ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్‌వాదీ ర్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న భార్య కుమారుడు ప్రతీక్ యాదవ్ ఓ ఫిట్‌నెస్ ఫ్రీక్. నిత్యం జిమ్ చేస్తూ ఉండటంతోపాటు లక్నోలో అనేక హై ఎండ్ వ్యాయామశాలలను ప్రారంభించాడు. కండలు తిరిగి, కమ్మెచ్చులు తేలి అత్యంత ఫిట్‌గా ఉండే తన దేహంతో రాష్ట్రవ్యాప్తంగా జిమ్ కల్చర్ ప్రమోషన్‌కు కారణమయ్యాడు. ఈనెల 13న ప్రతీక్ యాదవ్ ఆకస్మికంగా మృతి చెందడం చాలామందిని విషాదంతో పాటు ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరణించే నాటికి అతడి వయసు కేవలం 38 ఏళ్లు మాత్రమే. అటాప్సీ రిపోర్టులో అతడి దేహ స్వభావంలో రక్తపు ఉండలు ఏర్పడే స్వభావం ఉందనీ... దాంతో ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అనే ఆరోగ్య సమస్య కారణంగా పల్మునరీ ఎంబాలిజమ్ అనే కండిషన్ ఏర్పడి... అది అతడికి మరణం సంభవించిందనే నివేదిక వచ్చింది.
డీవీటీ అంటే... దేహంలోని రక్తనాళాల్లో... ప్రధానంగా చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరల్లో రక్తం గడ్డకట్టడాన్ని ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ (డీవీటీ)గా చెబుతారు. డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది చాలా ప్రమాదకమైన పరిస్థితి. దేహంలోని రక్తనాళాలన్నింటిలోనూ ఇది కనిపించే అవకాశం ఉన్నప్పటికీ కాలి సిరల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి 20 మందిలో ఒకరికి... తమ జీవితకాలంలో డీప్ వీన్ థ్రాంబోసిస్ బాధపెడుతుంది.
పల్మునరీ థ్రాంబో ఎంబోలిజమ్‌లో ఏం జరుగుతుందంటే...
రక్తనాళంలో ఏర్పడ్డ గడ్డ (క్లాట్) లేదా రక్తపు ఉండ... కొన్నిసార్లు అలా రక్తప్రవాహంలో కొట్టుకుపోతూ... పంపింగ్ కోసం గుండెలోని కుడి భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి ఆక్సిజన్‌ను నింపుకోడానికి పల్మునరీ ఆర్టరీ ద్వారా ఊపిరితిత్తులకు రక్తం వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో పల్మునరీ ఆర్టరీలో రక్తపు ఉండ ఇరుక్కుపోవడం జరిగితే... బ్లడ్ సర్క్యులేషన్ ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. దీన్ని పల్మునరీ ఎంబోలిజమ్ అంటారు. ఇలా జరగడం వల్ల కొన్నిసార్లు తక్షణం మరణం కూడా సంభవించవచ్చు.
డీవీటీ లక్షణాలు... డీప్ వీన్ థ్రాంబోసిస్‌తో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రతి ఒక్కరిలోనూ అవే లక్షణాలు కనిపించక΄ోవచ్చు. పైగా లక్షణాల తీవ్రతలోనూ (మరీ ముఖ్యంగా డీవీటీ తొలి దశల్లో) మార్పులుంటాయి. రక్తపుగడ్డ చాలా చిన్నదిగా ఉంటే కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించక΄ోవచ్చు. కొందరిలో సమస్య దానంతట అదే సమసి΄ోవచ్చు కూడా. అయితే కొందరిలో కనిపించే లక్షణాలివి...
రక్తం గడ్డ కట్టిన చోట చర్మం వాపు (ముఖ్యంగా కాలు, పాదం వంటివి)
చర్మం ఎర్రబారడం, అక్కడ వేడిగా ఉన్నట్లు అనిపించడం
ఒక్కోసారి చర్మంలోంచి రక్తనాళాలు కనిపించడం
డీవీటీ కాల్లో ఏర్పడినప్పుడు కాలు బలహీనంగా ఉన్నట్లు అనిపించడం
రక్తనాళాలు గట్టిబారడం
నివారణ:
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. అంటే మంచి సమతులాహారం తీసుకోవడం అంటే పొట్టుతీయని కాయధాన్యాలూ (హోల్‌గ్రెయిన్స్), ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లు తీసుకుంటూ బరువు పెరగకుండా చూసుకోవడం.
క్రమ తప్పకుండా వ్యాయామం చేయడం. (రోజుకు కనీసం 30 – 45 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల రక్తప్రవాహం సాఫీగా మారి రక్తపు గడ్డలు ఏర్పడటం తగ్గుతుంది).
తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ దేహాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం. దీంతో రక్తం పలుచబారి ఉండలు అడ్డుపడకుండా సాఫీగా సాగి΄ోయే అవకాశాలు ఎక్కువ.
ఒకేచోట కుదురుగా కూర్చుని ఉండకుండా, చురుగ్గా కదులుతుండటం. ఇలా కదులుతున్నప్పుడు కాసేపు నడక, స్ట్రెచ్చింగ్ వంటివి చేస్తూ ఉండటం.
దూరప్రయాణాలు చేస్తున్నప్పుడు అదేపనిగా వాహనంలో కూర్చుని ఉండకుండా తరచూ బ్రేక్ తీసుకుంటూ ఉండటం. ∙రక్తనాళాల్లో రక్తప్రవాహం సాఫీగా సాగేందుకు కంప్రెషన్ స్టాకింగ్ వంటివి వాడటం.
చికిత్స :
డీప్ వీన్ థ్రాంబోసిస్ చికిత్సలో... దాంతో పాటు నివారణ చర్యలూ తప్పనిసరి. ఈ చికిత్స తీవ్రతను బట్టి ఉంటుంది.
డీవీటీ వచ్చే అవకాశాలున్నవారు తొలిదశల్లో సపోర్ట్ స్టాకింగ్స్ / కంప్రెషన్ స్టాకింగ్స్ వాడటం.
బ్లడ్ థిన్నర్స్ వాడటం : యాంటీ కోయాగ్యులెంట్స్ అని పిలిచే రక్తాన్ని పలచబార్చే మందులు వాడటం.
క్లాట్ బస్టర్స్ / థ్రాంబోలైటిక్స్ చికిత్స : చిన్న పైప్ (క్యాథెటర్) ద్వారా రక్తం గడ్డకట్టిన చోటికి థ్రాంబోలైటిక్స్ అని పిలిచే మందును పంపి, రక్తపుగడ్డను చెదరగొట్టే ఈ ఔషధాల్ని వాడటం.
ఇప్పుడు తాజాగా సక్షన్ ను ఉపయోగించి రక్తపు గడ్డను బయటకు లాగేసి, రక్తపు ఉండను తొలగించడం ద్వారా కూడా చికిత్స అందిస్తున్నారు.
ఈ డీవీటీ ముప్పు ఉన్నప్పుడు రక్తపు ఉండలు ఏర్పడే స్వభావం ఉన్నవారు నిరంతరం డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ వైద్యులు చెప్పిన విధంగా ఫాలో అప్‌లో ఉండటం చాలా ముఖ్యం.
– యాసీన్
(చదవండి: ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! అక్కడికి వెళ్లాల్సిందే)


