మనవడు ఇక లేడని తెలిసి కూడా.. | Sakshi Special Story On Hyderabad Mecca Masjid 2007 blast | Sakshi
Sakshi News home page

మనవడు ఇక లేడని తెలిసి కూడా..

May 18 2026 7:05 AM | Updated on May 18 2026 7:08 AM

Sakshi Special Story On Hyderabad Mecca Masjid 2007 blast

2007 మే 18... శుక్రవారం... మండు వేసవి... మిట్ట మధ్యాహ్నం... పవిత్ర ప్రార్థనలు జరుగుతుండగా 1.25 గంటలకు బాంబు పేలింది. ఈ ఘాతుకంలో తొమ్మిది మంది ప్రాణాలు విడువగా... పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఆ క్షణం అప్రమత్తమైన పోలీసులు ఎండలో కొన్ని గంటల పాటు డ్యూటీ చేస్తూనే ఉన్నారు. మొఘల్‌పుర ప్రాంతంలోని ఓ ఇంటి యజమాని తన వీధిలో విధుల్లో ఉన్న పోలీసులను చూసి లోపలకు ఆహ్వానించారు. వారికి సపర్యలు చేస్తుండగానే ఫోన్‌ ద్వారా పిడుగులాంటి వార్త ఆ వృద్ధుడికి చేరింది. అదే పోలీసుల కాల్పుల్లో తన మనుమడు చనిపోవడం... అయినప్పటికీ తన సాంప్రదాయాలను, అతిథి మర్యాదల్నీ మర్చిపోని ఆ పెద్దాయన అన్న మాటల్ని అక్కడ ఉన్న పోలీసులు ఇప్పటికీ తలచుకుంటున్నారు. ‘మక్కా’ పేలుళ్లు జరిగిన 19 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఆ విషయాలను ఓ ఉన్నతాధికారి ‘సాక్షి ప్రతినిధి’తో పంచుకున్నారు. ఆ వివరాలివి...

హైదరాబాద్‌ పాతబస్తీలోని మక్కా మసీదులో ఉగ్రవాదులు రెండు బాంబుల్ని పెట్టారు. మధ్యాహ్న ప్రార్థనలు జరుగుతుండగా ఓ బాంబు పేలింది. దాన్ని ముష్కరులు అక్కడ ఉన్న మందపాటి సప్టా కింద పెట్టడంతో బ్లాస్ట్‌ ఇంపాక్ట్‌ తగ్గింది. ఫలితంగా పెను ప్రాణనష్టం తప్పి ఘటనాస్థలంలోనే ఐదుగురు మరణించగా... మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అదనంగా మరో 58 మంది క్షతగాత్రులయ్యారు. ఈ విషయం దేశ వ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. మక్కా మసీదులో బాంబు పేలిందని, ఆ ప్రభావానికి మసీదు మొత్తం కూలిపోయిందని పుకార్లు షికారు చేశాయి. దీంతో రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తన మక్కా మసీదు వద్దకు చేరుకున్నారు.

అప్పటికే ఉన్నతాధికారులు భారీ భద్రత ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కొంత సమయంలోనే పెద్ద సంఖ్యలో బలగాలు పాతబస్తీని... నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మక్కా మసీదు వద్దకు మరింత మంది ఆందోళన చేస్తూ వస్తుండటంతో పాటు రాళ్ల దాడులు మొదలయ్యాయి. దీంతో లాఠీచార్జ్, టియర్‌ గ్యాస్, వాటర్‌ క్యానన్ల ప్రయోగం తప్పలేదు. దీంతో పోలీసులకు–స్థానికులకు–మసీదు వద్దకు వచ్చే వారికి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే సమయంలో మొఘల్‌పుర వైపు కొందరు ఆందోళనకారులు దూసుకువస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

అక్కడి పరిస్థితులు, వాళ్ల చేతిలో ఉన్న వస్తువుల ఆధారంగా ఏదో జరగరానిది జరుగుతుందనే ఆందోళన అధికారులు, సిబ్బందిలో వ్యక్తమైంది. ఆ ఆందోళనకారులను అదుపు చేస్తుండగా... సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌కు నిప్పు పెట్టాలనే ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. అదే జరిగితే ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న పోలీసులు, ప్రజలు వందల సంఖ్యలో చనిపోతారని పోలీసులు భయపడ్డారు. పాతబస్తీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అప్పటికే అనేక మంది తమ ఇళ్లకు చేరారు. అలాంటప్పుడు పెట్రోల్‌ బంక్‌పై దాడి చేసే ఆందోళనకారులు దానికి నిప్పు పెడితే ఊహించని ఉపద్రవం తప్పదని నిర్థారించిన పోలీసులు అనివార్యంగా కాల్పులు జరపాల్సి వచ్చింది. అలా అల్లర్లను అదుపు చేయడానికి జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు. అదే రోజు మక్కా మసీదు నుంచి పేలకుండా ఉన్న మరో బాంబునూ స్వాధీనం చేసుకున్నారు.

