హైదరాబాదీలకు వంటగ్యాస్ షాక్
వాణిజ్య సిలిండర్ ధర 50 శాతం పెంపు ప్రభావం
రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో పెరిగిన రేట్లు
ఆహారం ధరల్లో 20 నుంచి 40 శాతం వరకు పెరుగుదల
రోజుకు సగటున రూ.40 నుంచి రూ.60 వరకు అదనపు ఖర్చు
మొత్తంగా రోజుకు రూ.20 కోట్లకు పైనే అదనపు భారం
హైదరాబాద్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ మొదలు అన్నిరకాల ఆహార పదార్థాలపై గ్యాస్ ధర పెంపు ప్రభావం పడింది. మొన్నటి వరకు రూ.220 నుంచి రూ.300 వరకు ఉన్న ప్లేట్ చికెన్, మటన్ బిర్యానీ ధర ఇప్పుడు రూ.270 నుంచి రూ.380కి చేరింది. పాతబస్తీలోని ఒక ప్రముఖ హోటల్‌లో మటన్ బిర్యానీ ప్లేట్ రూ.320 నుంచి ప్రస్తుతం రూ.360కి పెరిగింది. గచ్చిబౌలిలోని ఒక హోటల్లో మొన్నటివరకు రూ.340 ఉండగా రూ.380కు, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో రూ. 320 నుంచి 360 పెరిగింది. ఇక నగర ప్రజలు ఇష్టంగా తాగే ఇరానీ చాయ్ రూ.12 నుంచి రూ.20కి ఎగబాకింది.
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం గ్యాస్ దిగుమతులపై ప్రభావం చూపించడం, వాణిజ్య సిలిండర్ ధర గణనీయంగా పెరగడంతో ఫుడ్ ఇండస్ట్రీపై పిడుగు పడినట్టయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో టీ స్టాళ్లు మొదలుకుని కర్రీ పాయింట్లు, టిఫిన్ బండ్లు, చిన్న హోటళ్లు, స్టార్ హోటళ్ల వరకు అన్నిట్లోనూ ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ఎక్కడ చూసినా ‘ధరలు పెంచాం – సహకరించండి’అనే బోర్డులు కనిపిస్తున్నాయి. టీ నుంచి బిర్యానీ వరకు అన్నింటిపైనా సగటున 20% నుంచి 40% వరకు అదనంగా ధరలు పెరిగాయి. నగరంలోని ప్రతి నలుగురిలో ఒకరు బయటి ఆహారంపైనే ఆధారపడుతున్నారనే అంచనాల నేపథ్యంలో పెరిగిన ధరలు వారికి భారంగా మారాయి.
30 శాతం జనానికి హోటలే దిక్కు!
నగర జనాభా 1.55 కోట్లు దాటింది. అందులో సుమారు 30 శాతం అంటే సుమారు 46.50 లక్షల మంది నిత్యం బయటి ఆహారంపైనే ఆధారపడి ఉంటారన్నది అంచనా. కాగా తాజా గ్యాస్ ధర ప్రభావంతో ఆహార ప్రియులపై రోజుకు సగటున రూ.40 నుంచి రూ.60 అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నగరంపై రోజుకు సగటున రూ.20 కోట్ల వరకు అదనపు భారం పడుతుండగా, నెలకు రూ.600 కోట్లు దాటిపోతోంది. ఇంట్లో వంట సదుపాయం ఉన్నప్పటికీ టీ, టిఫిన్లు, భోజనాల కోసం 20.25 లక్షల మంది హోటళ్లకు వెళుతుంటారని అంచనా. మిగిలిన 26.25 లక్షల మంది విద్య, శిక్షణ, ఉపాధి, వైద్యం, ఇతరత్రా పనుల కోసం నగరానికి వచ్చి హాస్టళ్లు, అద్దె రూమ్‌లు, లాడ్జీల్లో ఉంటూ అనివార్యంగా బయటి భోజనంపైనే ఆధారపడుతుంటారు. నలుగురితో కూడిన ఒక కుటుంబం హోటల్‌కు వెళ్లి భోజనం చేసి రావాలంటే రూ. 500 నుంచి రూ.1,000 వరకు అదనంగా బిల్లు అవుతున్నట్టు తెలుస్తోంది.
కడుపు నింపని భోజనం!
నగరంలోని అమీర్‌పేట్, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు ఐటీ ఉద్యోగులు నూటికి నూరు శాతం మెస్‌లు, కర్రీ పాయింట్లపైనే ఆధారపడుతుంటారు. ప్రస్తుతం వీరి నెలవారీ మెస్ చార్జీలు కూడా పెరిగాయి. గ్యాస్ ధర పెంపుతో అమాంతం ధరలు పెంచిన మెస్‌లు.. మెనూ మాత్రం తగ్గించేశాయి. పప్పులో పప్పు ఉండటం లేదని, చారులో రుచి కరువయ్యిందని, పరిమాణం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హోటళ్లలో కూడా మొన్నటివరకు ఇద్దరికి సరిపోయే ’ఫుల్ బిర్యానీ’ఇప్పుడు ఒకరికి కొంచెం ఎక్కువ, ఇద్దరికి తక్కువ అన్నట్లుగా మారిపోయిందని అంటున్నారు.
కర్రీ..వర్రీ
నగరంలో కర్రీ పాయింట్లకు యమ గిరాకీ అన్న సంగతి తెలిసిందే. కీలక ప్రాంతాల్లో గల్లీకో కర్రీ పాయింట్ ఉంటోంది. ప్రస్తుతం నాన్ వెజ్, వెజ్..అన్నిరకాల కూరల ధరలూ పెరిగాయి. ప్రతి కర్రీపై రూ.10 నుంచి రూ. 20 వరకు పెరుగుదల చోటు చేసుకుంది. కర్రీ పాయింట్లలో ఒక కప్పు కూర ధర రూ. 30 నుంచి రూ. 50కి చేరడంతో, రెండు కూరలు కొనేవారు ఇప్పుడు ఒక్కదాంతోనే సర్దుకుపోతున్నారు. క్యాటరింగ్ రంగానిదీ ఇదే పరిస్థితి. కొత్తగా వచ్చే ఆర్డర్లపై ప్లేటుకు రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
వసతి భారం
హాస్టళ్లపై వాణిజ్య గ్యాస్ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. సుమారు 12 వేల హాస్టళ్లలో ఉంటున్న 11 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత, అధిక ధరలతో పాటు నిత్యావసరాల ధరలు కూడా పెరగడంతో హాస్టళ్ల నిర్వాహకులు భారీ నష్టాల్లో కూరుకుపోయారు. ఈ అదనపు భారాన్ని తట్టుకోలేక ఫీజులు పెంచడంతో పాటు మెనూలో కొంత కోతలు పెడుతున్నారు.


