మధిర: భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళకు ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మొదలైన ఘర్షణ.. సదరు మహిళ హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని మధిర మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతురాలిని కల్పనగా గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరుకు చెందిన గోపిశెట్టి కల్పన (27), మైలవరం మండలం బొర్రగూడెంకు చెందిన డేరంగుల నాగరాజు 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు జన్మించాక మనస్పర్దలతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆపై కల్పన కొంతకాలం తిరువూరులో, ప్రస్తుతం మధిరలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో వాయిద్యకారుడు విజయభాస్కర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడ్డాక, కొన్నాళ్లకు తిరువూరులోని ద్విచక్ర వాహనాల షోరూమ్‌లో పనిచేసే గంపలగూడెం మండలం కనుమూరుకు చెందిన యార్లగడ్డ చెన్నారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై విజయభాస్కర్, చెన్నారావు మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ప్రస్తుతం మేడూరులోని పుట్టింట్లో ఉంటూ మధిర వచ్చి వెళ్లే కల్పన రోజులాగే శనివారం కూడా బయలుదేరింది.
ఇద్దరం కలిసి మాట్లాడుదాం..
కల్పన విషయమై మాట్లాడే పని ఉందని, ఆమె కూడా వస్తున్నందున రావాలని చెన్నారావు.. విజయభాస్కర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో, తొలుత చెన్నారావు, కల్పన ద్విచక్ర వాహనంపై మధిర మండలం కృష్ణాపురం సమీపాన వెంచర్‌లోకి వెళ్లారు. ఆ లొకేషన్‌ను విజయభాస్కర్‌కు షేర్ చేయడంతో ఆయన కాసేపయ్యాక బయలుదేరాడు. అయితే, తొలుత వెళ్లిన చెన్నారావు, కల్పన మధ్య జరిగిన వాగ్వాదంతో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆపై చెన్నారావు వెళ్లిపోగా, కాసేపటికి లొకేషన్ ఆధారంగా చేరుకున్న విజయభాస్కర్‌కు ఇద్దరూ కనిపించకపోవడంతో వెనుదిరిగాడు.
కొద్దిసేపయ్యాక కల్పన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మధిర సీఐ మధు, సిబ్బంది చేరుకుని పంచనామా నిర్వహించారు. అంతేకాక మృతురాలి భర్త నాగరాజు, ఆమెతో పరిచయం ఉన్న విజయభాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హత్య అనంతరం పరారైన చెన్నారావు.. కల్పన సోదరుడి సెల్‌ఫోన్‌కు పలు అంశాలపై వాట్సప్ మెసేజ్‌లు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ వెల్లడించారు. కాగా, కల్పన వివాహేతర సంబంధం కారణంగా ఆమె కుమారుడు ఒంటరైపోయాడని స్థానికులు చెబుతున్నారు.


