బిగ్‌ అలర్ట్‌.. ఈనెల 20న మెడికల్ షాపులు బంద్ | AIOCD Call Nation wide Bandh On 20th May 2026 | Sakshi
Sakshi News home page

బిగ్‌ అలర్ట్‌.. ఈనెల 20న మెడికల్ షాపులు బంద్

May 15 2026 11:10 AM | Updated on May 15 2026 11:15 AM

AIOCD Call Nation wide Bandh On 20th May 2026

దేశ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఈ బంద్‌లో సుమారు 12.40 లక్షలకు పైగా కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొంటారని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్(AIOCD) తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ బంద్ కారణంగా సాధారణ మందుల కొనుగోలు ఒక రోజు పాటు తీవ్రంగా ప్రభావితం కానుంది. ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఎమర్జెన్సీ ఫార్మసీలు మాత్రం తెరిచి ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసర మందులను ముందుగానే కోనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. 

వివరాల మేరకు.. అఖిల భారత ఔషధ వ్యాపారుల సంఘం (AIOCD) పిలుపు మేరకు ఈనెల 20న దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులను మూసివేయనున్నారు. ఏఐఓసీడీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని మెడికల్ షాపులు, కొన్ని ఔషధ సరఫరా సంస్థలు కూడా బంద్‌ కానున్నాయి. అయితే, పెద్ద కార్పొరేట్ కంపెనీల అండదండలతో నడుస్తున్న ఆన్‌లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ సంప్రదాయ మెడికల్ షాపులకు నష్టం కలిగిస్తున్నాయని కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఫార్మసీలు ఈ పోటీని తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు చెబుతున్నారు.

ఇక, ఆన్‌లైన్ ఫార్మసీ నియంత్రించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆన్‌లైన్ కంపెనీలు తక్కువ ధరలకు మందులు అమ్మడం వల్ల స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లు మిస్‌యూజ్ అవుతున్నాయని, డ్రగ్స్ కూడా విచ్చవిలవిడిగా ఆన్‌లైన్‌లో విక్రయాలు అవుతున్నాయన్నారు. అలాగే, కార్పొరేట్ సెక్టార్లు ఇస్తున్న డిస్కౌంట్లు నియంత్రించాలని, ధరల నియంత్రణ విషయంలో నిబంధనలు పాటించకుండా నేషనల్ ప్రైజ్ అథారిటీ ప్రకారం విక్రయాలు చేయాలని డిమాండ్‌ చేశారు. పేషెంట్లకు కోవిడ్ సమయంలో మందులు డోర్ డెలివరీ చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని నిలిపివేయాలని కోరుతున్నారు. ఇదిలాఉంటే.. ఈ అంశంపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని AIOCD పేర్కొంది.

ఈ నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ (DCOIWA) తరపున జాతీయ అధ్యక్షుడు జి. కోటేశ్వర రావు మాట్లాడుతూ.. బంద్ సమయంలో ప్రజల భద్రతను, నిత్యావసర మందుల లభ్యతను, శాంతిభద్రతలను మరియు బాధ్యతాయుతమైన సమాచార మార్పిడిని పాటించాలని సంబంధిత వర్గాలందరికీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలిగించకుండా, బంద్‌లో శాంతియుతంగా మరియు చట్టబద్ధంగా పాల్గొనాలి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, నిజమైన అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఎమర్జెన్సీ మందులను సరఫరా చేయాలన్నారు. 

రోగులు, ప్రజలు, అధికారులు లేదా ఏజెన్సీలతో ఎటువంటి ఘర్షణకు దిగవద్దని కోరారు. సోషల్ మీడియా లేదా ఇతర వేదికల ద్వారా పుకార్లు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు. అక్రమ అమ్మకాలు, బ్లాక్ మార్కెటింగ్, నకిలీ మందులు, అనధికార ఆన్‌లైన్ మందుల పంపిణీపై కఠినమైన నిఘా ఉంచాలన్నారు. మందుల సరఫరా మరియు ప్రజారోగ్య పరిస్థితులపై ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలన్నారు. బంద్ సమయంలో ఎలాంటి బలవంతపు మూసివేతలు, బెదిరింపులు, ఆటంకాలు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలను నివారించాలని పోలీసు శాఖను కోరారు. అంబులెన్సులు, అత్యవసర మందుల సరఫరా వాహనాలు మరియు ఆరోగ్య సిబ్బంది సులభంగా రాకపోకలు సాగించేలా చూడాలన్నారు. పుకార్లు, హింస లేదా ప్రజాశాంతికి భంగం కలిగించే చర్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

బంద్‌కు కారణాలు

  • అక్రమ ఈ-ఫార్మసీలు: Drugs & Cosmetics Act, 1940లో స్పష్టమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ లేకుండా పనిచేస్తున్నాయి.
  • డీప్ డిస్కౌంటింగ్: కార్పొరేట్ ఈ-ఫార్మసీలు 20–60% తగ్గింపులు ఇస్తూ చిన్న కెమిస్టుల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి.
  • రోగుల భద్రతా సమస్యలు: ప్రిస్క్రిప్షన్ వెరిఫికేషన్ లేకుండా మందులు అమ్మడం, AI ద్వారా నకిలీ ప్రిస్క్రిప్షన్లు.
  • COVID కాలం సడలింపులు: G.S.R. 220 (E) నోటిఫికేషన్ ఇంకా కొనసాగుతోంది.

ఈ-ఫార్మసీల నియంత్రణ చట్టాలు

  • Drugs & Cosmetics Act, 1940: ఫిజికల్ ఫార్మసీలకు వర్తించే చట్టం, కానీ ఈ-ఫార్మసీలకు స్పష్టమైన నిబంధనలు లేవు.
  • Draft E-Pharmacy Rules, 2018: రిజిస్ట్రేషన్, ఇన్స్పెక్షన్, ప్రకటనల నిషేధం, ఫిర్యాదు పరిష్కారం వంటి నిబంధనలు ప్రతిపాదించబడ్డాయి కానీ ఇంకా అమలు కాలేదు.
  • Delhi High Court Interim Stay (2018): ఆన్‌లైన్ మందుల అమ్మకంపై తాత్కాలిక నిషేధం విధించింది, కానీ అమలు అసమానంగా ఉంది.
  • CDSCO Show-Cause Notices (2023): లైసెన్స్ లేకుండా పనిచేసిన 20 ఈ-ఫార్మసీలకు నోటీసులు ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement