కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఒకటైన ఐవీఎఫ్ (ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియను మరింత సమర్థంగా జరిగేలా ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తోడ్పడుతోంది. మునుపు దాదాపు పరిశోధనల్లో లేదా మరికొన్ని అంశాల్లో సహాయకారిగా ఉండే ఏఐ ఇప్పుడు వైద్యరంగంలోని చాలా విషయాల్లో తన సహాయం అందించడం పరిపాటి అయ్యింది. ఐవీఎఫ్ ప్రక్రియకు మరింత చేయూత ఇచ్చేందుకు అవసరమైన పరిజ్ఞానం సమకూర్చుకుంటోంది. ఆ వివరాలేమిటో చూద్దాం...
పిల్లలు లేనివారు ఓ బిడ్డకోసం తాపత్రయపడటం మన సమాజంలో ఉన్నదే. ఇందుకు సహాయపడే కృత్రిమ గర్భధారణ ప్రక్రియల్లో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ఒకటి.
ఐవీఎఫ్ అంటే...
ఐవీఎఫ్ ప్రక్రియలో మొదట మహిళ అండాశయాల నుంచి అండాలను సేకరించి వీర్యకణంతో కృత్రిమంగా ఫలదీకరణం జరిగేలా చూస్తారు. దంపతులు కలిసినప్పుడు ఏదైనా కారణాలతో మహిళలో నేచురల్‌గా ఫలదీకరణం జరగనప్పుడు డాక్టర్లు ఇలా బయటే ఫలదీకరణ జరిగేందుకు సహాయపడుతుండటంతో దీన్ని ‘అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ’ (ఏఆర్‌టీ) అంటారు.
ఫలదీకరణ లోపలే జరగకపోవడానికి కారణాలంటే... మహిళల్లో ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకు΄ోవడం, ఎండోమెట్రియాసిస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) లేదా ఓవరీ తాలూకు సమస్యలుండటం, నిర్దిష్టంగా ఇదీ సమస్య అని తెలియని కారణాలు ఉండటం. అదే పురుషుల విషయంలో వీర్యకణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) తక్కువగా ఉండటం. ఈ సమస్యలున్నప్పుడు ఫలదీకరణ జరిగేందుకు బయటే ఐవీఎఫ్ జరిగేలా చూస్తారు.
ఎలా చేస్తారంటే...
సంక్లిష్టమైన ప్రక్రియ అయి ఐవీఎఫ్‌ను అనేక అంచెల్లో చేయాల్సి ఉంటుంది. మొదట హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి మహిళలో అండాలు పెరిగేలా చూస్తారు. మామూలుగానైతే మహిళలో నెలకు ఒక అండమే పెరుగుతుంది. ఇలా అనేక అండాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వడాన్ని ‘కంటెయిల్‌డ్ ఒవేరియన్ స్టిమ్యులేషన్’ అంటారు.
ఇలా అండాలు పెరిగాక ఒక సూదిలాంటి పరికరంతో ‘ఫాలికిల్’ నుంచి వాటిని బయటకు తెస్తారు. అటు తర్వాత ఆ అండాలను ఓ ఇంక్యుబేటర్‌లోకి ప్రవేశపెడతారు. ఆపైన ఆ అండాల్లోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేస్తారు. ఇలా ఇంజెక్ట్ చేయడాన్ని ‘ఇంట్రా సైటో΄్లాసమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్’ (ఐసీఎస్‌ఐ) అంటారు. ఫలదీకరణం అయిన అండం ఇక ‘పిండం’ (ఎంబ్రియో)గా మారుతుంది.
బయట కృత్రిమంగా ఫెర్టిలైజ్ చేశాక... ఇక ఆ పిండాన్ని (ఎంబ్రియోను) గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) ద్వారా గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియను ‘ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్’ అంటారు. తాజా పిండాన్ని మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెట్టడాన్ని ‘ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎంబ్రియో’ అంటారు.
కొన్ని సందర్భాల్లో నిల్వ చేసిన ఎంబ్రియోలను మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెడితే దాన్ని ‘ఫ్రోజెన్ ట్రాన్స్‌ఫర్’ అని అంటారు. ఇలా మహిళలోకి ప్రవేశపెట్టిన పిండాన్ని గర్భసంచి ఆమోదించి, తనలో నేచురల్‌గా పెరిగేందుకు అనుమతిస్తే ఇక ఆ ప్రెగ్నెన్సీ మామూలు గర్భవతిలోలాగే పెరుగుతుంది. ఐవీఎఫ్‌లో జరిగేది ఇదే.
