‘నీట్’పై కేరళ సీఎం సంచలన ప్రకటన | Kerala Says No Centre Shifts to Online Mode | Sakshi
Sakshi News home page

‘నీట్’పై కేరళ సీఎం సంచలన ప్రకటన

May 16 2026 12:51 PM | Updated on May 16 2026 1:01 PM

Kerala Says No Centre Shifts to Online Mode

తిరువనంతపురం: దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ‘నీట్ యూజీ’ వివాదంపై కేంద్ర ప్రభుత్వం  కీలక ప్రకటనలు చేసింది. పేపర్ లీకేజీలు, రీ నీట్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షా విధానంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో ‘మేము నీట్ పరీక్షను నిర్వహించబోం’ అంటూ కేరళ కాబోయే ముఖ్యమంత్రి విడి సతీశన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, విద్యా వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

‘మాకేం సంబంధం లేదు’
నీట్ యూజీ 2026 పరీక్షల నిర్వహణపై కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కీలక స్పష్టత ఇచ్చారు. నీట్ అనేది కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష అని, దీని నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. తాము ఈ పరీక్షను నిర్వహించబోమని, అయితే ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, కేంద్రానికి తగిన ప్రతిపాదనలు మాత్రం పంపుతామని ఆయన వెల్లడించారు. పరీక్షల్లో పారదర్శకత పెంచాలనే డిమాండ్లు వస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

లీకేజీలపై సీబీఐ విచారణ
మరోవైపు మే 15న జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రీ-నీట్ 2026 వివాదంపై స్పందించారు. పరీక్షల నిర్వహణలో లోపాలు జరిగినట్లు అంగీకరించిన ఆయన, వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంస్కరణలు తెస్తున్నామని హామీ ఇచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్డీఏ)ని రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పేపర్ లీకేజీ ఆరోపణలపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోందని, దోషులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. అలాగే, 2026 పరీక్ష రాయబోయే విద్యార్థులకు పరీక్షా కేంద్రాల ఎంపికకు వారం రోజుల సమయం, ఉచిత అప్లికేషన్ ఫీజు, జూన్ 14 లోగా అడ్మిట్ కార్డుల జారీ వంటి కీలక ఉపశమనాలు ప్రకటించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉన్నప్పటికీ, మధ్యాహ్నం 2 గంటల నుండి జరిగే నీట్ పరీక్షకు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు.

2027 నుంచి కొత్త విధానం.. ఇక అంతా ఆన్‌లైనే
భవిష్యత్తులో లీకేజీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2027 పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) మోడ్‌లో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. డిజిటల్ విధానం ద్వారా పరీక్షల్లో భద్రత, పారదర్శకతను మరింత పెంచవచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ సమూల మార్పులు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ వివాదానికి ఎంతవరకు ముగింపు పలుకుతాయో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement