ఢిల్లీ: దేశంలో పెట్రో రేట్ల పెంపుపై కేంద్రంగా తొలిసారిగా స్పందించింది. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిరణ్ రిజుజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా, ద్రవ్యోల్భణం పెరగకుండా చమురు సంస్థలు ఇన్నాళ్లూ భారాన్ని మోశాయి. అన్ని దేశాల కంటే భారత్‌లోనే పెట్రో రేట్లు తక్కువగా పెరిగాయని చెప్పుకొచ్చారు.
కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ఎక్స్ వేదికగా స్పందిస్తూ..‘పశ్చిమాసియా పరిణామాలతో చమురు ధరలు పెరిగినా భారత్ మాత్రం ప్రజలపై భారం మోపలేదు. మిగతా దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను 20-100 శాతం పెంచాయి. కానీ, భారత్‌లో మాత్రం పెట్రోల్‌పై 3.2 శాతం, డీజిల్‌పై 3.4 శాతం పెరిగింది. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా, ద్రవ్యోల్భణం పెరగకుండా చమురు సంస్థలు ఇన్నాళ్లూ భారాన్ని మోశాయి. ఇది బాధ్యతతో కూడిన పరిపాలన. ఇది ప్రజలకు ప్రాధాన్యతనిచ్చే నాయకత్వం. నాయకత్వంలో, భారతదేశం ఆర్థిక స్థిరత్వాన్ని, ప్రజా సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూనే ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
As the world battled rising fuel costs after the West Asia conflict, India stood apart.
While several countries witnessed petrol & diesel hikes ranging from 20% to nearly 100%, India limited the increase to just +3.2% for petrol & +3.4% for diesel.
Even as Brent crude crossed… pic.twitter.com/nbyiBbhhC9— Kiren Rijiju (@KirenRijiju) May 15, 2026
ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా వాహనదారులకు ఊహించినట్లే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా రూ.3పైగా పెంచాయి. ఈ పెంపు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటికే భారంగా ఉన్న ఇంధన ధరలు మరింత పెరిగి ప్రజల జేబులకు మంటలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. పెంపు వెనుక కారణాలు.. 2022 ఏప్రిల్ నుంచి(ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంలోనూ) పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. పైగా లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయి. అయితే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం కారణంగా ఆ పరిస్థితి ఒక్కసారిగా మారింది.
భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. కానీ.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది.


