బంగారం ధరలు: ‘కొత్త’ మార్క్‌ తప్పదా? | Gold price could hit 5000 usd in 2026 says Bank of America | Sakshi
Sakshi News home page

బంగారం ధరలు: ‘కొత్త’ మార్క్‌ తప్పదా?

Nov 25 2025 9:35 PM | Updated on Nov 25 2025 9:39 PM

Gold price could hit 5000 usd in 2026 says Bank of America

బంగారం రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. డిసెంబరులో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాల బలంతో మంగళవారం (నవంబర్ 25) పసిడి ధరలు గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్‌కు 4,175 డాలర్ల (సుమారు రూ.3.72 లక్షలు) దాకా చేరాయి. పుత్తడి గత కొన్ని నెలలుగా శక్తివంతమైన ర్యాలీని కొనసాగిస్తోంది. ఈ ధోరణి వచ్చే ఏడాదిలోనూ కొనసాగొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) తాజా అంచనాల ప్రకారం.. 2026లో బంగారం సగటు ధర ఔన్స్‌కు 4,538 డాలర్ల వద్ద ఉండొచ్చు. ముఖ్యమైన స్థూల ఆర్థిక టెయిల్‌విండ్స్, అలాగే పెరుగుతున్న సురక్షిత-ఆశ్రయ డిమాండ్ ఈ ధరను మరింతగా 5,000 డాలర్ల వరకు తీసుకెళ్లే అవకాశాన్ని సూచిస్తున్నాయి.

ప్రస్తుత ధోరణులు

అంతర్జాతీయంగా, గత సెషన్‌లో దాదాపు 2% పెరుగుదల తరువాత బంగారం సోమవారం కూడా బలంగా ట్రేడ్ అయింది. బలహీనమైన దిగుబడులు, స్థూల అనిశ్చితి, సురక్షిత పెట్టుబడులపై పెరిగిన ఆసక్తి.. ఇవన్నీ స్పాట్ ధరలను చరిత్రాత్మక గరిష్ట స్థాయికి సమీపంలో నిలిపాయి. ఎంసీఎక్స్‌(MCX)లో బంగారం ధరలు ప్రారంభ ట్రేడింగ్‌లో 1% కంటే ఎక్కువ ఎగిశాయి.

బంగారం ప్రస్తుతం “ఓవర్ బైట్” గా ఉన్నప్పటికీ, అదే సమయంలో “అండర్ ఇన్వెస్ట్” గా కూడా ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా భావిస్తోంది. అంటే ధరలు చరిత్రాత్మకంగా బలంగా పెరిగినా, పెద్ద సంస్థాగత పెట్టుబడులు ఇంకా పూర్తి స్థాయిలో ప్రవేశించలేదని సూచిస్తుంది. దీంతో భవిష్యత్తులో మరింత పెరుగుదలకు అవకాశం ఉన్నదని సూచిస్తుంది. అయితే ఫెడ్ తిరిగి తీవ్రమైన ద్రవ్యోల్బణ నియంత్రణపై దృష్టి పెట్టి వడ్డీ రేట్లను పెంచితే, బంగారం పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు.

2026లో బంగారం ధర పెరుగుదలకు చోదకాలు

  • పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు

  • నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిడి

  • తక్కువ వడ్డీ రేట్ల వాతావరణం

  • అసాధారణమైన యూఎస్ ఆర్థిక విధానాల ప్రభావం

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

ప్రస్తుతం (నవంబర్‌ 25)  హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో తులం బంగారం ధరలు రూ. 1,16,450 (22 క్యారెట్స్‌), రూ. 1,27,040 (24 క్యారెట్స్‌) వద్ద ఉన్నాయి.

చెన్నైలో బంగారం 10 గ్రాముల ధరలు రూ. 1,17,200 (22 క్యారెట్స్‌), రూ. 1,27,860 (24 క్యారెట్స్‌)గా కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం రూ. 1,16,600 (22 క్యారెట్స్‌), రూ. 1,27,190 (24 క్యారెట్స్‌) వద్ద ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement