అపురూపమైన అడవి మామిడి | Sagubadi: Wild Mango Herb Uses Benefits Cures Side Effects | Sakshi
Sakshi News home page

అపురూపమైన అడవి మామిడి పండ్ల జాతులు

May 15 2026 2:47 PM | Updated on May 15 2026 3:56 PM

Sagubadi: Wild Mango Herb Uses Benefits Cures Side Effects

వాడుక భాషలో అడవి మామిడి పండును తెలుగులో కొండ మామిడి, టౌర మామిడి, ఆద్వము అని కూడా పిలుస్తారు. అస్సామీలో ఆమ్రత అని, ఇంగ్లీష్‌లో ఇండియన్‌ హాగ్‌ ప్లం, వైల్డ్‌ మ్యాంగో అని, ఒరియాలో అంబడు, అంబ అని, కన్నడలో కడంబట్టే, అంబట్టేమర, పూండి, డి. గుడ్ల మాటే, ఆమెటి, గాయగిడ, గొడడకాయ, మరాహున్నె, కొడలిమావు అని, గుజరాతిలో అంబాడ అని, తమిళంలో అంబాళం, కింకం, పలుచకయి అని, బెంగాలీలో ఆమ్ర, ఆమడ, అంబడ అని, మరాఠీలో అమడ, అంబడ అని, మలయాళంలో అంపఝం అని, హిందీలో అంబారి, అమర, అంబర అని, సంస్కృతంలో ఆమ్రత, ఆమ్రతక, మెతుల అని పిలుస్తారు.

పూత కాలం ఫిబ్రవరి – మార్చి. పండ్ల కాలం: జూన్‌–జులై.
అడవి మామిడి చెట్టు మాను గట్టిగా ఉండి, బెరడుపై బూడిద పూసినట్లు ఉంటుంది. మానుకు దెబ్బ తగిలినప్పుడు జిగురు వస్తుంది. ఈ చెట్టు కూడా ఔషధగుణాలు కలిగి ఉంటుంది. ఈ చెట్లకు పూత ఫిబ్రవరి–మార్చి నెలల్లో వస్తుంది. కాలం అనుకూలిస్తే జనవరిలో కూడా పూత మొదలవుతుంది. పండ్లు మాత్రం జూన్‌–జులై మాసాలలో వస్తాయి. కానీ, ఈ ప్రక్రియ ప్రాంతాలను బట్టి పూత–కాతలో మార్పులు ఉండవచ్చు.

ఉనికి
కొండ మామిడి ఎక్కువగా కొండల్లో కోనల్లో ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 1200 మీటర్ల (3,900 అడుగులు) ఎత్తు వరకు గల ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇది సతత హరితం. కానీ కొన్ని సందర్భాల్లో ఆకులు రాల్చుతుంది. వీటి జీనస్‌లో 17 జాతులు ఉన్నాయి.

అడవి మామిడి స్వస్థలం
భారత్, శ్రీలంక, ఆగ్నేయాసియా, మయన్మార్, నేపాల్‌ దేశాలు. ఇండియాలో ఎక్కువగా ఉన్న ప్రాంతాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళ, వెస్ట్‌ బెంగాల్, అండమాన్, నికోబార్‌ దీవులు. అస్సాం, హిమాలయ దిగువ శ్రేణులు మొదలగు ప్రాంతాల్లో కూడా పెరుగుతాయి. 

ఈ చెట్లు దాదాపు 25 మీటర్ల ఎత్తువరకు పెరుగగలవు. అలాగే అన్ని ప్రాంతాలలో వీటి పండ్ల వినియోగం ఉన్నది. వీటిపైన పరిశోధనలు ఉన్నప్పటికీ, రైతుల చెంతకు చేరిన దాఖలాలు చాలా తక్కువే. వీటిపైన నిరంతర పరిశోధన జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చెట్లు నల్లమల అడవుల్లో వంకల వెంబడి, సెలయేర్ల వెంబడి అధికంగా ఉన్నాయి.

ఉపయోగాలెన్నో...

అడవి మామిడి చెట్టు ఎన్నో ఉపయోగాలతో కూడుకున్నది. 

కలప నిర్మాణ రంగంలో తాత్కాలిక పనులకు ఎంతగానో ఉపయోగపడుతాయి (సెంట్రింగ్‌ చెక్క, నగిషీలు చేయటానికి, బొమ్మల తయారీ మొదలైనవి)

ఇది ప్లైఉడ్‌ తయారీలో ముఖ్యమైన వస్తువు. 

అగ్గిపెట్టెలు, పుల్లల తయారీకి వాడుతారు. 

క్రేట్స్, బాక్స్‌ల తయారీలో ఉపయోగిస్తారు.

ఆకులను మేకలు, పశువులు తింటాయి.

కొమ్మలు వంట చెరకుగా ఉపయోగపడతాయి.
పండ్లను పిల్లలు ఇష్టంగా తింటారు. పులుపు–తీపి కలబోసినట్లు ఉంటాయి.

వీటి కాయలను ఊరగాయ పచ్చడి పెట్టడానికి ఉపయోగిస్తారు. అట్లే పండ్ల నుండి జామ్‌ కూడా తయారు చేస్తారు.

కాయలను చెక్కు తీసి ఒరుగు చేసుకోవచ్చు. ఆ ఒరుగును పప్పు, ఇతర కూరల్లో వేసుకుంటే పులుపుతో కూడిన రుచి వస్తుంది.

