
పావురాల విసర్జన ప్రాణాంతకంగా మారుతోందంటూ భారతీయ నగరాల్లో గత కొంతకాలంగా తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై ముంబై వంటి మెట్రోలకు చెందిన కొందరు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో ఇటీవల పావురాలకు ఆహారం (దాణా) వేయడాన్ని నియంత్రించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను నిరసిస్తూ జంతు సంరక్షణ కార్యకర్తలు పెటా ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
‘‘ముంబైలోని మూడు అతిపెద్ద ఆసుపత్రుల డేటా ప్రకారం, గత ఏడాదిలో వచ్చిన శ్వాసకోశ అనారోగ్య కేసుల్లో కేవలం 0.3% మాత్రమే పావురాలతో ముడిపడి ఉన్నాయి. అంతర్జాతీయ పరిశోధన కూడా పావురాల నుంచి మానవులకు వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువగా ఉందని తేల్చింది.
పావురాలు సహజంగా బర్డ్ ఫ్లూకు నిరోధకతను కలిగి ఉంటాయి’’ అని పెటా వాదిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వాలకు పలు సూచనలు కూడా చేస్తోంది. కబుతర్ ఖానా దగ్గర నిర్దిష్ట దాణా సమయాలు కేంద్రాలను నియమించడం, ఈ ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం పారిశుధ్యాన్ని నిర్వహించడం సరైన దాణా పద్ధతులు పావురాల వల్ల కలిగే కనీస ఆరోగ్య ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించే బహుభాషా సందేశాలను ఇన్‌స్టాల్ చేయడం వంటివి చేయాలని సూచిస్తోంది.
‘పావురాలు లేకుండా ముంబై ఆకాశం ఎలా ఉంటుంది? దాణా నిషేధాలతో, ఈ సున్నితమైన పక్షులు ఆకలి బారిన పడతాయి. ‘ప్రతి ఒక్కరూ పావురాలు కూడా నగరవాసులే అంటూ గుర్తు చేస్తూ పలువురు ముంబైకర్లు ’పావురాలు’గా మారారు‘ భారీ పావురాల ముసుగులు ధరించి ప్రజలు తమ దైనందిన జీవితాన్ని గడుపుతున్నట్లు చూపించే వీడియోను పెటా షేర్ చేసింది.
అయితే ఈ విషయంలో పెటాపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అయింది. గతంలో ఎన్నడూ ఏ అంశంపైనా రానంతగా ఈ విషయంలో ప్రజలు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ‘‘ ‘పావురాలు వాటి విసర్జన ద్వారా క్రిప్టోకోకోసిస్, హిస్టోప్లాస్మోసిస్ సిట్టాకోసిస్ వంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయి.‘ అంటూ ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో ద్వజమెత్తారు. ‘పావురాలు ఎగిరే ఎలుకలుగా అనొచ్చు. అవి తక్కువ సంఖ్యలో ఉంటే పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.
కానీ సమూహాలుగా ఉంటే, నగర నివాసితుల ఆరోగ్యంపై (శ్వాసకోశ సమస్యలు, వ్యాధి వ్యాప్తి మొదలైనవి) చాలా హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. మీరు భారతీయుల ఆరోగ్యం గురించి పట్టించుకోండి అంటూ మరో వ్యక్తి సూచించాడు. ‘ఈ జంతు హక్కుల కార్యకర్తలు దేశం గురించి ఎప్పుడూ ఆలోచించరు. పావురాల మలం మానవ ఆరోగ్యానికి ప్రమాదకరం. కుక్కలు పావురాలు దేశానికి అతిపెద్ద ముప్పు. రాబోయే సంవత్సరాల్లో వాటి జనాభాను తగ్గించాలి అంటూ మరొకరు తీవ్రంగా దుయ్యబట్టారు.