బండి భగీరథ్ నా కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు
కేసు నమోదులో పోలీసుల తాత్సారం చేశారు
పత్రికా ప్రకటన విడుదల చేసిన బాధితురాలి తల్లి
సాక్షి, హైదరాబాద్: బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బాధితురాలైన మైనర్ బాలిక తల్లి తొలిసారిగా మీడియాకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘2025లో నా కుమార్తెకు భగీరథ్‌తో పరిచయం ఏర్పడింది. తరుచూ మాట్లాడుతూ నా కూతురి నమ్మకాన్ని చూరగొన్నాడు. క్రమంగా ఆమెను చదువుకు దూరం చేస్తూ, ఆమెకు ఇష్టం లేకపోయినా శారీరకంగా లొంగదీసుకోవడం కోసం నిరంతరం ఒత్తిడి తెచ్చాడు.
ఈ క్రమంలో 2025 డిసెంబర్ 31 రాత్రి మెయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో నా కుమార్తెకు బలవంతంగా మద్యం తాగించారు. దీంతో స్పృహ తప్పిన స్థితిలో ఉన్న ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించి, శారీరక దాడులకు తెగబడ్డాడు. తర్వాత బాలిక తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి భగీరథ్ నా కూతురితో చేసిన చాటింగ్‌లు, క్షమాపణల మెసేజ్‌లు మా వద్ద ఉన్నాయి’ అని ఆమె వెల్లడించారు.
తమపై ఒత్తిళ్లు : న్యాయపరమైన చర్యల కోసం తాము ప్రయత్నిస్తున్న క్రమంలో తమపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయని బాధితురాలి తల్లి తెలిపారు. ‘ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి మా నివాసానికి వచ్చి రాజీ కోసం ప్రయత్నించారు. మర్నాడు ఉదయం ఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో ఆయన్ను కలిసిన క్రమంలో అక్కడ మాకు భరోసా లభిస్తుందని ఆశిస్తే, దానికి భిన్నంగా రాజకీయ ప్రభావం, అనుచరుల అండదండల గురించి మాట్లాడుతూ మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేశారు’ అని ఆరోపించారు.
ఈనెల 8న తాము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. అధికారులు తమను దాదాపు 5 గంటల పాటు నిలబెట్టారని ఆవేదన చెందారు. జ్యురిస్‌డిక్షన్ నెపంతో కాలయాపన చేశారని, కేసు నమోదు చేయాలని తాము పట్టుబట్టడంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. మరోవైపు తాము ఫిర్యాదు చేసిన అదే సమయంలో కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో తమ కుటుంబంపై రూ.5 కోట్ల బ్లాక్‌మెయిల్, వసూళ్ల ఆరోపణలతో భగీరథ్ తరఫు వ్యక్తులు కౌంటర్ కేసు నమోదు చేశారన్నారు.


