breaking news
Mecca Masjid bomb blasts
-
పేలుడు నుంచి తీర్పు దాకా..
సాక్షి, హైదరాబాద్: చరిత్రాత్మక మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగి పదకొండేళ్లు అవుతోంది. కేసు దర్యాప్తు నాలుగు చేతులు మారింది. మొత్తం పది మందిని నిందితులుగా చేర్చగా.. అందులో ముగ్గురు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. ఆరుగురిని అరెస్టు చేయగా.. ఐదుగురిపై న్యాయస్థానంలో అభియోగ పత్రాలు దాఖలయ్యాయి. ఒక నిందితుడు 2007లో మధ్యప్రదేశ్‌లో హత్యకు గురయ్యాడు. మొత్తంగా సుదీర్ఘ విచారణ తర్వాత సోమవారం ఈ కేసు వీగిపోయింది. అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పేలుడు నాటి నుంచి తీర్పు ఈ కేసులో కీలక పరిణమాలు ఇవీ.. 2007 మే 18 మధ్యాహ్నం 1.25 గంటలకు మక్కా మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఘటనాస్థలంలోనే ఐదుగురు మరణించగా.. నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 58 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన తర్వాత చెలరేగిన అల్లర్లను అదుపు చేయడానికి జరిగిన పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మక్కా మసీదులో పేలకుండా ఉన్న మరో బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2007 మే 24 మక్కా మసీదు పేలుడు, బాంబు దొరికిన కేసుల దర్యాప్తు బాధ్యతను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నుంచి సీబీఐకి అప్పగించారు. తొలుత స్థానిక హుస్సేనీ ఆలం పోలీసుస్టేషన్లో కేసులు నమోదు చేసినా.. తర్వాత సీసీఎస్‌లోని సిట్‌కు బదిలీ అయ్యాయి. 2007 జూన్ 10 అప్పటి సీబీఐ ఎస్పీ ఆర్.ఎస్.దినకర్ ప్రసాద్ నేతృత్వంలో డీఎస్పీ ఠాకూర్, ఇన్స్పెక్టర్లు శర్మ, ప్రక్యాల్లతో కూడిన బృందం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. 2008 అక్టోబర్ 28 మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుడు కేసులో అక్కడి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అభినవ్ భారత్ సంస్థకు చెందిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్, శ్రీకాంత్ పురోహిత్‌లను అరెస్టు చేశారు. వారిని విచారించినప్పుడు రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో పేలుళ్లకు బాధ్యులైన దేవేంద్ర గుప్తా, లోకేశ్ శర్మ, రామచంద్ర, సందీప్‌ల పేర్లు బయటికి వచ్చాయి. 2010 ఏప్రిల్ 28 రాజస్తాన్ పోలీసులు దేవేంద్ర గుప్తా, లోకేశ్ శర్మలను అరెస్టు చేసి విచారించిన సమయంలో.. మక్కా మసీదులో పేలుళ్లకు పాల్పడింది కూడా తామేనని వెల్లడించారు. దీంతో సీబీఐ అధికారులు వారిని విచారించాలని నిర్ణయించారు. 2010 జూన్ 11 దేవేంద్ర గుప్తా, లోకేశ్ శర్మలను తీసుకువచ్చి, విచారించేందుకు సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారంట్లు పొందారు. 2010 జూన్ 18 ప్రత్యేక బృందంతో రాజస్తాన్‌కు వెళ్లిన సీబీఐ అధికారులు.. దేవేంద్ర, లోకేశ్‌లను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. న్యాయస్థానం అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుని విచారించగా.. స్వామి అసీమానంద పేరు వెలుగులోకి వచ్చింది. 2010 నవంబర్ 19 ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో మారుపేరుతో రహస్య జీవితం గడుపుతున్న స్వామి అసీమానందను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. రామచంద్ర, సందీప్‌ల కోసం గాలింపు ముమ్మరం చేశారు. 2010 డిసెంబర్ 13 ఈ కేసులో సీబీఐ అధికారులు ప్రిలిమినరీ చార్జిషీట్ దాఖలు చేశారు. అసీమానంద మినహా మిగతా ఇద్దరు నిందితులు దేవేంద్ర, లోకేశ్‌లపై నాంపల్లి కోర్టులో 75 పేజీల అభియోగపత్రం దాఖలు చేశారు. అప్పట్లో అసీమానంద పోలీసు కస్టడీలో ఉండటంతో అభియోగాలు నమోదు చేయలేదు. 2011 ఏప్రిల్ 7 కేంద్ర హోం శాఖ నిర్ణయం మేరకు మక్కా పేలుడు కేసు దర్యాప్తు సీబీఐ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయింది. పరారీలో ఉన్న రామచంద్ర, సందీప్, అశోక్‌లపై రూ.20 లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ.. గాలింపు ముమ్మరం చేసింది. 2011–2013 ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు 2011 మే, 2012 జూలై, 2013 ఆగస్టులలో అసీమానంద సహా పలువురిపై మూడు సప్లిమెంటరీ చార్జిషీట్లు దాఖలు చేశారు. అరెస్టైన వారిలో తేజోరామ్ పర్మార్‌పై మాత్రం అభియోగాలు నమోదు కాలేదు. సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందనే ఉద్దేశంతో వారి వివరాలను గోప్యంగా ఉంచారు. 2018 ఏప్రిల్ 16 నిందితులను దోషులుగా నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించలేకపోవడం, ప్రాసిక్యూషన్ వైఫల్యం, అనేకమంది సాక్షులు ఎదురుతిరిగిన నేపథ్యంలో మక్కా పేలుడు కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు. దేవేంద్ర గుప్తా, లోకేశ్ శర్మ, స్వామి అసీమానంద, భరత్ మోహన్‌లాల్ రతీశ్వర్, రాజేంద్ర చౌదరిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు. తీర్పులో న్యాయం లేదు మక్కా మసీదు బాంబు పేలుళ్లలో మా బావ జాఫర్ మృతి చెందాడు. పెళ్లయి ఏడాది కాకముందే మరణించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న జాఫర్‌ను నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు చనిపోయాడు. