షోలే సినిమాను సినీ అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. అలాగే ఆ సినిమాలోని యే దోస్తీ హమ్ నహీ తోడేంగే పాటను కూడా మరిచిపోలేరు. ఆ పాటలో స్నేహితులైన జై–వీరు (అమితాబ్–ధర్మేంద్ర) మోటార్ సైకిల్ బాలీవుడ్‌లో ఉపయోగించిన అత్యంత ప్రసిద్ధ స్క్రీన్ వస్తువులలో ఒకటిగా నిలుస్తుంది. ఈ పురాతన మోటార్ సైకిల్ 1942 బిఎస్‌ఎ డబ్ల్యుడబ్ల్యుయ20 సినిమాలోని ప్రసిద్ధ పాట యే దోస్తీ హమ్ నహీ తోడెంగేలో తెరపై కనిపిస్తుంది. «లెజండరీ నటుడు దర్మేంద్ర మృతి తర్వాత ఈ మోటార్ సైకిల్ తిరిగి వెలుగులోకి వచ్చింది.
ఒకప్పుడు కర్ణాటకలోని రామనగర కొండల లో ప్రయాణించిన ఈ పాతకాలపు యంత్రం ఇటీవల గోవాలో ముగిసిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఎఫ్‌ఎఫ్‌ఐ 2025)లో ప్రదర్శనకు నోచుకుని ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. షోలే(Sholay) 50 సంవత్సరాల వేడుకల్లో భాగంగా, సినీ అభిమానులను తక్షణమే సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లే‘ వస్తువులను ప్రదర్శించడమే లక్ష్యంగా దీన్ని మరోసారి అందరి ముందుకు తెచ్చినట్టుంది కర్ణాటక ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ ’డిఐపిఆర్) కమిషనర్ ఎడిజిపి హేమంత్ నింబాల్కర్ అంటున్నారు.
ఈ చిత్రంలో వినియోగించిన బైక్‌ను బెంగళూరు మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి బెంగళూరు బిజినెస్ కారిడార్ చైర్‌పర్సన్ ఎల్‌కె అతిక్ దాదాపు మూడు సంవత్సరాల క్రితం స్వంతం చేసుకున్నారని హేమంత్ నింబాల్కర్ వివరించారు. ఈ బిఎస్‌ఎ మోటార్‌సైకిల్ కర్ణాటకలో కుటుంబానికి చెందిన తాత నుంచి మనవడికి అన్నట్టు వారసత్వంగా చేతులు మారుతోంది.
ఈ ప్రఖ్యాత జై–వీరు మోటార్‌సైకిల్‌ను బ్రిటిష్ సంస్థ బర్మింగ్‌హామ్ స్మాల్ ఆర్మ్స్ తయారు చేసింది. ఈ బైక్స్‌ను రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం కోసం భారీ సంఖ్యలో ఉత్పత్తి చేశారు. సైనిక సేవలో ఇది గంటకు 55–60 కి.మీ. వేగంతో సమర్ధవంతంగా పనిచేసింది. 1942లో, బ్రిటిష్ సైన్యం ఈ మోడల్‌ను దాదాపు 50 నుంచి 60 పౌండ్లకు కొనుగోలు చేసింది, ఇది ఆ సమయంలో మన రూపాయల్లో చెప్పాలంటే దాదాపు రూ.700 నుంచి రూ.800 వరకు ఉండేది.
ఇక ఈ చిత్రంలో ఉపయోగించిన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంవైబి 3047 కాగా ఇది ఛాసిస్ నంబర్ ఎం 20 116283 , ఇంజిన్ నంబర్ ఎం 20 4299లను కలిగి ఉంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే ఇది 12.5 హార్స్‌పవర్‌ను అందించే 500 సిసి సింగిల్–సిలిండర్ సైడ్–వాల్వ్ ఇంజిన్ తో శక్తి నిచ్చింది. ఇది గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోగలదు, ఈ బైక్ బరువు 170 కిలోగ్రాములు 13–లీటర్ ఇంధన ట్యాంక్‌తో వచ్చింది.
దీనిలో ముందు భాగంలో గిర్డర్ ఫోర్కులు వెనుక పెద్ద క్యారియర్ ఉన్నాయి. రెండు చక్రాలకు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి యుద్ధకాలంలో రబ్బరు కొరత కారణంగా, హ్యాండిల్‌బార్లు ఫుట్‌రెస్ట్‌లను కాన్వాస్‌లో చుట్టబడిన లోహంతో తయారు చేశారు.


