‌కు సూచించారు. ‘‘మనం యుద్ధం చేయడానికి 15,289 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. నేను అది కోరుకోవడం లేదు.
చైనాకు తైవాన్ ద్వీపం కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్లు(తైవాన్, చైనా) సహనం వహించాలని కోరుతున్నాను. ఉద్రిక్తతలకు దూరంగా ఉండాలి. తైవాన్ ద్వీపం గురించి నేను, జిన్‌పింగ్ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అయితే, తైవాన్‌ను అమెరికా రక్షిస్తుందా? లేదా అనేదానిపై చర్చించడానికి నేను నిరాకరించా. తైవాన్ విషయంలో జిన్‌పింగ్‌కు స్పష్టమైన, బలమైన ఉద్దేశాలు ఉన్నాయి. తైవాన్ స్వాతంత్య్ర పోరాటం ఆయనకు ఎంతమాత్రం ఇష్టంలేదు’’అని స్పష్టంచేశారు. తైవాన్ విషయంలో ఇకపై జోక్యం చేసుకునే ఆలోచన లేదని సంకేతాలిచ్చారు.
చైనా–తైవాన్ సమస్య ప్రధానంగా “సార్వభౌమాధికార” (sovereignty) పై వివాదం. చైనా తైవాన్‌ను తన ప్రావిన్స్‌గా భావిస్తే, తైవాన్ ప్రజాస్వామ్యంగా స్వతంత్ర దేశంలా పనిచేస్తోంది. ఈ విభేదం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన ఘర్షణకు కారణమవుతోంది. ఇక, తైవాన్‌లో అమెరికా పాత్ర ప్రధానంగా రక్షణ, వాణిజ్యం, మరియు రాజకీయ మద్దతు చుట్టూ తిరుగుతుంది. 1979లో చైనాతో అధికారిక సంబంధాలు ఏర్పరచుకున్నప్పటికీ, అమెరికా Taiwan Relations Act ద్వారా తైవాన్‌కు ఆయుధాలు, రక్షణ సహాయం అందిస్తోంది. ఇది చైనా-అమెరికా సంబంధాల్లో అత్యంత ఉద్రిక్తకర అంశం.
చరిత్రాత్మక నేపథ్యం
1895: షిమోనోసేకి ఒప్పందం ప్రకారం తైవాన్ జపాన్‌కు అప్పగించబడింది.
1945: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తైవాన్‌ను రిపబ్లిక్ ఆఫ్ చైనా (ROC)కు అప్పగించారు.
1949: చైనా అంతర్గత యుద్ధంలో కమ్యూనిస్టులు విజయం సాధించగా, నేషనలిస్టులు తైవాన్‌కు పారిపోయి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
1971: ఐక్యరాజ్యసమితిలో చైనా స్థానాన్ని బీజింగ్‌లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) స్వీకరించింది. తైవాన్ అంతర్జాతీయంగా ఒంటరైంది.
చైనా తైవాన్‌ను “విభిన్న ప్రావిన్స్”గా భావిస్తుంది.
ఒక దేశం, రెండు వ్యవస్థలు (హాంకాంగ్ మోడల్) ప్రతిపాదించింది కానీ తైవాన్‌లో ప్రధాన పార్టీలు దీనిని తిరస్కరించాయి.
బలప్రయోగం ద్వారా అయినా తైవాన్‌ను కలుపుకోవాలని హెచ్చరిస్తోంది.
తైవాన్‌లో ప్రజాస్వామ్య ఎన్నికల ప్రభుత్వం ఉంది, సుమారు 2.3 కోట్ల జనాభా.
ఎక్కువ మంది ప్రజలు ప్రస్తుత స్థితి (status quo) కొనసాగాలని కోరుకుంటున్నారు. అంటే పూర్తిగా స్వతంత్రత ప్రకటించకుండా, చైనాకు లోబడకుండా ఉండాలనుకుంటున్నారు.
అంతర్జాతీయ ప్రభావం
అమెరికా: తైవాన్‌కు ఆయుధాలు, రక్షణ సహాయం అందిస్తోంది.
ఐక్యరాజ్యసమితి: తైవాన్ సభ్యత్వం లేదు; కేవలం 12 చిన్న దేశాలు మాత్రమే అధికారికంగా గుర్తిస్తున్నాయి.
ప్రాంతీయ భద్రత: తైవాన్‌పై దాడి జరిగితే, అమెరికా-చైనా మధ్య యుద్ధం జరిగే ప్రమాదం ఉంది.