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయం లేదు. దోషులను శిక్షించాల్సింది పోయి నిరపరాధులుగా విడుదల చేయడం సరైంది కాదు. – మహ్మద్ ఉమర్, మృతుడు జాఫర్ బావమరిది సరైన న్యాయం చేయలేదు బాంబు పేలుళ్ల ఘటనలో ప్రార్థనలకు వెళ్లిన మా అల్లుడు షేక్ నహీం మృతి చెందాడు. దాంతో అతడి తల్లి అనారోగ్యం పాలైంది. తీర్పు అనుకూలంగా రాలేదు. ఎన్ఐఏ సరైన న్యాయం చేయలేదు. – మహ్మద్ సలీం, మృతుడు షేక్ నహీం మేనమామ ఓ బాంబును నిర్వీర్యం చేశాం మక్కా మసీదు బాంబు పేలుళ్లు మధ్యాహ్నం 1.20 గంటలకు జరిగినట్లు సమాచారం అందడంతో ఘటనా స్థలికి చేరుకున్నాం. చార్మినార్ వద్ద పరిస్థితి తీవ్రంగా ఉండటంతో సివిల్ డ్రెస్సులో లోపలికి వెళ్లాం. అప్పటికే రాళ్ల దాడులు, గొడవలు జరుగుతున్నాయి. పేలుడు జరిగిన బండరాయి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నాం. అందులో బాంబు ఉంది. వెంటనే ఖిల్వత్ ప్లే గ్రౌండ్లోకి తీసుకెళ్లి బాంబును నిర్వీర్యం చేశాం. – సీహెచ్. నాగసాయి, బాంబు స్క్వాడ్ ఇన్స్పెక్టర్ -
ఈ తీర్పు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు నూటికి నూరుపాళ్లు అన్యాయమైనదని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రాజకీయ జోక్యానికి తలొగ్గి, కేసును నీరుగార్చిందని ఆరోపించారు. సోమవారం మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు అనంతరం.. మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షుల్లో అత్యధిక భాగం ప్రతికూలంగా మారిపోయారు. కీలక సాక్షులు మాటమార్చారు. ఇంత జరుగుతున్నా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుడ్డి, చెవిటిదానిలా మిన్నకుండిపోయింది. అసలు ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తును సరిగా ముందుకు తీసుకెళ్లలేదు. అరెస్టైన ప్రధాన నిందితులకు 90 రోజులలోపే బెయిల్ వచ్చినా దానిని సవాల్ చేయలేదు. ఎన్ఐఏ రాజకీయ జోక్యానికి తలొగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో న్యాయమన్నదే లేకుండా పోయే ప్రమాదముంది..’’అని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం, ఎన్ఐఏ వ్యవహరించాయని ఆరోపించారు. పేలుళ్లలో మరణించినవారి కుటుంబాలకు న్యాయం దక్కలేదన్నారు. కర్ణాటకలో జేడీఎస్‌కు మద్దతిస్తాం.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, జేడీఎస్‌కు మద్దతిస్తామని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా విఫలమయ్యాయని.. అభివృద్ధి జరగాలంటే బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు. అందుకోసమే జేడీఎస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించామని.. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటామని చెప్పారు. అవసరమైతే జేడీఎస్ తరఫున బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. -
'హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం.. అవరమైతే సుప్రీం కోర్టుకు..'
2007 మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో అనుమానితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించడాన్ని తప్పుపట్టిన హైకోర్టు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయనుంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం సోమవారం వెల్లడించిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని.. అవసరమనుకుంటే సుప్రీంకోర్టును సంప్రదిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ అన్నారు. ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డితో షబ్బీర్ ఆలీ చర్చించారు. జాతీయ మైనారిటీ కమిషన్ సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 6 తేదిన ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అహ్మదుల్లా చేతులు మీదుగా పరిహారాన్ని చెక్కుల రూపంలో చెల్లించింది. గతంలో మక్కా పేలుళ్ల కేసులో అనుమానితులుగా తమను అరెస్ట్ చేసిన కారణంగా తాము మానసిక వేదనతో పాటు, సామాజికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తమకు పరిహారం ఇప్పించాలని కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 20 మందికి ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, ఇంటరాగేషన్ నుంచి బయట పడిన వారికి రూ.20వేల చొప్పున కూడా చెల్లించింది. ఈ చర్యలను సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన ఎస్.వెంకటేష్‌గౌడ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం అనుమానితులకు దాదాపు 70 లక్షల రూపాయల మేర పరిహారం చెల్లిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తన పరిధి దాటి పరిహారం చెల్లించిందని, ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది.