న్యూఢిల్లీ: అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా నెట్‌వర్క్‌పై భారత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సర్జికల్ స్ట్రైక్ చేసింది. ‘ఆపరేషన్ రేజ్‌పిల్’ పేరుతో జరిపిన అత్యంత రహస్య ఆపరేషన్‌లో అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ. 182 కోట్ల విలువైన 228 కిలోల ‘క్యాప్టగాన్’ అనే ప్రమాదకరమైన డ్రగ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదులు, సాయుధ దళాలు ఎక్కువగా వాడటం వల్ల దీనిని ‘జిహాదీ డ్రగ్’ అని పిలుస్తారు. భారతదేశంలో ఈ రకమైన నిషేధిత డ్రగ్‌ను పట్టుకోవడం ఇదే తొలిసారి. సిరియా కేంద్రంగా నడుస్తున్న ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా, గల్ఫ్ దేశాలకు డ్రగ్స్ సరఫరా చేయడానికి ఇండియానూ ఒక ట్రాన్సిట్ హబ్‌గా వాడుకుంటోందని ఈ ఆపరేషన్ కారణంగా వెల్లడయ్యింది.
ఢిల్లీ టూ గుజరాత్: ఎన్‌సీబీ మెరుపు దాడులు
విదేశీ నిఘా సంస్థ ఇచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్‌సీబీ అధికారులు మే 11న ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలోని ఒక ఇంటిపై దాడి చేశారు. అక్కడ సౌదీ అరేబియాకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంచిన ఒక చపాతీ కటింగ్ మెషీన్‌లో దాచిన 31.5 కిలోల క్యాప్టగాన్ మాత్రలను గుర్తించారు. టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చి అక్రమంగా నివసిస్తున్న ఒక సిరియా పౌరుడిని అధికారులు అరెస్ట్ చేశారు. ఆ నిందితుడిని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. వెంటనే అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకుని, సిరియా నుండి దిగుమతి చేసుకున్న గొర్రెల ఉన్ని కంటైనర్‌లో దాచిన మరో 196.2 కిలోల క్యాప్టగాన్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అధిక సమయం మేల్కొనేందుకు ‘జిహాదీ డ్రగ్’
పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) లోని ఘర్షణ ప్రాంతాలలో ఈ క్యాప్టగాన్ టాబ్లెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఉగ్రవాదులు, తీవ్రవాద ముఠాలు రణరంగంలో అలసట లేకుండా పోరాడటానికి, ఎక్కువ సమయం మేల్కొని ఉండటానికి, భయాన్ని మర్చిపోయి తెగింపుతో వ్యవహరించడానికి ఈ యాంఫెటమైన్ రకానికి చెందిన స్టిమ్యులెంట్‌ను ఎక్కువగా వాడుతుంటారు. అందుకే దీనికి 'జిహాదీ డ్రగ్' అనే పేరు వచ్చింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో, ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఈ డ్రగ్స్ వినియోగం పెరగడం అక్కడి ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. వాణిజ్య కార్గో మార్గాలను వాడుకుంటూ అంతర్జాతీయ కార్టెల్స్ ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి.
నార్కో టెర్రరిజంపై అమిత్ షా హెచ్చరిక
ఈ అద్భుతమైన విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి డ్రగ్స్ రవాణాపై ఉన్న ‘జీరో-టాలరెన్స్’ విధానానికి ఈ ఘనతే నిదర్శనమన్నారు. ఆపరేషన్ రేజ్‌పిల్ ద్వారా మన ఏజెన్సీలు రూ. 182 కోట్ల విలువైన ‘జిహాదీ డ్రగ్’ క్యాప్టగాన్‌ను తొలిసారిగా పట్టుకోవడం సంతోషకరం’ అని ఆయన పేర్కొన్నారు. భారతదేశాన్ని డ్రగ్స్ కారిడార్‌గా మార్చాలని చూసే అంతర్జాతీయ ముఠాల ఆట కట్టిస్తామని, మన దేశ సరిహద్దుల్లోకి వచ్చే ప్రతి గ్రాము డ్రగ్‌ను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఈ కేసులో హవాలా నెట్‌వర్క్, ఆర్థిక లావాదేవీలపై ఎన్‌సీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: ‘భోజ్‌శాల’ తీర్పుతో షాక్..అవి మందిరాలా? మసీదులా?


