ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! | Ikarian People And Lifestyle Live So Long | Sakshi
Sakshi News home page

ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! అక్కడికి వెళ్లాల్సిందే

May 14 2026 10:30 AM | Updated on May 14 2026 12:04 PM

Ikarian People And Lifestyle Live So Long

ఒత్తిడి లేకుండా హాయిగా వందేళ్లు బతికేయాలని అందరికీ ఉంటుంది. అలాంటి జీవితం పొందాలంటే కోటీశ్వరుడే కానక్కర్లేదు. ఉరుకులు పరుగులతో రోజును గడపనక్కర్లేదు. చేయాల్సిందల్లా ప్రకృతితో, కుటుంబంతో, సంఘంతో సన్నిహితంగా గడపడమే. ఇది ఇంత సులువా అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ అలా బతకడాన్ని క్రమంగా అలవాటు చేసుకుంటే ఎవరైనా సరే దాన్నో జీవన విధానంగా మార్చుకోవచ్చు. దాన్ని నిరూపించి చూపిస్తున్నారు ఇకారియా ద్వీప ప్రజలు. అదెలాగో చూద్దాం.

గ్రీస్‌లోని ఇకారియా ద్వీపం ప్రపంచంలోని ఐదు ’బ్లూ జోన్లలో ఒకటి. అక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరు 90 ఏళ్లకుపైగా జీవిస్తారు. వారి సుదీర్ఘ ఆయుష్షు వెనకున్న రహస్యం కేవలం వారు తినే ఆహారం మాత్రమే కాదు.. వారి విలక్షణమైన జీవనశైలి. వారి మంత్రం ‘నిదానమే ప్రధానం’.

నిదానమైన జీవనశైలి
ఇకారియా ప్రజలకు ‘సమయం’  విషయంలో అస్సలు టెన్షన్‌ ఉండదు. వారు ఉదయం అలారం పెట్టుకొని పరుగు పరుగున లేవరు. నిద్ర లేవగానే నిదానంగా కాఫీ తాగుతూ కుటుంబంతో గడుపుతారు. అక్కడ వ్యాపారస్తులు కూడా తమ ఇష్టానుసారం షాపులు తెరుస్తారు. కస్టమర్లు కూడా గంటల తరబడి వేచి ఉండటానికి ఇబ్బంది పడరు. 

ఈ ధోరణి వల్ల వారిలో గుండె జబ్బులకు ప్రధాన కారణమైన ‘కార్టిసాల్‌’ (ఒత్తిడి హార్మోన్‌) చాలా తక్కువగాఉంటోందని తేలింది.మధ్యాహ్న నిద్ర ఇకారియాలోమధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం ఒక  అలవాటు. ప్రతిరోజూ మధ్యాహ్నంకనీసం 30 నిమిషాలనిద్ర వల్ల గుండె జబ్బుల ప్రమాదం 37% తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వారిని రోజంతా ఉల్లాసంగా ఉంచుతోంది.

ఆహార రహస్యాలు
ఇకారియావాసులు తినే ఆహారం పూర్తిగా ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆలివ్‌ ఆయిల్‌ ఎక్కువగా తీసుకుంటారు. వారు ప్రతిరోజూ రోజ్‌మేరీ, సేజ్, పుదీనాతో చేసిన టీ తాగుతారు. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి రక్తపోటును తగ్గిస్తాయి. రెడ్‌ మీట్‌ చాలా అరుదుగా తీసుకుంటారు. చక్కెర వాడకం
చాలా తక్కువ.

శారీరక శ్రమ 
ఇకారియా ప్రజలు జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తరు. కానీ రోజంతా కదులుతూనే ఉంటారు. ఇకారియా ద్వీపం కొండ ప్రాంతం కాబట్టి పక్కింటికి వెళ్లాలన్నా మెట్లు ఎక్కాలి. తోట పని చేయడం, నడవడం వారి దైనందిన జీవితంలో భాగం. ఈ సహజమైన శ్రమ వారిని 90 ఏళ్లలో కూడా దృఢంగా ఉంచుతోంది.

సామాజిక అనుబంధాలు 
ఇకారియాలో ఎవరూ ఒంటరిగా ఉండరు. సాయంత్రం వేళల్లో స్నేహితులు, బంధువులతో కలిసి నవ్వుతూ చిన్నచిన్న పార్టీలు చేసుకుంటూ గడుపుతారు. వారిలో ఒంటరితనం అనే మాటే వినిపించదు. ఈ సామాజిక మద్దతు మానసిక ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతోంది.

మరి మనం ఏం చేద్దాం?
హడావుడి పడకుండా నిదానంగా పనులు చేయడం, ఆస్వాదిస్తూ పనుల్లో మునిగిపోవడం, ప్రకృతితో గడపడం, అవకాశం దొరికినప్పుడు తోటపని లేదాచిన్ననడక అలవాటు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే సహజ సిద్ధమైనఆహారం, పానీయాలు తీసుకోవడం, మధ్యాహ్నం చిన్న కునుకు తీయడం, కాసేపు డిజిటల్‌ ప్రపంచానికి దూరంగా ఉండి, కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడటం, స్నేహితులను పెంచుకొని వారితో కొన్ని గంటలు సరదాగా గడపడం చేస్తే చాలు..మనమూ దీర్ఘాయుష్షుతో జీవించగలం. 

సాక్షి స్పెషల్‌ డెస్క్‌

(చదవండి: రెండు వారాల పాటు గ్రీన్ టీ తాగితే ఏం జరుగుతుందంటే..)
 

Advertisement
 
Advertisement
Advertisement