గిరిజనులు అడవి మామిడి ఒరుగు చేసుకుంటారు. వీటిని వానాకాలం, చలికాలాల్లో పప్పుకూరలు, ఇతర కాయకూరలలో వాడుతారు.

వీటి లేత ఆకులు, పూత, పండ్లు, వేర్లు, బెరుడును గిరిజనులు నాటు వైద్యంలో వాడుతారు. అట్లే ఆయుర్వేదంలో కూడా వినియోగిస్తున్నారు.

వీటి పండ్లు, వేర్లు ఎక్కువ దప్పికను నివారించడానికి వాడతారు. వీటి బెరుడు విరేచనాలను అరికట్టడానికి ఉపయోగిస్తారు. బహిష్టు క్రమబద్ధం చేయటానికి వేర్లను ఉపయోగిస్తారు. వేర్లను రుబ్బగా వచ్చిన గుజ్జును నీళ్ళల్లో కలుపుకొని తాగితే మధుమేహ సమస్య అదుపు అవుతుంది.

అడవిమామిడి ఉపయోగాలు అనేకం ఉన్నాయి. క్యాన్సర్‌ కారకాలను, మైక్రోబియల్‌ చర్యలను అదుపు చేయగల శక్తి ఈ పండ్లకు ఉంది.  

పండ్ల గుజ్జు కీళ్లనొప్పిని తగ్గిస్తుంది.

పోషక విలువలు (100 గ్రా. అడవి మామిడి పండ్ల గుజ్జులో)
పోషకాలు        విలువ

ప్రోటీన్లు           0.7%
కొవ్వు             3.0%
పీచు పదార్థం    1.0%
పిండి పదార్ధాలు    4.5%
ఖనిజాలు           0.5%
కాల్షియం          36.0 మి.గ్రా.
భాస్వరం         11.02 మి.గ్రా.
ఇనుము         3.9 2 మి.గ్రా.
థయామిన్‌      0.02 మి.గ్రా.
రిబోఫ్లేవిన్‌       0.02 మి.గ్రా.
నికోటిన్‌ ఆసిడ్‌    0.3 మి.గ్రా.
విటమిన్‌ సి       21.0 మి.గ్రా.
విటమిన్‌ ఎ      450 మైక్రో గ్రాములు
–––––––––––––––––––––––––––––––––––
( ౌuటఛ్ఛి: ఈౖఐ:10.130.40/్ఖ్క ఖ.0975–8232.5(4).1138–45)

అడవి మామిడిపై పరిశోధనలు ఎంతైనా అవసరం.  వీటి ఉనికిని, సాంద్రతను పెంచగలిగితే వాతావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. అడవి మామిడి సతత హరితం, కాబట్టి ఆకులు రాల్చే చెట్ల కన్నా అధికంగా ఆక్సిజన్‌ విడుదల చేస్తుంది.  

అపురూపమైన అడవి పండ జాతులు
మన దేశంలోని అడవుల్లో వందల కొలదీ మనుషులు తినదగిన, పోషకాలతో కూడిన అనేక జాతులు పండ్ల చెట్లు, మొక్కలు ఉన్నాయి. వీటిలో అతి ముఖ్యమైన  కొన్ని పండ్ల జాతులను ఎంచుకొని పరిశోధనలను ముమ్మరం చెయ్య గలిగితే ఆ పండ్ల చెట్లను కూడా భవిష్యత్తులో రైతుల తోటల్లోకి, పెరటి తోటల్లోకి ఈ అరుదైన అడవి పండ్ల జాతులను ప్రవేశపెట్టవచ్చు అంటున్నారు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధంగా రాజేంద్రనగర్‌లో ఉన్న భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా కొన్నేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య అంటున్నారు. ఆయన తన బాల్యంలో అడవుల్లో తిరుగుతూ రుచి చూసిన 65 రకాల అడవి పండ్ల జాతులపై లోతైన పరిశోధన చేసి, ‘ఆదరణ కరవైన అడవి పండ్లు– పోషక, ఔషధ నిధులు’ పేరుతో చక్కటి పుస్తకాన్ని వెలువరించారు. 

ఈ అపురూపమైన అడవి పండ్ల జాతులను పరిరక్షించుకోవటంతో పాటు ఈ మొక్కలను రైతులకు అందుబాటులోకి తేవటం ద్వారా ప్రజల ఆహారంలో పౌష్టికాహార స్థాయిని, వైవిధ్యాన్ని పెంపొందించవచ్చని, పర్యావరణంలోనూ జీవవైవిధ్యాన్ని పెంపొందించవచ్చని డాక్టర్‌ పద్మయ్య అంటున్నారు. ‘సాగుబడి ప్లస్‌’ పేజీలో ప్రతి శుక్రవారం ఒక్కో అడవి పండ్ల జాతి గురించి ఆయన అందిస్తున్న సమగ్ర సమాచారాన్ని ధారావాహికగా ప్రచురించడానికి సమ్మతించినందుకు డా. పద్మయ్యకు ధన్యవాదాలు. ఈ సమాచారం పాఠకులకు ఎంతో ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం.

– డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, 
ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌.
మొబైల్‌: 94407 08924 

– ఎడిటర్, సాక్షి 

(చదవండి: పాలలో ఆ నేల రుచి ఉంటుంది!)

Advertisement
 
Advertisement
Advertisement