అయ్యా విజయ్‌.. ఇదయ్యా నీ సినిమా ఇంపాక్ట్‌! | Fan Pays Tribute To Actor Turned CM Vijay With Symbolic ₹22,674 Donation Inspired By His Film Tamilan, Watch Video Inside | Sakshi
Sakshi News home page

అయ్యా విజయ్‌.. ఇదయ్యా నీ సినిమా ఇంపాక్ట్‌!

May 15 2026 11:21 AM | Updated on May 15 2026 11:53 AM

Vijays rise and Aruns act show cinema sparks real change

యాక్టర్‌ టు సీఎం.. సి విజయ్‌ జోసెఫ్‌ ప్రస్థానం గురించి యావత్‌ దేశం మాట్లాడుకునేలా చేసింది. ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో అవి మరీ సినిమాటిక్‌గా అనిపించినా.. భవిష్యత్తులో వాటి ప్రభావం కనిపించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన కెరీర్‌లో సందేశాత్మక చిత్రాలు తీయడమూ అందుకు ఓ కారణమై ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే..

తమిళనాడులో తాజాగా ఓ యువకుడు చేసిన పని నెట్టింట వైరల్‌గా మారుతోంది. విజయ్‌ సర్కార్‌కు విరాళంగా అరుణ్‌ లోకనాథన్‌ రూ.22,674 విరాళం అందించారు. ఈ ఫిగర్‌కు ఓ ప్రాధాన్యం ఉంది. 22-06-1974.. విజయ్‌ పుట్టిన తేదీ కూడా. దీంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. అయితే ఆ యువకుడు అలా చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. విజయ్‌ నటించిన ఓ సినిమానే తాను ఈ పని చేయడానికి స్ఫూర్తి ఇచ్చిందని అరుణ్‌ చెబుతున్నాడు.

అరుణ్‌కు పోలియో ఉంది. అతనొక మెంటలిస్ట్, హిప్నాటిస్ట్, మైండ్-రీడర్‌గా ఈవెంట్లు చేసుకుంటున్నాడు. విజయ్‌ సీఎంగా ప్రమాణం చేశాక.. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. విజయ్‌ చెప్పినదాని ప్రకారం.. తమిళనాడు బడ్జెట్ ఆధారంగా లెక్కలు వేసి వ్యక్తిగతంగా రూ1 లక్షకు పైగా చెల్లించాల్సి వస్తుందని అరుణ్‌ గుర్తించాడు. అందుకే తన వంతుగా మొదట ఈ నగదును అందించినట్లు చెప్పాడు. ఈ క్రమంలో తమిళన్‌ సినిమా సీన్‌ గుర్తు చేశాడు.

విజయ్‌ ప్రధాన పాత్రలో 2002లో తమిళన్‌ అనే చిత్రం వచ్చింది. అందులో దేశం అప్పులు తీర్చడానికి సూర్య(విజయ్‌ పాత్ర పేరు) ప్రధానమంత్రికి రూ.4,000 చెక్కును పంపిస్తాడు. అలా ఆ సీన్‌ ఇన్‌స్పిరేషన్‌తో.. ఇప్పుడు పాతికేళ్ల తర్వాత అరుణ్‌ అదే పని చేసి తన అభిమాన హీరో, ప్రస్తుత సీఎంకు సహకారం అందించాడన్నమాట. 

‘‘నేను పంపిన ఈ సొమ్ముతో రాష్ట్రంలో అప్పులు తీరతాయని నేనేం అనుకోను. కానీ, నేను అభిమానించే వ్యక్తికి నా వంతుగా ఉడతా భక్తిగా అందించిన చిన్నసాయం ఇది. ఈ విరాళంతో వీలైతే నాలా పోలియోతో బాధపడుతున్నవాళ్లకు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన ప్రదేశాలు, సులభమైన యాక్సెస్ కల్పించాలి’’ విజయ్‌ సర్కార్‌ను కోరుతున్నాడు. ఈ ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు, ముందుగా మీలోనే ఆ మార్పు తీసుకురండి.. అని మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా అరుణ్‌ ప్రస్తావించాడు. Fulfilling my individual debt responsibility అనే క్యాంపెయిన్‌ను కొనసాగిస్తానని ప్రకటించాడు. అన్నట్లు తమిళన్‌ సినిమాలో హీరో సూర్య పాత్ర లాయర్‌ పాత్ర. అరుణ్‌ కూడా గతంలో లా చేశాడంట.  

విజయ్‌కు టర్నింగ్‌ పాయింట్‌
విజయ్‌ సినీ కెరీర్‌ను తమిళన్‌కు ముందు.. తమిళ్‌కు తర్వాత అని కచ్చితంగా చెప్పొచ్చు. అప్పటిదాకా రొమాంటిక్‌, యాక్షన్‌, ఫ్యామిలీ ఓరియెంట్‌ జానర్‌ రొడ్డకొట్టుడు చిత్రాలు తీసిన.. తమిళన్‌లాంటి సందేశాత్మక చిత్రం తీసి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి అబ్దుల్‌ మాజిత్‌ డైరెక్ట్‌కాగా, దర్శకనిర్మాత.. విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ స్క్రీన్‌ప్లే అందించారు. మరో హైలైట్‌ ఏంటంటే.. ప్రియాంక చోప్రా నటించిన ఏకైక తమిళ చిత్రం(ఇప్పటిదాకా). 

ఈ సినిమాలో హీరో సూర్య లా విద్యార్థి. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతుంటాడు. జనాల్లో చట్టాలపై అవగాహన కల్పించడం చేస్తుంటాడు. బస్సులో చిల్లర కూడా ఇవ్వకుండా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించే కండక్టర్‌ను.. ప్రయాణికుల సంతకాలతో కోర్టుకు లాంటి సన్నివేశాలు షార్ట్‌ రీల్స్‌ రూపంలో ఆ మధ్య వైరల్‌ కూడా అయ్యాయి. అదే సమయంలో తన కుటుంబాన్ని నాశనం చేసిన కార్పొరేట్‌ శక్తులపైనా ప్రతీకారం తీర్చుకునే డ్రామా కూడా నడుస్తుంది. అయితే ఈ సినిమా మరీ లిబర్టీక్‌గా ఉండడంతో కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయినా.. విజయ్‌ నటనకు మాత్రం తమిళ ఆడియన్స్‌ బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాతే ఆయన సందేశాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. తెలుగులో ‘‘దమ్ముంటే కాస్కో’’ పేరుతో డబ్బింగ్‌ వర్షన్‌ యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది.

సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. అమ్మాయిలు కనిపిస్తే వీలైతే ముద్దు పెట్టాలి.. లేదంటే కడుపు చేయాలి. సెలైన్సర్లు పీకేసి బైకులేసుకుని రోడ్ల మీద పడాలి అని కొందరు సోకాల్డ్‌ హీరోల్లా విజయ్‌ ఏనాడూ అభిమానులకు చిల్లర పిలుపులు ఇవ్వలేదు. కుర్రహీరోయిన్లతో ఫంక్షన్‌లలో వెకిలి చేష్టలకు పాల్పడుతూ పరువు తీసుకోలేదు. విజయ్‌ తన సినిమాలతోనే కాదు ప్రసంగాలతోనూ అభిమానుల్ని ఆలోచింపజేసేవారు.. ‘‘మీరూ ఎదగండ్రా బాబూ..’’ అని మోటివేట్‌ చేసేవారు. సినిమా అనేది నిజ జీవితంలో మార్పు తెస్తుందా? అనే చాలామంది వ్యక్తం చేసే అనుమానం. కానీ, మార్పు అనే నినాదంతో అధికారం చేపట్టిన విజయ్‌.. తన సినిమాలతో అది సాధ్యమని తన అభిమాని అరుణ్‌ ఉదంతంతో శాంపిల్‌ చూపించారు. పౌరులు కూడా పాలనలో భాగస్వాములు కావాలనే కొత్త సందేశం ఇప్పించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement