- బెంగాల్ రాజకీయాల్లోనూ ‘‘పుష్ప’’ పేరు
- ఇంకా మార్మోగిపోతున్న అల్లు అర్జున్ పాత్ర
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత, “పుష్ప” అని చెప్పుకునే జహంగీర్ ఖాన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి శనివారం హెచ్చరిక చేశారు. “అతడు అత్యంత కిరాతక నేరస్థుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. అతడి వ్యవహారాన్ని నేను స్వయంగా చూసుకుంటా. పుష్ప అని చెప్పుకునే ఆ వ్యక్తి బాధ్యత ఇప్పుడు నాది” అని హెచ్చరించారు.
ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో మే 21న రీపోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఫల్తాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సభలో సువేందు అధికారి మాట్లాడారు.
“మేనల్లుడు (అభిషేక్ బెనర్జీ) రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పదేళ్లుగా ప్రజలు ఓటు వేయలేని పరిస్థితి ఫల్తాలో ఉంది. ఈ రీపోలింగ్‌తో ఓటర్ల హక్కులు మళ్లీ స్థిరపడతాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. ఫల్తా ఓటర్లు బీజేపీ అభ్యర్థిని లక్షకు పైగా మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా” అని సువేందు అధికారి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తృణమూల్ నేత, ఫల్తా అభ్యర్థి జహంగీర్ ఖాన్ తనను తాను “పుష్ప”గా చెప్పుకున్నారు. “పుష్ప” సినిమాలో అల్లు అర్జున్ పోషించిన స్మగ్లర్, శక్తిమంతమైన పాత్రను ఆయన ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ పోలీసు పరిశీలకుడిగా నియమించింది. ఆయనను “సింగం” సినిమా సిరీస్‌లో అజయ్ దేవగన్ పోషించిన పోలీసు అధికారి పాత్రతో పోల్చి, ఖాన్ ‘‘పుప్ప’’ వ్యాఖ్యలు చేశాడు.
కాగా, ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పడింది. రాష్ట్రంలో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు దశల్లోనూ 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కాగా, మొన్న తమిళనాడు అసెంబ్లీలోనూ ‘‘పుష్ప’’ పాత్రను గుర్తు చేస్తూ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.


