మంగళవారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్, బరోడా జట్ల మధ్య జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ఈ పరుగుల పండగ కనిపించింది.
ప్రవేశం ఉచితమైనా సరే... సాధారణంగా దేశవాళీ మ్యాచ్‌లకు ప్రేక్షకులు మైదానానికి రావడం తక్కువ. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్న ముస్తాక్ అలీ టి20 టోర్నీ మ్యాచ్‌లలో అన్ని చోట్లా దాదాపు ఇదే పరిస్థితి ఉంది.
అయితే అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యాలు ఆడుతుండటంతో పంజాబ్, బరోడా మ్యాచ్‌పై బాగా ప్రచారం జరిగింది. దాంతో పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వచ్చారు.
ఈస్ట్, వెస్ట్ గ్యాలరీలలోకి వారిని అనుమతించారు. ఇక్కడి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అసలు సమస్య అభిమానులు చప్పట్లతో సరిపెట్టకుండా మైదానంలోకి దూసుకుపోవడంలోనే కనిపించింది! ఒకటి కాదు, రెండు కాదు నాలుగు సార్లు కొందరు ఫ్యాన్స్ గ్యాలరీల్లోంచి దూకి గ్రౌండ్‌లోకి వచ్చేశారు.
ఇక్కడ భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. గ్రౌండ్ సెక్యూరిటీతో పరిమిత సంఖ్యలోనే పోలీసులు ఉండటంతో నియంత్రణ సాధ్యం కాలేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఈ మ్యాచ్‌ల కోసం కనీస ఏర్పాట్లు చేయలేకపోయిందనేది స్పష్టం.
ఆటగాళ్లకు చేరువగా వెళ్లడం, చేతులు కలపడం, కాళ్లు మొక్కడం మాత్రమే కాదు ఏకంగా సెల్ఫీలు తీసుకోవడం, కౌగిలించుకునే ప్రయత్నం చేయడం అభిషేక్ శర్మను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది!
ఇది నిజంగా దురభిమానంగా మారి ఏదైనా ప్రమాదం తలెత్తి ఉంటే బాధ్యత ఎవరిది?


