చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురువారం లేఖ రాశారు. పత్తిపై దిగుమతి సుంకాన్ని తొలగించాలని ఆ లేఖలో కోరారు. గ్రామీణ మహిళలకు అత్యధిక ఉపాధి ఇస్తున్న రాష్ట్ర టెక్స్‌టైల్ రంగం సంక్షోభంలో ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి ఉత్పత్తి కొరత, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడం వల్ల పత్తి, నూలు ధరలు పెరిగి తీవ్ర సంక్షోభం ఏర్పడిందని విజయ్ తెలిపారు.
“తమిళనాడు భారత్‌లోనే టెక్స్‌టైల్, అపారెల్ ఎగుమతి చేసే అతిపెద్ద రాష్ట్రం. లక్షలాది మంది ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ రంగంపై ఆధారపడుతున్నారు. ఇటీవల పత్తి ధరలు, దాని ప్రభావంతో నూలు ధరలు పెరగడం వల్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో పత్తి ఉత్పత్తి కొరత, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడం దీనికి ప్రధాన కారణం” అని ఆయన లేఖలో రాశారు.
గత 2 నెలల్లో పత్తి ధరలు 25 శాతం పెరిగాయని తెలిపారు. ఒక్క క్యాండీ ధర రూ. 54,700 నుంచి రూ. 67,700కు పెరిగిందని చెప్పారు. నూలు ధరలు కూడా కిలోకు రూ. 301 నుంచి రూ. 330కు పెరిగాయని, దీనివల్ల పరిశ్రమకు ముడి సరుకు కొరత తీవ్రంగా ఏర్పడిందని పేర్కొన్నారు.
“గత 2 నెలల్లో పత్తి ధర రూ. 54,700 నుంచి రూ. 67,700కు పెరిగింది. ఇది 25 శాతం పెరుగుదల. అదే సమయంలో నూలు ధర కిలోకు రూ. 301 నుంచి రూ. 330కు పెరిగింది. ఈ పరిస్థితుల్లో ముడి సరుకు నిరంతర సరఫరా దిగుమతుల ద్వారానే సాధ్యమవుతుంది. అయితే పత్తిపై 11 శాతం దిగుమతి సుంకం ఉంది” అని ఆయన తెలిపారు. వ్యవసాయం తర్వాత టెక్స్‌టైల్స్, అపారెల్ రంగం అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగమని ముఖ్యమంత్రి విజయ్ తెలిపారు.
“ఇలాంటి పరిస్థితుల్లో సుంకం లేకుండా పత్తి దిగుమతులకు అనుమతి ఇస్తే ప్రపంచ స్థాయిలో పోటీ సామర్థ్యాన్ని నిలబెట్టుకోగలదు. లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోకుండా కాపాడడం, టెక్స్‌టైల్ విలువ స్థిరత్వాన్ని కాపాడటం ప్రభుత్వంపై ఉన్న బాధ్యత” అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని 0 శాతానికి తగ్గించి ముడి సరుకు లభ్యతకు సహకరించాలని కేంద్రాన్ని కోరారు.


