ఇప్పుడు అర్థమవుతోంది బాపూ..! | Jeedimetla Constable Raju Letter Viral In Social Media | Sakshi
Sakshi News home page

ఇప్పుడు అర్థమవుతోంది బాపూ..!

May 16 2026 7:05 AM | Updated on May 16 2026 7:14 AM

Jeedimetla Constable Raju Letter Viral In Social Media

‘తల్లిదండ్రులకు ఓ ఉత్తరం’ పేరుతో విధానం

భావోద్వేగాల ప్రాముఖ్యత తెలిపేలా ఈ ప్రయోగం

తన ఠాణాలో చేపట్టిన జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ మల్లేష్‌

ప్రతి ఒక్కరినీ కదిలించేలా రాసిన ఓ కానిస్టేబుల్‌

ఉత్తరం.. ఒకప్పుడు భావోద్వేగాలు పంచుకోవడానికి ఉపకరించే ఏకైక సాధనం. స్మార్ట్‌ యుగంలో దీన్ని అంతా మర్చిపోయాం. వ్యక్తిగత అవసరాలతో పాటు అధికారిక అవసరాలకూ ఈ–మెయిల్, వాట్సాప్‌ వంటి సాంకేతిక అంశాలనే వినియోగిస్తున్నాం. అయితే సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని జీడిమెట్ల ఠాణా ఇన్‌స్పెక్టర్‌ జి.మల్లేశం మాత్రం మనలోని భావాలను మన వారికి పూర్తిగా వ్యక్తీకరించాలంటే ఉత్తరం రాయడం ఉత్తమం అని, దాని వల్లే అనుబంధాలు మరింతగా అల్లుకుంటాయని భావించారు. 

దీంతో తన పోలీసుస్టేషన్‌లోని అధికారులు, సిబ్బందితో ‘తల్లిదండ్రులకు ఓ ఉత్తరం’ పేరుతో శుక్రవారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఖాకీ చొక్కా వెనుక కన్నీటి కథను వివరిస్తూ కానిస్టేబుల్‌ రాజు ఇన్ ల్యాండ్ లెటర్‌లో రాసిన ఉత్తరం వైరల్‌గా మారింది. అందులోని అంశాలు ఇలా...

‘పూజ్యలైన తండ్రి గారికి తమ చిన్నకుమారుడు రాయునది. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను. మీరు అక్కడ క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నా. మా పిల్లలు, భార్య వేసవి సెలవులకు వారి అమ్మ వాళ్ల ఊరికి వెళ్లారు. పిల్లలు, ఫ్యామిలీ లేకుండా ఉండటం చాలా కష్టంగా ఉంది బాపూ. కానీ.. మీరు ఎనిమిది ఏళ్లుగా అమ్మ లేకుండా, మాకు దూరంగా ఉంటూ ఎంత కష్టంగా జీవనం సాగిస్తున్నారో ఇప్పడు అర్థం అవుతోంది. రియల్లీ ఐ మిస్‌యూ బాపూ. వంట పని, ఇంటి పనికి తోడు లేకుండా జీవించడం చాలా కష్టం బాపూ. నీ కంటి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లినట్టు తెలిసింది. నేను ఇంటికి వచ్చాక నీ కంటికి ఆపరేషన్‌ చేయిస్తాను. ఆ హాస్పిటల్‌ వారితో మాట్లాడుతున్నాను.

నువ్వు ఖాళీగా ఉండలేక కరువు పనికి వెళ్తున్నావని తెలిసింది. ఖాళీగా ఉండలేక, ఆరోగ్యం సహకరిస్తేనే వెళ్లు. ఇంటి దగ్గర అమ్మ, మీరు ఉన్నప్పుడు పండుగలు, పబ్బాలు, ఫంక్షన్లు చాలా సంతోషంగా జరుపుకున్నాం. కానీ ఇప్పుడు అమ్మ లేకపోవడంతో మీరు మాకు దూరంగా ఉండటంతో అన్నీ మిస్‌ అవుతున్నాం బాపు. ఈ ఉద్యోగం, పిల్లల చదువులు, ఇంటికి దూరంగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నా. అన్ని ఫంక్షన్లు, పండుగలకు రావాలని ఉంది కానీ కుదరడం లేదు బాపూ. ఈసారి నేను పది రోజులు సెలవు తీసుకుని ఇంటికి వచ్చి మీ కంటి ఆపరేషన్‌ చేయించడంతో పాటు మన బంధువుల పెళ్లికి మీ కలిసి పాలుపంచుకుంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్త.
ఇట్లు నాన్నకు ప్రేమతో.. తమ చిన్న కుమారుడు రాజీ (రాజు). 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement