ఫ్రాన్స్‌లో జరుగుతోన్న కాన్స్ చిత్రోత్సవంలో భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన సినీ తారలు పాల్గొని, తమ అందచందాలతో అదరగొడుతున్నారు. మంగళవారంతో ఆరంభమైన ఈ ఫెస్టివల్ ఈ నెల 23తో ముగుస్తుంది. ఇప్పటికే భారత్ నుంచి బాలీవుడ్ నటి అలియా భట్ రెడ్ కార్పెట్‌పై మెరిసింది. మరో నటి ఊర్వశీ రౌతేలా కూడా క్రిస్టల్ గౌనుతో అదరహో అనిపించారు. కానీ తొలిసారిగా ఈ ప్రపంచ వేదికపై భారతీయ ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. ప్రముఖ గాయని, నటి, మోడల్ ఆర్తి ఖేతర్పాల్ కాన్స్ రెడ్ కార్పెట్‌పైకి బృందావన్ భక్తి స్ఫూర్తిని తీసుకువచ్చారు.
ఆమె డిజైనర్ సులక్షణ మోంగా రూపొందించిన ప్రత్యేక బృందావన్ లెహంగాను ధరించారు. పైగా ఆ డిజైనర్ వేర్‌కి జతగా శ్రీకృష్ణుడి చిత్రంతో కూడిన జపమాల సంచి, తులసీ కంఠి మాలను జతచేశారు. ఆ సంప్రదాయ లెహంగాకు అనుగుణంగా పోల్కీ బ్రాస్‌లెట్, రాళ్ల నెక్లెస్, చెవిపోగులను ధరించారు. ఆమె తన వెంట చిన్న పవిత్ర భగవద్గీత ప్రతిని కూడా తీసుకువచ్చారు. ఈ ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చరిత్రలో తొలిసారి ఇలా సనాతన ధర్మాన్ని గర్వంగా చూపించడం. ఆ క్రెడిట్ నటి ఆర్తి ఖేతర్పాల్‌కే దక్కుతుంది.
తన భక్తి మేళవింపుతో ఉన్న తన ఫ్యాషన్ స్టైల్ దేవుడిని విశ్వసించే ప్రతి మానవునికి, జపం నేర్పే గురువులు, సాధువులందరికీ, భగవద్గీతను రచించిన వేదవ్యాసునికి, అలాగే వేద గ్రంథాలను భవిష్యత్తుతరాలకు అందేలా చేస్తున్న ప్రచురణ సంస్థలకు, అలాగే ఫ్యాషన్‌లోకి భక్తి విశ్వాసాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న డిజైనర్లకు అంకితం అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారామె. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నారామె.
కాగా, ఈ నటి 'సౌండ్స్ ఆఫ్ కుంభ' అనే ఆల్బమ్‌లో కనిపించారు, ఇది 2026 గ్రామీ అవార్డులకు నామినేషన్ పొందింది. ఈ ఏడాది ప్రారంభంలో, కూడా ఆర్తి ఇదే విధంగా గ్రామీ అవార్డులకు బృందావన అంశాలను తీసుకువచ్చారు. ఆ వేడుకలో ఆమె లడ్డూ గోపాల్, లేదా బాలకృష్ణుడు ఉన్న నెక్లెస్ ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
డిజైనర్లకు పురాణాలు, ఆధ్యాత్మికత అనేవి రోజురోజుకూ ప్రజాదరణ పొందిన ఇతివృత్తాలుగా మారడం విశేషం. ప్రముఖులు హిందూ దేవతల చిత్రాలను, భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలలోని శ్లోకాలను ధరించి కనిపిస్తున్నారు. రామ నవమి నాడు, నీతా అంబానీ కూడా ఇలానే భక్తిని స్ఫురించేలా ఇకాత్ చీరను ధరించారు. ఆ చీరపై రామ శిల స్ఫూర్తితో రూపొందించిన మొజాయిక్ ఉంది, అలాగే "రామ్" అనే పదం అనేక భాషలలో లిఖించి ఉంది.
(చదవండి: కాన్స్‌లో అందమైన గులాబీలా అలియా భట్)


