కోడిగుడ్డంత పుచ్చకాయలు | Watermelons in the size of a chicken egg | Sakshi
Sakshi News home page

కోడిగుడ్డంత పుచ్చకాయలు

May 17 2026 10:01 AM | Updated on May 17 2026 10:27 AM

Watermelons in the size of a chicken egg

పుచ్చకాయలు భారీగా ఉంటాయి. రెండు చేతులు పట్టనంత పరిమాణంలో ఉంటాయి. ఒక్కో పుచ్చకాయ బరువు సగటున ఏడు నుంచి తొమ్మిది కిలోల వరకు ఉంటుంది. మామూలు పుచ్చకాయలకు భిన్నంగా అమెరికాలోని నార్త్‌ వర్జీనియాకు చెందిన ఔత్సాహిక ఉద్యానవేత్తలయిన తల్లీకూతుళ్లు కోడిగుడ్డంత పుచ్చకాయలను పండిస్తుండటం ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం రెండంగుళాల వ్యాసంలో ఉండే ఈ పుచ్చకాయలు ఒక్కొక్కటి ఎనభై నుంచి వంద గ్రాముల బరువు మాత్రమే ఉండటం విశేషం. 

పరిమాణం, బరువు తక్కువగానే ఉన్నా; రుచిలో మాత్రం ఇవి ఏమాత్రం తీసిపోవని వీటిని పండిస్తున్న డిలానీ రాప్టిస్, ఆమె తల్లి చెబుతున్నారు. చిన్నసైజు పుచ్చకాయలను పండించడానికి ఐదేళ్లుగా ప్రయత్నాలు సాగించి, విజయం సాధించామని వారు తెలిపారు. జన్యుమార్పిడి పద్ధతులేవీ లేకుండానే, సహజమైన పద్ధతుల్లోనే వీటిని పండిస్తుండటంపై అమెరికాకు చెందిన ‘హార్టి డైలీ మ్యాగజైన్‌’ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది.

దుర్వాసన వెదజల్లే పుష్పం 
ఫ్రెండ్స్‌.. ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం ఏంటో తెలుసా? రఫ్లేషియా. ఇది సుమారు 3 అడుగుల వెడల్పు, 10 కిలోల బరువు ఉంటుంది. సాధారణంగా మనం చూసే మొక్కలన్నింటికీ ఆకులు, కొమ్మలు, వేర్లు ఉంటాయి. కానీ ఈ రఫ్లేషియా పుష్పానికి కాండం, ఆకులు, కనీసం వేర్లు కూడా ఉండవు. ఇది అడవిలో దొరికే వేరే మొక్కల తీగలపై ఆధారపడి, వాటి నుంచి ఆహారాన్ని తీసుకుంటూ జీవిస్తుంది. 

అందుకే దీన్ని పరాన్నజీవి అంటారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే ఈ పువ్వు నుంచి వచ్చే వాసనను మనం అస్సలు తట్టుకోలేము. ఇది కుళ్ళిపోయిన మాంసం వంటి ఘోరమైన దుర్వాసనను వెదజల్లుతుంది. అందుకే దీనిని శవ పుష్పం అని కూడా పిలుస్తారు. ఈ అరుదైన పుష్పాలు ఆగ్నేయాసియాలోని ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల దట్టమైన వర్షారణ్యాలలో మాత్రమే కనిపిస్తాయి. ఈ పువ్వు పూర్తిగా విచ్చుకోవడానికి దాదాపు 9 నెలల సమయం పడుతుంది.

(చదవండి: అపురూపమైన అడవి మామిడి పండ్ల జాతులు)


 

Advertisement
 
Advertisement
Advertisement