అలా అల్లర్లు, ఉద్రిక్తతలు, రాళ్ల దాడులు, లాఠీచార్జ్, టియర్‌ గ్యాస్‌ ప్రయోగం, వాటర్‌ క్యానన్ల వినియోగం, నిఘా, గస్తీ, పికెట్లు... ఇలా కొన్ని గంటల పాటు సిబ్బంది, అధికారులు అంతా రోడ్లకు పరిమితం అయ్యారు. వీరికి కనీసం మంచి నీరు అందించడానికి ఉన్నతాధికారులకు సమయం చిక్కలేదు. అదే సందర్బంలో అన్ని దుకాణాలు మూతపడటంతో ఆహారం, టీ విషయం వదిలేస్తే.. మంచినీళ్లు దొరకడం కూడా కష్టసాధ్యమైంది. ఎవరికి వాళ్లు తమ ఇళ్లల్లో తలుపులు బిగించుకుని ఉండటంతో పాటు తీవ్ర భయాందోళనల్లో ఉన్న వాళ్లు కనీసం తలుపు తట్టినా తీసే పరిస్థితులు లేవు. ఇలా దాదాపు నాలుగైదు గంటల గడిచాయి.

అప్పుడే మరో అంశం తెరపైకి వచ్చింది. అల్లర్లు, ఆందోళనల తర్వాత చాలా మంది యువకుల, ఆందోళనకారుల ఆచూకీ తెలియలేదు. పేలుడు, కాల్పుల్లో చనిపోయిన వారిని, వారి కుటుంబీకుల గుర్తింపు పూర్తి కాలేదు. ఇవన్నీ జరిగితేనే మృతదేహాల పోస్టుమార్టం పక్రియ, కేసు దర్యాప్తు తదితరాలు వేగం పుంజుకుంటాయి. ఇన్ని ఆలోచనల, ఆచరణల మధ్య హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో కూడిన ఓ బృందం మొఘల్‌పురలోని ఓ ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఆ సమీపంలోని ఇంటి యజమాని మధ్యాహ్నం నుంచి వీరిని గమనిస్తూ... కనీసం మంచినీళ్లు కూడా తాగలేదనే విషయం గుర్తించారు. అప్పటికి పరిస్థితులు కొంత వరకు అదుపులోకి రావడంతో... వారిని తన ఇంట్లోకి ఆహ్వానించాలని భావించారు. అతికష్టమ్మీద పోలీసుల వద్దకు వచ్చిన ఆ పెద్దాయన తన ఇంటికి వచ్చి సేదతీరాలని కోరారు.

ఆ వృద్ధుడి ఇంటికి వెళ్లే విషయంలో కొద్దిసేపు ఆలోచించిన పోలీసు బృందం ఎట్టకేలకు అంగీకరించింది. అల్లర్లు అదుపులోకి రావడంతో కాస్త మంచినీళ్లు తాగి, కాలకృత్యాలు తీర్చుకోవడానికైనా వెళ్లిరావడం ఉత్తమమని భావించారు. దీంతో ఆ పోలీసు బృందం వృద్ధుడి వెంట ఆయన ఇంటికి వెళ్లింది. కుశల ప్రశ్నల, కాలకృత్యాల తర్వాత అంతా హాలులో కూర్చున్నారు. పోలీసులకు మంచినీళ్లు అందించిన ఆ పెద్దాయని... టీ, బిస్కెట్లు సిద్ధం చేస్తున్నారు. హఠాత్తుగా ఆయన జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ మోగింది. ఆ కాల్‌ మాట్లాడిన పెద్దాయన ముఖంలో రంగులు మారిపోయాయి. కంఠం ఒణుకుతుండగా... కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ‘ఆ రోజు మధ్యాహ్నం మొఘల్‌పుర పెట్రోల్‌ బంక్‌ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారిలో మీ మనుమడు కూడా ఉన్నాడు’ అనేది ఆ కాల్‌ సారాంశం. మృతదేహం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో ఉందని, కుటుంబీకులు వస్తే ఇతర ఫార్మాలిటీస్‌ పూర్తి చేయాలని అవతలి నుంచి పోలీసులు కోరారు.

ఈ విషయం తెలియడంతోనే అక్కడ ఉన్న పోలీసుల కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. మధ్యాహ్నం నుంచి తమను ఎవరూ పట్టించుకోకపోయినా... ఈ పెద్దాయన మాత్రం నేరుగా వచ్చి ఇంటికి ఆహ్వానించారు. ఆప్యాయంగా పలకరిస్తూ సంభాషించారు. ఇప్పుడు పోలీసుల తూటాలకు మనుమడిని కోల్పోయిన వార్త విని ఎలా స్పందిస్తారో..? అనే సందేహాలు అందరి మదిలో మెదిలాయి. వీలున్నంత త్వరలో అక్కడ నుంచి బయటపడాలని అంతా భావించారు. అప్పుడే నోరు విప్పిన పెద్దాయన ‘మీరు ఎందుకు ఫీల్‌ అవుతారు? ఏదీ ఎవరూ కావాలని చేయరుగా? అల్లర్లు అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు... వాడి ఆయువు తీరి పోవడంతో దేవుడి దగ్గరకు వెళ్లాడు’ అంటూ కన్నీళ్లు తుడుచుకున్నారు.

అంతటిలో ఆగని ఆయన ‘ఇంటి వచ్చిన అతిథిని గౌరవించి, వారికి సపర్యలు చేయడం మా సంస్కృతి, సాంప్రదాయం. మీరు కచ్చితంగా టీ, బిస్కెట్లు తీసుకున్నాకే మా గుమ్మం దాటాలి’ అని స్పష్టం చేశారు. తన ఇంటిలో ఉన్న పోలీసులు తిరిగివెళ్లిపోయే వరకు అక్కడే ఉన్న ఆ పెద్దాయని ఆ తర్వాతే ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి పరిగెత్తారు. ఆ ఉదంతం తర్వాత ఇప్పటి వరకు ఆ పెద్దాయన సహయం కోరుతూనో... తనకు కృతజ్ఞత చూపించాలనో ఆశించలేదు... పోలీసుల వద్దకు వెళ్లలేదు.

మక్కా మసీదులో పేలుడు, పేలని బాంబులపై స్థానిక హుస్సేని ఆలం పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ సెల్‌కు (ఎస్‌ఐసీ) బదిలీ అయ్యాయి. అక్కడ నుంచి సీబీఐ చేతుల మీదుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దగ్గరకు వెళ్లాయి. 2008 అక్టోబర్‌ 28న మహారాష్ట్రలోని మాలేగావ్‌ పేలుడు కేసులో ఏటీఎస్‌ అధికారులు అభినవ్‌ భారత్‌కు చెందిన సాథ్వీ ప్రజ్ఞాసింగ్, శ్రీకాంత్‌ పురోహిత్‌లను అరెస్టు చేశారు. వీరి విచారణలో అజ్మీర్‌ పేలుడుకు బాధ్యులైన దేవేంద్ర, లోకేష్, రామ్‌చంద్ర, సందీప్‌ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్‌ ఏటీఎస్‌ అధికారులు దేవేంద్రగుప్తా, లోకేష్‌ శర్మలను 2010 ఏప్రిల్‌ 28న అరెస్టు చేశారు. వీరి విచారణలో ‘మక్కా’ పనీ తమదే అని అంగీకరించడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి రాజస్థాన్‌ వెళ్లారు. 

సీబీఐ అధికారులు 2010 జూన్‌ 11న దేవేంద్రగుప్తా, లోకేష్‌ శర్మలపై నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్స్‌ పొందారు. వీరిని రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌ తీసుకురావడానికి ప్రత్యేక బృందంతో అక్కడకు వెళ్లి 18న హైదరాబాద్‌ తీసుకువచ్చారు. న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో స్వామి అశిమానంద పేరు వెలుగులోకి వచ్చింది. మారు పేరుతో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో రహస్య జీవితం గడుపుతున్న స్వామి అశిమానందను సీబీఐ అధికారులు 2010 నవంబరు 19న అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతర నిందితులైన రామ్‌చంద్ర, సందీప్‌లు ఇంకా పరారీలోనే ఉన్నారు. కేంద్ర హోమ్‌ మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు ‘మక్కా’ కేసు దర్యాప్తు సీబీఐ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు 2011 ఏప్రిల్‌ 7న బదిలీ అయింది. పరారీలో ఉన్న రామ్‌చంద్ర, సందీప్‌లపై రూ.20 లక్షల రివార్డు ప్రకటించిన ఎన్‌ఐఏ గాలించింది. ‘మక్కా’లో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అధికారులు 2011 మే 16న మరో సప్లమెంటరీ చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులు 2018 ఏప్రిల్‌లో వీగిపోయాయి. నిందితులను దోషులుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైంది.

– శ్రీరంగం కామేష్, క్రైమ్‌ రిపోర్టర్, హైదరాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement