కోట: దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైళ్లలో ఒకటైన తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో (12431) ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాజస్థాన్ లోని కోట రైల్వే డివిజన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ అగ్నిప్రమాదం.. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. సిబ్బంది అప్రమత్తతతో అత్యవసర సహాయక చర్యలు సకాలంలో మొదలుకావడంతో పెను ప్రాణనష్టం తప్పింది.
తెల్లవారుజామున చెలరేగిన మంటలు
ఆదివారం ఉదయం సరిగ్గా 5:15 గంటల సమయంలో ఈ రైలు లూని రిచ్ఛా, విక్రమ్‌గఢ్ అలోట్ రైల్వే స్టేషన్ల మధ్య వేగంగా వెళేతోంది. ఆ సమయంలో ఒక్కసారిగా రైలులోని బీ1 (B1) ఏసీ కోచ్‌తో పాటు ఇంజిన్ విభాగంలో అగ్ని కీలలు వెలువడ్డాయి. క్షణాల్లో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనకు గురయ్యారు.
అప్రమత్తమైన రైల్వే యంత్రాంగం
ఈ ప్రమాదం జరిగిన వెంటనే కోట రైల్వే స్టేషన్‌లో ఉన్న ఆటోమేటిక్ హూటర్ భారీ శబ్దంతో మోగడంతో స్థానిక రైల్వే పరిపాలనా విభాగం వెంటనే అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే కోట రైల్వే డివిజన్‌కు చెందిన సీనియర్ అధికారులు, అత్యవసర రెస్క్యూ, రిలీఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పరిస్థితిని తమ అదుపులోకి తీసుకువచ్చేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆపరేషన్లను ముమ్మరం చేశారు.
గార్డు సమయస్ఫూర్తితో..
రైలులో మంటలు చెలరేగుతున్న విషయాన్ని గమనించిన వెంటనే ఆన్‌బోర్డ్ గార్డు అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంటలంటుకున్న విషయాన్ని అధికారులకు తెలియజేసి, అత్యవసరంగా రైలును నిలిపివేశారు. రైలు ఆగిన వెంటనే రైల్వే సిబ్బంది వేగంగా స్పందించి, ప్రమాదానికి గురైన బీవన్ కోచ్‌లోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. సకాలంలో రైల్వే సిబ్బంది చేపట్టిన చర్యలతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
ఇది కూడా చదవండి: ‘భోజ్‌శాల’ తీర్పుతో షాక్..అవి మందిరాలా? మసీదులా?


