తెగిన జెయింట్ వీల్.. ఎగిరి కిందపడ్డ జనం! | Giant Swing Collapses at Fair Several Injured | Sakshi
Sakshi News home page

తెగిన జెయింట్ వీల్.. ఎగిరి కిందపడ్డ జనం!

May 16 2026 10:13 AM | Updated on May 16 2026 10:28 AM

Giant Swing Collapses at Fair Several Injured

సాసారం: బీహార్‌లోని సాసారంలో విషాదం చోటుచేసుకుంది. ఉల్లాసంగా గడుపుదామని ఎగ్జిబిషన్‌కు వెళ్లినవారు ఆ క్షణంలో భయంతో వణికిపోయారు. జెయిట్‌ వీల్‌ ఎక్కి, ఆకాశంలో విహరిస్తున్నామన్న ఆనందం  వారిని క్షణాల్లోనే భయానికి గురిచేసింది. సాసారంలో ఏర్పాటు చేసిన డిస్నీల్యాండ్ తరహా ఎగ్జిబిషన్‌లో ఒక భారీ అమ్యూజ్‌మెంట్ రైడ్ (జెయింట్ స్వింగ్) అకస్మాత్తుగా కుప్పకూలడంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మహిళలు, చిన్నారులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.లొ

ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి..
మే 15, శుక్రవారం సాయంత్రం వేళ ఎగ్జిబిషన్ ప్రాంగణం సందర్శకులతో కిటకిటలాడుతోంది. సరిగ్గా అదే సమయంలో వేగంగా తిరుగుతున్న ఒక భారీ జెయింట్ స్వింగ్‌లో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో గిరగిరా తిరుగుతున్న ఆ రైడ్ ఒక్కసారిగా తన ఇరుసు నుంచి విడిపోయి, అదుపుతప్పి కిందకు దూసుకువచ్చి కుప్పకూలింది. దీంతో అందులో కూర్చున్న వారు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడటంతో, ప్రాణభయంతో హాహాకారాలు మిన్నంటాయి.

వెంటనే రంగంలోకి స్థానికులు
కళ్లముందే జరిగిన ఈ ఘోర ప్రమాదంతో ఎగ్జిబిషన్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆర్తనాదాలు, గందరగోళం మధ్య ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, ఎగ్జిబిషన్ నిర్వాహకులు ప్రాణాలకు తెగించి, శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను అత్యవసర బృందాలు రాకముందే బయటకు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఆస్పత్రిలో చికిత్స.. కారణాలపై దర్యాప్తు
గాయపడిన వారందరినీ వెంటనే సాసారం సదర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో పలువురు మహిళలు, పిల్లలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ‘కొంతమందికి ఇప్పటికే ప్రాథమిక చికిత్స అందించాం, మరికొందరిని సీటీ స్కాన్ కోసం పంపాం. మెరుగైన వైద్యం అందిస్తున్నాం’ అని డాక్టర్ మనీష్ కుమార్ వెల్లడించారు. ఎంతమంది గాయపడ్డారనే  సంఖ్య ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ఈ ఘోర ప్రమాదానికి నిర్వహణ లోపమా, లేక సాంకేతిక వైఫల్యమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: మరో ‘బ్లూ డ్రమ్‌’ ఘోరం: భర్తతో కలిసి ప్రియుడిని..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement