థానే: అర్ధరాత్రి ఛాటింగులు, ప్రేమ సందేశాలతో మొదలైన ఓ ‘అక్రమ’ ప్రేమకథ చివరకు అత్యంత ఘోరమైన హత్యతో ముగిసింది. ప్రియుడు డబ్బులు ఇవ్వడం మానేశాడనే కోపంతో ఓ వివాహిత తన భర్త, ఇతరులతో కలిసి ప్రియుడిని కిరాతకంగా హత్య చేసింది. అనంతరం అతని మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్‌లో కుక్కి, నిర్జన ప్రదేశంలో పడేసింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.
ప్రేమ పేరిట వల.. ఆపై దారుణం
థానే జిల్లాలోని ముంబ్రా ప్రాంతానికి చెందిన అర్బాజ్ మక్సూద్ అలీ ఖాన్ (26) డోంబివిలిలోని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వసాయికి చెందిన వివాహిత మెహజబీన్ ఖాతున్ ఏక్రాన్ షేక్ (25)తో అతనికి 2021 నుండి వివాహేతర సంబంధం ఉంది. మొదట్లో వీరి వ్యవహారం బాగానే సాగింది. ఈ క్రమంలో మెహజబీన్ నుంచి తరచూ అర్బాజ్ నుండి భారీగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. అతను కూడా ప్రతి నెలా ఆమె బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపుతూ వచ్చాడు. అయితే ఇటీవలి కాలంలో అర్బాజ్ డబ్బులు ఇవ్వడం నిలిపివేయడంతో ఆమె అతనిపై కక్ష పెంచుకుంది. తన భర్త హసన్ షేక్, సోదరుడు తారిక్ షేక్, అతని స్నేహితుడు మొజ్జమ్ పఠాన్‌లతో కలిసి అర్బాజ్ హత్యకు ప్లాన్ చేసింది.
డబ్బుల కోసం పిలిపించి హత్య
ఏప్రిల్ 3న ఆఫీస్ పనిమీద దాదర్ వెళ్లిన అర్బాజ్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతని తండ్రి ముంబ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అర్బాజ్ కాల్ డేటా, మొబైల్ లొకేషన్‌ను పరిశీలించగా, అతను అదృశ్యమైన రోజు మెహజబీన్ లొకేషన్‌తో సరిపోలింది. అంతేకాకుండా అదృశ్యానికి ఒక రోజు ముందే అతను ఆమెకు రూ. 50,000 బదిలీ చేసినట్లు తేలింది. అనుమానంతో పోలీసులు మెహజబీన్‌ను అదుపులోకి తీసుకుని, విచారించగా అసలు నిజం బయటపడింది. డబ్బుల కోసమే అతడిని వసాయిలోని తన నివాసానికి పిలిపించానని, అక్కడ అతని వద్ద ఏమీ లేకపోవడంతో తామంతా కలిసి అర్బాజ్ కాళ్లు, చేతులు కట్టేసి ప్లాస్టిక్ పైపుతో తలపై తీవ్రంగా కొట్టి చంపినట్లు ఆమె అంగీకరించింది.
పోలీసుల వేట
హత్య అనంతరం నిందితులు అర్బాజ్ మృతదేహాన్ని ఒక డ్రమ్‌లో కుక్కి, వాలీవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మానుష్య డ్రైనేజీ కాల్వలో పడేశారు. ఈ ఘోరానికి పాల్పడిన మెహజబీన్, ఆమె సోదరుడు తారిక్‌లను పోలీసులు మే ఏడున అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె భర్త హసన్, అతని స్నేహితుడు పఠాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద కిడ్నాప్, హత్య, సాక్ష్యాధారాల నాశనం లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: బెంగాల్‌లో అర్ధరాత్రి భారీ విధ్వంసం