ఏఐ సహాయం ఎక్కడెక్కడ...
ఇప్పుడు ఐవీఎఫ్‌లోని అనేక దశల్లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) సహాయం చేస్తోంది. అదెలాగంటే... ∙హార్మోన్ ఇంజెక్షన్స్ ఏవేవి ఎంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయించడం కృత్రిమంగా పెరిగిన అనేక అండాలలో నాణ్యమైన వాటి ఎంపిక పార్టనర్ వీర్యకణాల్లోనూ నాణ్యమైన వాటి ఎంపిక
టైమ్–లాప్స్ ఎంబ్రియో ఇమేజింగ్ సిస్టమ్స్... అంటే ఇందులో పిండం (ఎంబ్రియో) డిస్టర్బ్ కాకుండా ఉండేలా చూస్తూ... కొన్ని అడ్వాన్స్‌డ్ కెమెరాల సహాయంతో... ఆ ప్రక్రియ ఎలాంటి అంతరాయాలూ లేకుండా జరుగుతోందా లేదా అనే అంశాన్ని పరిశీలించడం. ఈ డేటా సహాయంతో నాణ్యమైన ఎంబ్రియోను సూచించడం.
భవిష్యత్తులో మరింత పురోగతి...
ఏఐ పరిజ్ఞానాన్ని మరిన్ని అంశాల్లో మరింత లోతుగా ఉపయోగించుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యనిపుణులు భావిస్తున్నారు. వాటిలో కొన్ని... ∙గర్భధారణ ఏ మేరకు విజయవంతం కాగలదనే అంశాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ∙ల్యాబ్‌లలో జరిగే ప్రక్రియలు మరింత తేలిగ్గా / సులువుగా జరిగేందుకు తగిన సాంకేతికతను అభివృధ్ధి చేసుకోవడం (ఎంబ్రియాలజీ ల్యాబ్ ఆటోమేషన్)
మహిళ దేహంలో జరుగుతున్న హార్మోనల్ మార్పులను పరిశీలించడం (డిజిటల్ పేషెంట్ మానిటరింగ్) ∙రోబోటిక్స్ సహాయంతో ప్రక్రియలు మరింత సునిశితంగా / ఖచ్చితత్వంతో జరిగేలా చూడటం ∙తనకు డాక్టర్ ఇచ్చిన సూచనలను మహిళ ఖచ్చితంగా పాటిస్తోందా లేదా అన్నది పరిశీలించడం (రియల్ టైమ్ అప్‌డేట్) ∙అండాలు/పిండాల నిల్వలో (క్రయోప్రిజర్వేషన్)లో గణనీయమైన మెరుగుదల.
ఏఐ సహాయంతో ఇవీ ప్రయోజనాలు...
మెరుగైన గర్భధారణ ఫలితాలు: నాణ్యమైన ఎంబ్రియో ఎంపికతో గర్భధారణకు మెరుగైన అవకాశాలు
ప్రమాదాలు / ముప్పులు తగ్గడం : దేహానికి కోత / గాటు పెద్దగా లేకపోవడంతో (అతి తక్కువ ఇన్వేసివ్ పద్ధతుల వల్ల) తక్కువ నొప్పి, తక్కువ ముప్పు (రిస్క్)
సునిశితత్వం / ఖచ్చితత్వం: ల్యాబ్ ప్రక్రియలన్నీ సమర్థంగా జరిగేలా చూడటం ద్వారా మానవ తప్పిదాలను తగ్గించడం.
చివరగా... ఐవీఎఫ్ అన్నది ఇప్పటికీ కొంత ఖరీదైన ప్రక్రియే. ఈ ప్రక్రియలో వేగాన్నీ, సునిశితత్వాన్ని, ఖచ్చితత్త్వాన్ని పెంచడం ద్వారా ఫలదీకరణ అవకాశాలు మరింత మెరుగుపరచడం, తద్వారా ఖర్చులు తగ్గించడం సాధ్యమవుతుంది. ఇలా ఏఐ సహాయంతో భవిష్యత్తులో ఐవీఎఫ్ మరింత ఫలవంతంగా రూపొందే అవకాశముంది.
నిర్వహణ : యాసీన్
(చదవండి: ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?)


