బెంగాల్‌లో ట్విస్ట్‌.. అభిషేక్‌ బెనర్జీకి బిగ్‌ షాక్‌ | FIR Against TMC Abhishek Banerjee Over Provocative Poll Speeches During Election Campaign, Know Details About This Controversy | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో ట్విస్ట్‌.. అభిషేక్‌ బెనర్జీకి బిగ్‌ షాక్‌

May 16 2026 7:38 AM | Updated on May 16 2026 10:34 AM

FIR Against TMC Abhishek Banerjee over provocative poll speeches

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. బెంగాల్‌లో అధికారం కోల్పోవ‌డంతో తృణమూల్ కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా అభిషేక్‌ బెనర్జీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై అభిషేక్ బెనర్జీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల మేరకు.. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు మే 5న సామాజిక కార్యకర్త రాజీబ్ సర్కార్.. అభిషేక్‌ బెనర్జీపై ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 27 నుంచి మే 3 మధ్య జరిగిన పలు ప్రచార కార్యక్రమాల్లో అభిషేక్ బెనర్జీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో బగుయాటి పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదును నమోదు చేశారు. అభిషేక్‌ ప్రసంగాలు విద్వేషాన్ని రెచ్చగొట్టాయని, ప్రజాశాంతికి భంగం కలిగించాయని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు ఉన్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. సర్కార్ తన ఫిర్యాదులో భాగంగా పలు ప్రసంగాల లింకులను కూడా సమర్పించారు.

ఈ క్రమంలో మే 15వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 192, 196, 351(2) మరియు 353(1)(సి)లతో పాటు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 123(2) మరియు 125 కింద ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో, పోలీసులు.. అభిషేక్‌ ప్రసంగాలు రెచ్చగొట్టే, బెదిరింపులతో కూడిన, అశాంతిని సృష్టించి, మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అనంతరం.. ఈ కేసు దర్యాప్తు చేపట్టాలని సబ్-ఇన్‌స్పెక్టర్ సోమనాథ్ సింఘా రాయ్‌ను ఉన్నతాధికారులు ఆదేశించారు.

అభిషేక్‌ సతీమణి వివాదం..
ఇదిలా ఉండగా.. అంతకుముందు అభిషేక్ బెన‌ర్జీ భార్య రుజిరా నరులా నకిలీ పత్రాల వివాదం తెర‌పైకి వ‌చ్చింది. బొగ్గు కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రుజిరా రెండు పాన్‌కార్డుల‌ను క‌లిగివున్నార‌న్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ రెండు పాన్‌కార్డుల్లో తండ్రుల పేర్లు వేర్వేరుగా ఉండ‌డం మ‌రిన్ని అనుమానాల‌కు తావిస్తోంది. ఆమె ఫోర్జరీకి పాల్ప‌డివుంటార‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి. రుజిరా బెనర్జీ పేరుతో ఒక‌టి, రుజిరా న‌రులా పేరుతో మ‌రో పాన్‌కార్డు ఆమె క‌లిగివున్నార‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ రెండింటిలో తండ్రులు పేర్లు వేర్వేరుగా ఉన్న‌ట్టు తెలిపారు. మ‌రోవైపు రుజిరా ద్వంద్వ‌ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయని 'న‌వ భార‌త్ టైమ్స్' నివేదించింది.

థాయ్‌లాండ్‌ పౌరసత్వం
రుజిరా నరులా బెనర్జీకి థాయ్‌లాండ్‌ పౌరసత్వం కూడా ఉన్న‌ట్టు వెల్లడైంది. ఆమెకు థాయ్‌లాండ్‌ పాస్‌పోర్ట్ ఉంది. అభిషేక్ బెన‌ర్జీని పెళ్లిచేసుకుని బెంగాల్‌లో స్థిర‌ప‌డిన‌ప్ప‌టికీ ఆమె థాయ్ పౌర‌స‌త్వం వ‌దులుకోలేద‌ని తెలుస్తోంది. దీంతో భారతదేశంలో ఆమె చట్టపరమైన హోదాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, 2012లో అభిషేక్ బెనర్జీని వివాహం చేసుకోవ‌డంతో ఆమె గురించి బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిసింది. ఆ స‌మ‌యంలో అభిషేక్ బెనర్జీ కూడా రాజ‌కీయంగా ఎదిగే ద‌శ‌లో ఉన్నారు. అప్ప‌టికే ఆయ‌న ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కొన‌సాగుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎంపీగా ఎన్నిక‌య్యారు. అభిషేక్‌, రుజిరా దంప‌తుల‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement